కరోనా దెబ్బ: అధికారులపై ఖైదీల దాడి, జైలుకు నిప్పు

By telugu teamFirst Published Mar 22, 2020, 8:08 AM IST
Highlights

దమ్ దమ్ జైలులో శనివారం సాయంత్రం తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఖైదీలు అధికారులపై దాడి చేశారు. జైలులోని కొన్ని చోట్ల నిప్పంటించారు. జైలును బద్దలు కొట్టేందుకు ప్రయత్నించారు.

కోల్ కతా: పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్ కతాలోని దమ్ దమ్ కేంద్ర కారాగారంలోని ఖైదీలు ఘర్షణకు దిగారు. కరోనా వైరస్ నుంచి తమను కాపాడడానికి వెంటనే బెయిల్ మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళనకు దిగారు. జైలు అధికారులపై దాడికి పాల్పడ్డారు. ఖైదీల ఆందోళన ఉద్రిక్తతకు దారి తీసింది. 

ఖైదీలను అదుపు చేయడానికి పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించారు. ఆ దాడిలో పలువురు ఖైదీలు గాయపడ్డారు. వెంటనే వారిని ఆస్పత్రికి తరలించారు. కరోనా వైరస్ వ్యాప్తిని నియంత్రించే ఉద్దేశంతో జైలులో ములాఖత్ లను గత శుక్రవారం జైలు అధికారులు రద్దు చేశారు. 

మార్చి 31వ తేదీ వరకు ఏ విధమైన ములాఖత్ లు ఉండవని తేల్చి చెప్పారు. కాగా, పదేళ్లకు పైగా జైలు జీవితం గడిపినవారిని, సత్ప్రవర్తన కలిగినవారిని పెరోల్ మీద విడుదల చేయాలని అధికారులు నిర్ణయం తీసుకున్నారు. 

అది కొంత మంది ఖైదీలకు ఆగ్రహం తెప్పించింది. కోపావేశంలో జైలుకు నిప్పంటించేందుకు ప్రయత్నించారు. వెంటనే అగ్నిమాపక యంత్రాల సాయంతో అధికారులు మంటలను ఆర్పేశారు.

ఫర్నీచర్ తో, రాళ్లతో ఖైదీలు దాడి చేశారు. జైలును బద్దలు కొట్టే ప్రయత్నంలో నిప్పంటించారు. కోర్టు షట్ డౌన్ ప్రకటించడంతో అండర్ ట్రయల్స్ విచారణలను రద్దు చేశారు. ఇది ఖైదీలకు మరింత కోపం తెప్పించింది. ప్రస్తుతం పరిస్థితి అదుపులో ఉంది.

click me!