
కొడవలి గ్యాంగ్ అనే పేరు మహారాష్ట్రలో ప్రస్తుతం మారు మోగుతోంది. ఈ పేరు వింటేనే జనం వణికిపోతున్నారు. పూణేతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో ఈ ముఠా భయభ్రాంతులను సృష్టిస్తోంది. తాజాగా పింప్రీ-చించ్‌వడ్‌లో ఓ కొడవలి గ్యాంగ్.. స్థానికంగా వున్న ఓ మందుల దుకాణంలో ప్రవేశించి అక్కడి సిబ్బందిపై దాడికి దిగి విధ్వంసం సృష్టించింది. అంతకుముందే కామ్‌గార్ నగర్ ప్రాంతంలో పలు వాహనాలను కూడా ధ్వంసం చేశారు. పుణే నగరంలోనూ ఈ దాడులు జరిగినట్లు చెప్పారు.
కాగా.. మహారాష్ట్రలో గడిచిన నాలుగు నెలల వ్యవధిలో 100కు పైగా ఘటనల్లో కొడవలి గ్యాంగ్ ప్రమేయం వుందని పోలీసులు తెలిపారు. కొడవళ్లను ఆసరాగా తీసుకుని నేరాలకు పాల్పడుతూ వుండటంతో వారిని మహారాష్ట్ర వాసులు కొయతా (కొడవలి గ్యాంగ్‌లు)గా పిలుస్తున్నారు. ఇటీవల జరిగిన శాసనసభ సమావేశాల్లోనూ ఈ అంశంపై వాడివేడి చర్చ జరిగింది. ఈ ముఠా అంతు చూడాలని పోలీసులకు ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ఆదేశాలు జారీ చేశారు. అయినప్పటికీ పరిస్థితిలో మార్పు రాకపోవడంతో ఎప్పుడేం జరుగుతుందోనని జనం భయభ్రాంతులకు గురవుతున్నారు.