
ఉత్తర్‌ప్రదేశ్ లోని గ్యాంగ్‌స్టర్, రాజకీయ నేత ముఖ్తర్ అన్సారీ అనుచరుడు సంజీవ్ మహేశ్వరి జీవను కోర్టు ఆవరణలో అందరూ చూస్తుండగానే తుపాకీతో కాల్చి చంపిన విషయం తెలిసిందే. వెంటనే అప్రమత్తమైన పోలీసులు నిందితుడు విజయ్ యాదవ్ ను అదుపులోకి తీసుకున్నారు. తాజాగా పోలీసులు విచారణలో సంచలన విషయాలను వెల్లడించాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
గ్యాంగ్‌స్టర్ సంజీవ్ మహేశ్వరి జీవాను హత్య చేసేందుకు తనకు రూ.20 లక్షల సుపారీ ఇచ్చారనీ, పనిపూర్తయిన తర్వాత ఆ మొత్తం డబ్బులు ఇస్తామని హామీ ఇచ్చారనీ, కానీ రూ.8 వేలు మాత్రమే ఇచ్చారని విజయ్ చెప్పినట్లు పోలీసులు వెల్లడించారు. అసలు సంజీవ్ మహేశ్వరి జీవా హత్యకు సుపారీ ఇచ్చిన వ్యక్తుల వివరాలను నిందితుడు వెల్లడించడంలేదని పోలీసులు తెలిపారు. అలాగే అనుమానితులు, జీవాతో శత్రుత్వం ఉన్న వ్యక్తుల ఫొటోలను చూపించినా వాటిని చూసి గుర్తించడానికి నిందితుడు నిరాకరిస్తున్నట్లు తెలిపారు. హత్య అనంతరం కాంట్రాక్ట్ ఇచ్చిన వ్యక్తితో కమ్యూనికేషన్‌ను కోల్పోయాననీ, కాల్పులు జరిగిన వెంటనే అరెస్టు చేశారని తెలిపారు.
తానొక్కడే ఒంటరిగా హత్యను చేసినట్టు, తనకు ఎవరూ సహకరించలేదని విజయ్ విచారణలో చెప్పినట్లు తెలిపాయి. కానీ, అతడు పోలీసులను తప్పుదారి పట్టించేందుకు యత్నిస్తున్నట్లు దర్యాప్తు అధికారులు భావిస్తున్నారు. జూన్ 15 ఉదయం 10 గంటల నుండి జూన్ 17 సాయంత్రం 5 గంటల వరకు మూడు రోజుల పాటు నిందితుడిని పోలీసు కస్టడీకి తరలించిన దర్యాప్తు అధికారులు శనివారం సాయంత్రంతో నిందితుడి కస్టడీ గడువు ముగిసింది.
జూన్ మొదట్లో గ్యాంగ్ స్టర్ జీవా హత్య జరిగింది. అతడు వివాదాస్పద నేత ముఖ్తార్ అన్సారీకి అత్యంత సన్నిహితుడు. 1997లో జరిగిన ఎమ్మెల్యే బ్రహ్మదత్ ద్వివేది హత్యకేసులో అన్సారీ నిందితుడిగా ఉండగా.. సహ నిందితుడిగా జీవాపై కేసు నమోదైంది. భాజపా ఎమ్మెల్యే కృష్ణానంద్ రాయ్ హత్యకేసులోనూ నిందితుడైన జీవాపై మరో 24 ఇతర కేసులు ఉన్నాయి. వాటిలో ఓ కేసుకు సంబంధించి అతడ్ని కోర్టులో హాజరుపరిచే సందర్భంలో సమయంలో ఈ హత్య జరిగింది.