ఏషియానెట్ న్యూస్ కార్యాలయ దాడిపై జర్నలిస్టు సంఘాల ఆగ్రహం.. విచార‌ణకు ప్రెస్ క్ల‌బ్ ఆఫ్ ఇండియా డిమాండ్

Published : Mar 04, 2023, 07:14 AM IST
ఏషియానెట్ న్యూస్ కార్యాలయ దాడిపై జర్నలిస్టు సంఘాల ఆగ్రహం..  విచార‌ణకు ప్రెస్ క్ల‌బ్ ఆఫ్ ఇండియా డిమాండ్

సారాంశం

Kochi: కేరళ మలయాళ న్యూస్ ఛానల్ ఏషియానెట్ న్యూస్ కార్యాలయంలోకి చొరబడిన ఎస్ఎఫ్ఐ కార్య‌క‌ర్త‌ల బృందం అక్క‌డి సిబ్బందిని బెదిరించింది. ఈ దాడిని ప్రెస్ క్ల‌బ్ ఆప్ ఇండియా ఖండించింది. వెంట‌నే దీనిపై విచార‌ణ జ‌రిపించాల‌ని కేర‌ళ స‌ర్కారును డిమాండ్ చేసింది.   

Asianet News office attack: కేరళ న్యూస్ ఛానల్ ఏషియా నెట్ న్యూస్ కార్యాలయంలోకి చొరబడిన ఎస్ఎఫ్ఐ కార్య‌క‌ర్త‌ల బృందం దాడికి పాల్ప‌డింది. అక్క‌డి సిబ్బందిని బెదిరించింది. కార్యాల‌యం ముంద‌ర అస‌భ్య‌క‌ర బ్యానర్ల‌ను ప్ర‌ద‌ర్శించింది. శుక్రవారం సాయంత్రం ఎస్ఎఫ్ఐ కార్యకర్తలు చొరబడి సిబ్బందిని బెదిరించారనీ, ఈ ఘ‌ట‌న‌పై కేసు న‌మోదుచేసుకున్నామ‌ని కొచ్చి పోలీసులు తెలిపారు. ఏషియా నెట్ న్యూస్ పై దాడిని ప్రెస్ క్ల‌బ్ ఆప్ ఇండియాతో పాటు రాజ‌కీయ వ‌ర్గాలు ఖండిస్తున్నాయి. 

కేర‌ళ స‌ర్కారు విచార‌ణ జ‌రిపించాల‌ని డిమాండ్.. 

ఏషియానెట్ న్యూస్ కార్యాలయంపై దాడిని ప్రెస్ క్ల‌బ్ ఆఫ్ ఇండియా ఖండించింది. ఎస్ఎఫ్ఐ కార్యకర్తలు ఛానెల్ కార్యాల‌యంలోని ఇలా ప్రవేశించడంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నామ‌ని తెలిపింది.  ఇలాంటి దాడుల‌కు ప్రజాస్వామ్యంలో స్థానం లేదని పేర్కొంది. ఈ ఘటనపై కేరళ ప్రభుత్వం త్వరితగతిన విచారణ జరిపించాలని డిమాండ్ చేసింది. 

 

 

కేరళ జర్నలిస్ట్స్ యూనియన్ ఆగ్రహం.. 

ఏషియానెట్ న్యూస్ కొచ్చి ప్రాంతీయ కార్యాలయంలోకి చొరబడి కార్యాలయ కార్యకలాపాలకు అంతరాయం కలిగించి, ఉద్యోగులను బెదిరించిన ఎస్ఎఫ్ఐ చర్యను కేరళ యూనియన్ ఆఫ్ జర్నలిస్ట్స్ తీవ్రంగా ఖండించింది. ఓ మీడియా సంస్థ కార్యాలయంలోకి చొరబడి ఉద్యోగులను బెదిరించడం నిర‌స‌న కాదనీ, ఇది గూండాయిజమ‌ని పేర్కొంది. ప్రజాస్వామ్య విలువలకు విలువనిచ్చే కేరళ లాంటి ప్రాంతంలో ఇది ఆమోదయోగ్యం కాదని తెలిపింది. చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని కేయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షురాలు ఎంవీ వినీత, ప్రధాన కార్యదర్శి ఆర్ కిరణ్ బాబు డిమాండ్ చేశారు.

తిరువనంతపురం ప్రెస్ క్లబ్ ఆగ్రహం 

ఏషియానెట్ న్యూస్ కొచ్చి ప్రాంతీయ కార్యాలయంలోకి ఎస్ఎఫ్ఐ కార్యకర్తలు చొరబడి ఉద్యోగులను బెదిరించిన సంఘటనను తిరువనంతపురం ప్రెస్ క్లబ్ తీవ్రంగా ఖండించింది. సంస్థల ముసుగులో నేరస్థులు ఎదగనివ్వకూడదని పేర్కొంది. పత్రికా స్వేచ్ఛకు భంగం క‌లిగిస్తున్న వారిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. నిందితులను అరెస్టు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు ఎం.రాధాకృష్ణన్, కార్యదర్శి కె.ఎన్.సాను డిమాండ్ చేశారు.

హింసను ఖండించిన సతీశన్.. 

ఏషియానెట్ న్యూస్ కార్యాలయంపై ఎస్ఎఫ్ఐ కార్యకర్తలు దాడి చేయడాన్ని ప్రతిపక్ష నేత వీడీ సతీశన్ ఖండించారు. నిరంకుశ పాలన ఉన్న చోట్ల జరుగుతున్నట్లే జరుగుతోందనీ, కేరళలో జరిగిన ఘటనే ఇందుకు నిదర్శనమని సతీశన్ వ్యాఖ్యానించారు. ఒకవైపు పత్రికా స్వేచ్ఛ కోసం ప్రసంగించడం, మరోవైపు దురాక్రమణ పద్ధతిలో ముందుకుసాగుతూ.. బెదిరింపుల స్వరంతో మీడియా కార్యాలయంలోకి చొరబడటం ఫ్యాక్షనిజమంటూ వీడీ సతీశన్ విమ‌ర్శించారు. 

సిబ్బందిని బెదిరిస్తూ.. 

మలయాళ న్యూస్ ఛానల్ ఏషియానెట్ న్యూస్ కొచ్చి కార్యాలయంలోకి శుక్రవారం సాయంత్రం ఎస్ఎఫ్ఐ కార్యకర్తలు చొరబడి సిబ్బందిని బెదిరించారు. రాత్రి 7.30 గంటల సమయంలో సుమారు 30 మంది కార్యకర్తలు పలారివట్టంలోని కార్యాలయంలోకి చొరబడ్డారు. కార్యాలయం లోపల నినాదాలు చేస్తూ ఉద్యోగులను బెదిరించారు. ఈ క్ర‌మంలోనే స‌మాచారం అందుకున్న పోలీసులు.. వారిని చెద‌ర‌గొట్టారు. అంత‌కుముందు, ఏషియానెట్ న్యూస్ కార్యాలయం ముందు ఎస్ఎఫ్ఐ కార్యకర్తలు అసభ్యకరమైన బ్యానర్ ను కూడా పెట్టారు. ఏషియానెట్ న్యూస్ రెసిడెంట్ ఎడిటర్ అభిలాష్ జీ నాయర్ ఫిర్యాదు మేరకు పలారివట్టం పోలీసులు కేసు నమోదు చేశారు. సెక్యూరిటీ సిబ్బందిని తోసేసి, కార్యాలయంలోకి చొరబడిన సీసీటీవీ ఫుటేజీ, కెమెరా ఫుటేజీలను ఫిర్యాదుతో పాటు సాక్ష్యాలుగా అందించారు.

PREV
click me!

Recommended Stories

Coldest Places in India : మైనస్ 50°C ఉష్ణోగ్రతలా..! అత్యంత చలిగావుండే టాప్ 5 ప్రదేశాలివే
Gen z పోస్టాఫీస్‌లు వ‌చ్చేస్తున్నాయ్‌.. వీటి ప్ర‌త్యేక‌త ఏంటి.? వీటిలో ఏముంటాయ్‌..