విమాన ప్రయాణికుడికి బుల్లెట్ గాయాలు.. నేల మీది నుంచి కాల్పులు జరిపిన దుండగులు.. ఎక్కడంటే?

By Mahesh KFirst Published Oct 2, 2022, 4:54 PM IST
Highlights

మయన్మార్‌లో ఓ విమానప్రయాణికుడికి బుల్లెట్ గాయాలు అయ్యాయి. భూమి పై నుంచి జరిపిన కాల్పుల్లో వెలువడిన బుల్లెట్ విమాన గోడలను చీల్చుకుని లోపలికి వెళ్లింది.
 

న్యూఢిల్లీ: విమానంలో ప్రయాణిస్తున్న వ్యక్తికి బుల్లెట్ గాయాలు అవుతాయని ఎవరైనా ఊహించగలరా? అదీ నేల పై నుంచి కాల్పులు జరిపితే.. విమాన ప్రయాణికుడు గాయపడటం అరుదుల్లోకెల్లా అరుదు. కానీ, ఈ ఘటన ప్రస్తుత మిలిటరీ అధీనంలోని మయన్మార్‌లో చోటుచేసుకుంది. 

మయన్మార్ నేషనల్ ఎయిర్‌లైన్స్ విమానంలో ప్రయాణిస్తున్న ఓ వ్యక్తిని భూమి పై నుంచి వచ్చిన ఓ బుల్లెట్ గాయపరిచింది. విమాన బాడీని చీల్చుకుని ఆ బుల్లెట్ లోనికి చొరబడి ఆ ప్రయాణికుడిని గాయపరిచింది. దీంతో వెంటనే ఆ విమానాన్ని మయన్మార్‌లోని లోయ్‌కావ్‌లో నేల దింపారు. బ్రిటీష్ ఏజెన్సీ ది సన్ ప్రకారం, ఆ ఘటన జరిగినప్పుడు విమానం దాదాపు 3,500 అడుగుల ఎత్తులో ఉన్నది. ఎయిర్‌పోర్టుకు ఉత్తరాన నాలుగు మైళ్ల దూరాన ఉన్నది.

ఈ ఘటన జరిగిన వెంటనే లొయ్‌కావ్‌ మయన్మార్ నేషనల్ ఎయిర్‌లైన్స్ ఆఫీసు కీలక ప్రకటన చేసింది. తమ సిటీ అన్ని నిరవధికంగా విమానాలను రద్దు చేసినట్టు వివరించింది. కాయా రాష్ట్రంలోని తిరుగుబాటు శక్తులే ఈ ఈ ఘటనకు పాల్పడ్డాయని మిలిటరీ ప్రభుత్వం ఆరోపించింది. ఈ ఆరోపణలను రెబెల్ ఫోర్సెస్ తిరస్కరించాయి.

కరెన్ని నేషనల్ ప్రొగ్రెసివ్ పార్టీకి చెందిన ఉగ్రవాదులే ఈ కాల్పులకు పాల్పడ్డారని మిలిటరీ కౌన్సింగ్ ప్రతినిధి, మేజర్ జనరల్ జావ్ మిన్ తున్ తెలిపారు. ప్యాసింజర్ ఫ్లైట్‌పై ఇలాంటి కాల్పులకు తెగబడటం యుద్ధ నేరం అని ఆయన అధికార టీవీ చానెల్ ఎంఆర్‌టీవీకి చెప్పారు. శాంతి కావాలని కోరుకునే ప్రజలు, సంఘాలు ఈ ఘటనను ఖండించాలని వివరించారు.

కాయాలో కొంతకాలంగా మిలిటరీకి, స్థానిక తిరుగుబాటుదారులకు మధ్య ఘర్షణలు జరుగుతున్నాయి. ప్రజాస్వామికంగా ఎన్నికైన ఆంగ్ సాన్ సూకీ ప్రభుత్వాన్ని కూల్చేసి ఆర్మీ 2021లో అధికారాన్ని చేపట్టింది.

click me!