
Ludhiana gas leak: పంజాబ్‌లోని (Punjab) లూథియానాలో (Ludhiana) విషాదం చోటుచేసుకుంది. ఆదివారం ఉదయం ఓ ఫ్యాక్టరీలో గ్యాస్ లీక్ (Gas Leak) అవడంతో ఇద్దరు చిన్నారులు సహా 11 మంది చనిపోయారు.మరో 11 మంది ఆసుపత్రి పాలయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. బాధితులను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ఫ్యాక్టరీ చుట్టు పక్కల ఉన్నవారిని కూడా ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారు.
ఆ ప్రాంతంలో జన సామర్థ్యం అధికంగా ఉండటంతో సహాయ చర్యలకు ఇబ్బంది వాటిల్లుతుందని అన్నారు. మృతుల్లో అత్యధికులు వలస కార్మికులేనని తెలుస్తోంది. అయితే.. ప్రమాదం జరిగినప్పుడు ఏ వాయువు వెలువడిందో ఇంకా తెలియలేదు. మృతుల మృతదేహాలను పరిశీలించిన వైద్యులు విష వాయువులు వల్ల మరణాలు సంభవించినట్లు తెలిపారు. మృతదేహాల ఊపిరితిత్తులపై ఎలాంటి ప్రభావం చూపలేదు.
మృతులకు నష్టపరిహారం
పంజాబ్ ప్రభుత్వం మృతుల కుటుంబాలకు రూ. 2 లక్షలు, గాయపడిన వారికి రూ. 50,000 చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించిందని లూథియానా డిప్యూటీ కమిషనర్ సురభి మాలిక్ తెలిపారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు. ఘటనా స్థలానికి వైద్యుల బృందాన్ని, అంబులెన్స్‌లను కూడా రప్పించారు.
ఈ ఘటనపై లూథియానా డిప్యూటీ కమిషనర్ (డిసి) సుర్భి మాలిక్ మాట్లాడుతూ..మరణించిన వారు శ్వాసకోశ సమస్యలు తల్లెత్తినట్టు, న్యూరోటాక్సిన్ (నాడీ వ్యవస్థను ప్రభావితం చేసే విషం) మరణానికి కారణం కావచ్చునని తెలిపారు. మురుగునీటిలో రసాయన చర్య జరిగి ఉండవచ్చని భావిస్తున్నారు.నేషనల్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ ఫోర్స్ (ఎన్‌డిఆర్‌ఎఫ్) బృందాలను రప్పించారు. గ్యాస్ లీకేజీని అరికట్టేందుకు యంత్రాలను అమర్చారు. మురుగునీటి మ్యాన్‌హోల్ శాంపిల్ ను సేకరించినట్టు తెలిపారు.
మృతుల్లో ఆరుగురు పురుషులు, ఐదుగురు మహిళలు ఉన్నారు. వారిని సౌరవ్ (35), వర్ష (35), ఆర్యన్ (10), చూలు (16), అభయ్ (13), కల్పేష్ (40),నీతూ దేవి ,నవనీత్ కుమార్,గుర్తు తెలియని మహిళ (40), తెలియని మహిళ (25), గుర్తు తెలియని వ్యక్తి (25)గా గుర్తించారు. మరణించిన వారిలో ఎక్కువ మంది వలస కూలీలే.
పంజాబ్ సీఎం సంతాపం
ఈ సంఘటనపై పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ విచారం వ్యక్తం చేశారు. సాధ్యమైన అన్ని సహాయాలు అందిస్తున్నట్లు తెలిపారు. "లూథియానాలోని గియాస్‌పురా ప్రాంతంలో గ్యాస్ లీక్ ఘటన చాలా బాధాకరం. పోలీసులు, అడ్మినిస్ట్రేషన్ , NDRF బృందాలు సంఘటనా స్థలంలో ఉన్నాయి. సాధ్యమైన అన్ని సహాయం అందించబడుతున్నాయి" అని మన్ ట్వీట్ చేశాడు.