
బంగారం అక్రమ రవాణాను అడ్డుకోవడానికి కస్టమ్స్ అధికారులు ఎన్ని పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నా.. గోల్డ్ మాఫియా మాత్రం తగ్గడం లేదు. కొత్త కొత్త మార్గాల్లో బంగారాన్ని విదేశాల నుంచి మన దేశంలోకి అక్రమంగా తరలిస్తూ.. అడ్డంగా బుక్కవుతున్నారు. భారీ మొత్తంలో అధికారులు బంగారాన్ని స్వాధీనం చేసుకుంటున్నారు. మరి పట్టుబడని బంగారం ఇంకెంత మొత్తంలో దేశంలో అడుగుపెతుందో. తాజాగా దేశ ఆర్థిక రాజధానిలోని అంతర్జాతీయ విమానాశ్రయంలో పెద్దమొత్తంలో బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
ముంబై ఎయిర్‌పోర్ట్‌లోని కస్టమ్స్ డిపార్ట్‌మెంట్ అధికారులు గత 48 గంటల్లో (అక్టోబర్ 11, 12 తేదీల్లో) నాలుగు వేర్వేరు ఘటనల్లో 15 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. అంతర్జాతీయ మార్కెట్లో దీని ధర రూ.7.87 కోట్లు ఉంటుందని అధికారులు పేర్కొన్నారు. అదే సమయంలో రూ. 22లక్షల విలువైన విదేశీ కరెన్సీని పట్టుకున్నట్టు తెలిపారు. ఈ స్మగ్లింగ్ కేసులో ఏడుగురు ప్రయాణికులను అరెస్ట్ చేసినట్లు కస్టమ్స్ అధికారులు తెలిపారు.
విశ్వసనీయం సమాచారం మేరకు.. దుబాయి నుంచి వచ్చిన ప్రయాణీకుడి నుంచి 9.895 కిలోల బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఆ ప్రయాణీకుడు ఛాతిభాగంలో ప్రత్యేకంగా తయారు చేసిన బెల్టులో ధరించారనీ, అందులో బంగారాన్ని స్లైసుల్లో రూపంలో పెట్టినట్టు తెలిపారు. అయితే.. ఆ ప్రయాణీకుడు మాత్రం దుబాయిలో ఇద్దరు సూడాన్ ట్రావెలర్లు తనకు ఈ బంగారాన్ని ఇచ్చారని విచారణలో తెలిపాడు. దీంతో ఆ సుడాన్ ప్రయాణికులను కూడా అదుపులోకి తీసుకున్నారు. ఆ ముగ్గురు స్మగ్లర్లను 14 రోజు జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించారు.
మరో కేసులో 1.875 కిలోల బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. బంగారాన్ని పొడి రూపంలోలోదుస్తుల్లో దాచి అక్రమంగా తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేశారు. దీని విలువ దాదాపు కోటీ రూపాయాలు ఉంటుందని అధికారులు అంచనా వేశారు.