ఆ ఊరిలో ‘సార్’, ‘మేడం’ పిలుపులు బ్యాన్.. అధికారులను పేరుపెట్టే పిలవాలి..!

By telugu teamFirst Published Sep 2, 2021, 4:54 PM IST
Highlights

కేరళలోని ఓ గ్రామం సార్, మేడం అనే పిలుపులను నిషేధించింది. అధికారులను నేరుగా పేరుపెట్టి లేదా వారి హోదాతో సంబోధించాలని ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకుంది. ప్రజాస్వామ్యంలో ప్రజలే యజమానులని, ప్రజాప్రతినిధులు, ఉద్యోగులు వారికి సేవకులని, వాటిని నిజంగా ప్రతిఫలింపజేయడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్టు పంచాయతీ అధికారులు తెలిపారు. ఉత్తర కేరళ జిల్లాలోని మాథుర్ గ్రామం మనదేశంలోనే తొలిసారిగా ఈ నిర్ణయం తీసుకుంది.

పాలక్కడ్: కేరళలోని ఓ గ్రామం చరిత్రాత్మక సంస్కరణకు శ్రీకారం చుట్టింది. అధికారులకు సాధారణ పౌరులకు మధ్య దూరాన్ని చెరిపేయడానికి తొలి అడుగు వేసింది. ఉత్తర కేరళ జిల్లాలోని మాథుర్ గ్రామ పంచాయతీ దేశంలో తొలిసారిగా అధికారులను సార్, మేడం అని పిలిచే వలసవాద సంస్కృతిని నిషేధించింది. వారిని నేరుగా పేరుపెట్టి లేదా హోదాతో సంబోధించాలని ప్రజలకు సూచించింది.

కార్యాలయ ప్రాంగణంలో సార్, మేడం అనే పిలుపులు వినిపంచవద్దని గ్రామ పంచాయతీ ఆదేశించింది. ప్రజా ప్రతినిధులు, ప్రజలకు మధ్య దూరాన్ని తగ్గించాలనే లక్ష్యంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించింది. అంతేకాదు, ఈ నిర్ణయంతో సాధారణ ప్రజలకు, అధికారులకు మధ్య విశ్వాసం ఏర్పడుతుందని, అధారాభిమానాలూ పెరుగుతాయని పేర్కొంది. పంచాయతీ మండలి ఏకగ్రీవంగా ఈ నిర్ణయం తీసుకుంది.

రాజకీయ వైరుధ్యాలను పక్కనపెట్టి మరీ సీపీఎం, బీజేపీ, కాంగ్రెస్ నేతలు సంయుక్తంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయంపై మాథుర్ పంచాయతీ ఉపాధ్యక్షుడు పీఆర్ ప్రసాద్ మాట్లాడారు. పౌరులకు, పంచాయతీ అధికారులకు మధ్య గ్యాప్ తొలగించి తమ పనులను సులువుగా చేయించుకోవడానికే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. సార్, మేడం అనే పిలుపులు అధికారులను ప్రజలకు దూరం చేస్తున్నదని భావిస్తున్నట్టు చెప్పారు. ప్రజాస్వామ్యంలో ప్రజలే యజమానులు, అధికారులు, ప్రజా ప్రతినిధులు వారి సేవకులని, అందుకు ప్రతిరూపంగానే ఈ నిర్ణయం అమలవుతుందని వివరించారు. పంచాయతీలోని ప్రతి అధికారి తమ పేరు, హోదాల బోర్డులను తమ ముందు ఉంచుకోవాలని ఆదేశించినట్టు తెలిపారు.

ఎవరైనా పెద్దవారిని నేరుగా పేరుపెట్టి పిలువడానికి సంకోచించేవారు అన్న లేదా అక్క అని పిలవవచ్చునని పంచాయతీ సూచించింది. అంతేకాదు, సార్, మేడం పదాలకు ప్రత్యామ్నాయ పదాలను తెలుపాలని రాష్ట్ర భాషా శాఖకు విజ్ఞప్తి పంపింది.

click me!