మటన్ బిర్యానీ మొదలు చిల్లి చికెన్ వరకు.. ఆ జైలులో స్పెషల్ మీల్స్.. మంత్రి కోసమేనా?

By Mahesh KFirst Published Oct 2, 2022, 5:55 PM IST
Highlights

పశ్చిమ బెంగాల్‌లోని కోల్‌కతాలోని జైలులో దుర్గా పూజా వేడుకలు పురస్కరించుకుని ఖైదీలకు ప్రత్యేక వంటకాలు పెడుతున్నారు. ఇందులో మటన్ బిర్యానీ, మటన్ కాలియా మొదలు చిల్లి చికెన్, ఫిష్ వెరైటీల వరకూ ఉన్నాయి.

కోల్‌కతా: జైలు కూడు తింటావురా.. అనే ఒక రకమై తిట్టు ఇప్పటికీ ప్రచారంలో ఉన్నది. జైలుకు వెళ్లి బాధపడతావ్ అనే కోణంలో ఈ మాట ప్రత్యర్థులపై ఆగ్రహంగా ప్రయోగిస్తుంటారు. జైలు కూడుపై ఉన్న అభిప్రాయాన్ని పక్కనపెడితే..  ఈ జైలులో అందించే స్పెషల్ మీల్స్ మెనూ చూస్తుంటే మాత్రం నోరూరిపోతుంది. మటన్ బిర్యానీ మొదలు నరవతన్ కుర్మా, చిల్లి చికెన్ వరకు ఊరించే వంటకాలు ఈ జైలులో ఖైదీలకు సర్వ్ చేయనున్నారు.

జైలులో ఖైదీల జీవితం చాలా దయనీయంగా ఉంటుందనేది అందరి అభిప్రాయం. మానసికంగానైనా.. అక్కడి వసతుల రీత్యా అయినా, ఆప్తులకు దూరంగా ఉండటం చేత అయినా బాధాకరంగా ఉంటుందనే చాలా మంది భావిస్తారు. కానీ, పశ్చిమ బెంగాల్‌లో దక్షిణ కోల్‌కతాలోని జైలు మాత్రం ఖైదీలకు నోరూరించే వంటకాలు అందించడానికి సిద్ధం అయింది. ఈ ప్రెసిడెన్సీ సెంట్రల్ కరెక్షనల్ హోమ్‌లో సుమారు 2,500 ఖైదీలు ఉన్నారు. వీరికి అక్టోబర్ 2వ తేదీ నుంచి 5వ తేదీ వరకు అంటే.. దుర్గా పూజా వేడుకల సందర్భంగా ఖైదీలుకూ అదిరిపోయే ఆహారం అందించాలని నిర్ణయించారు.

ఖైదీలందరికీ అల్పాహారం, లంచ్, డిన్నర్‌ల కోసం ప్రత్యేక మెనూ రెడీ చేశారు. రుచికరమైన, విలాసవంతమైన నాన్ వెజ్ మీల్స్ అందించాలని ఫిక్స్ అయ్యారు. అయితే, అక్టోబర్ 3న మహా అష్టమి రోజు మాత్రం వెజ్ మీల్స్ అందించనున్నారు.

బెంగాలీలు ఈ పండుగను నాన్ వెజ్‌తో జరుపుకుంటారు. ఈ ట్రెడిషన్ ఇలాగే కొనసాగించాలనే ఆలోచనతో మెనూ సిద్ధం చేశారు. 

ఈ ప్రత్యేక మెనూలో వంటకాలు ఇలా ఉన్నాయి. ఖిచూరీ, పులావ్, లుచి, దమ్ ఆలూ, పనీర్ మసాలా, నవరతన్ కుర్మాలు వెజ్ మీల్స్ గా అందించనున్నట్టు కరెక్షనల్ సర్వీసెస్ శాఖ అధికారి తెలిపారు. కాగా, మిగితా మూడు రోజుల్లో అంటే.. ఆదివారం, మంగళవారం, బుధవారాల్లో నాన్ వెజ్ వెరైటీలు అందిస్తున్నారు. అవి మటన్ బిర్యానీ, మటన్ కాలియా, ఫిష్ వెరైటీలు, ష్రింప్ ఐటమ్‌లు, ఫ్రైడ్ రైస్, చిల్లి చికెన్ సహా ఇతర నాన్ వెజ వెరైటీలు అందించనున్నారు. ప్రతి భోజనం తీపిగా ముగిసేందుకు చివరలో రసగుల్లాలు, లడ్డూలు ఉంటాయి.

ఇదంతా బాగానే ఉన్నది.. కానీ, ఈ స్పెషల్ మెనూ పై కొన్ని ఆరోపణలు వచ్చాయి. పశ్చిమ బెంగాల్ మాజీ మంత్రి పార్థ చటర్జీ జైలులో ఉండటం మూలంగానే ఈ పండుగ వేడుకల సందర్భంగా ఈ మీల్స్ అందిస్తున్నారని వదంతలు పుట్టుకొచ్చాయి. అయితే, ఈ ఆరోపణలు కరెక్షనల్ హోమ్ అధికారులు కొట్టేశారు. ఇలాంటి ప్రత్యేక మెనూ ఎప్పుడూ ఉండేదేనని, కానీ, ఖైదీల నడుమ మంత్రి ఉండటమే ఇప్పుడు కొత్త అని తెలిపారు.

click me!