పట్టాభిషేకంలో రాణి కామిల్లా కిరీటంలో కోహినూర్ వజ్రం ఉండదు? భారత్ ఆందోళనతో పునరాలోచనలో బకింగ్‌హాం ప్యాలెస్

By Mahesh KFirst Published Oct 13, 2022, 2:09 PM IST
Highlights

బ్రిటన్ క్వీన్ రెండో ఎలిజబెత్ మరణంతో కొహినూర్ వజ్రం గురించిన చర్చ మన దేశంలో జరిగింది. ఇప్పుడు ఆ కొహినూర్ పొదిగిన కిరీటాన్ని పట్టాభిషేక కార్యక్రమంలో కామిల్లాకు పెడతారనే చర్చ మరోసారి చెలరేగింది. దీనిపై కేంద్రంలో అధికార పార్టీ బీజేపీ నుంచి వ్యతిరేకత వచ్చింది. వ్యతిరేకతను నివారించడానికి కొహినూర్ వజ్రాన్ని వినియోగించడంపై రాజవంశం పునరాలోచనలో పడినట్టు తెలిసింది.
 

న్యూఢిల్లీ: ఇప్పుడు మన దేశంలో వలసవాదుల పాలన తాలూకు బాధలను పెద్దగా చర్చించుకోవడం లేదు. స్వాతంత్ర్యం పొంది 75 ఏళ్లు గడిచిన మన దేశంలో అప్పటి ఛిద్ర జ్ఞాపకాలను గుర్తు చేసుకోవడం చాలా అరుదు. కానీ, బ్రిటన్ క్వీన్ రెండో ఎలిజబెత్ మరణంతో మరోసారి అప్పటి విషయాలు చూచాయగా చర్చకు వచ్చాయి. అందులో కొహినూర్ వజ్రం గురించిన చర్చ కూడా ఉన్నది. ఇతర దేశాల్లాగే మన దేశం నుంచి కూడా ఈ వజ్రం తమకు ఇచ్చేయాల్సిందేననే డిమాండ్లు వినిపించాయి. ఈ నేపథ్యంలోనే వచ్చే ఏడాది మే 6న జరగనున్న పట్టాభిషేక కార్యక్రమంలో కొహినూర్ వజ్రం కనిపించడంపై అభ్యంతరాలు వచ్చాయి.

కింగ్ చార్లెస్ III, ఆయన భార్య క్వీన్ కామిల్లాను 2023 మే 6వ తేదీన పట్టాభిషిక్తులను చేయనున్నారు. వెస్ట్‌మినిస్టర్ అబ్బేలో ఈ కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో బ్రిటన్ రాణిగా పట్టాభిషిక్తులు కాబోతున్న కామిల్లా కిరీటంలో కొహినూర్ సహా 2,800 వజ్రాలు ఉంటాయని తెలిసింది. అయితే, దీనిపై బీజేపీ అభ్యంతరం తెలిపింది. ఈ అమూల్యమైన వజ్రం భారత్‌దేనని, దాన్ని పట్టాభిషేకంలో వినియోగించరాదని అభ్యంతరం వ్యక్తపరిచింది.

కామిల్లా కిరీటంలో కొహినూర్ వజ్రం ఉంటే.. అది వలసవాద పాలనకాలం నాటి బాధాకరమైన జ్ఞాపకాలను మళ్లీ ముందుకు తెచ్చినట్టు అవుతుందని బీజేపీ ప్రతినిధి ది టెలిగ్రాఫ్ అనే పత్రికకు తెలిపారు. చాలా మంది భారతీయులు అప్పటి అణచివేతపై చాలా తక్కువ జ్ఞాపకాలే ఉన్నాయని వివరించారు. సుమారు ఐదు శతాబ్దాల విదేశీయుల పాలనలో ఐదారు భారత తరాలు తీవ్ర అణచివేతను ఎదుర్కొన్నాయని తెలిపారు.

Also Read: ఎలిజబెత్ మరణం.. మా డైమండ్ మాకు ఇచ్చేయండి: దక్షిణాఫ్రికా డిమాండ్

కానీ, ఇటీవలి రెండో ఎలిజబెత్ మరణం, తర్వాత కామిల్లా పట్టాభిషేకంలో కొహినూర్ వినియోగించే అవకాశాలు కొందరు భారతీయులను తిరిగి బ్రిటీష్ పాలనా కాలానికి తీసుకెళ్లుతాయని తెలిపారు. 

ఈ తరుణంలోనే బకింగ్‌హాం ప్యాలెస్ కొహినూర్ వజ్రాన్ని పట్టాభిషేక కార్యక్రమంలో వినియోగించడంపై పునరాలోచనలో పడినట్టు తెలుస్తున్నది. అందుకే రాణిగా బాధ్యతలు చేపట్టనున్న కామిల్లా కిరీటం నుంచి కొహినూర్ వజ్రాన్ని తొలగించే అవకాశాలు ఉన్నాయని, లేదా రాజవంశానికి చెందిన ఇతర కిరీటాలను వినియోగించే ఛాన్స్ ఉన్నదని కొన్ని కథనాలు తెలిపాయి.

click me!