కేరళ స్కూల్ డ్రాపౌట్.. ఇప్పుడు అమెరికా జడ్జీ.. ‘బీడీలు చుట్టిన రోజుల్లోనే నిర్ణయించుకున్నా..’

By Mahesh KFirst Published Jan 8, 2023, 1:02 PM IST
Highlights

కేరళ స్కూల్ డ్రాపౌట్.. పదో తరగతి తర్వాత కుటుంబ ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా చదువు మానేశాడు. ఏడాదిపాటు బీడీలు చుట్టాడు. ఓ హోటల్‌లో హౌజ్ కీపింగ్ జాబ్ చేశాడు. మిత్రుల సహకారంతో మళ్లీ చదువు మొదలు పెట్టి ఎల్ఎల్‌బీ పూర్తి చేశాడు. ఇప్పుడు అమెరికాలోని టెక్సాస్‌లో 51 ఏళ్ల సురేంద్రన్ కే పటేల్ ఓ జిల్లా జడ్జీగా నియమితుడయ్యాడు.
 

న్యూఢిల్లీ: ఆయన కేరళ స్కూల్ డ్రాపౌట్. ఇల్లు గడవలేని పరిస్థితిలో పదో తరగతి వరకు నెట్టుకొచ్చి.. చదువు మానుకోవాల్సి వచ్చింది. బీడీలు చుట్టి ఆర్థిక సమస్యలను ఎదుర్కోవడంలో కుటుంబానికి తోడ్పాటు ఇచ్చాడు. హోటల్‌లో కూడా హౌజ్ కీపింగ్ పని చేశాడు. కానీ, ఇప్పుడు అగ్రరాజ్యం అమెరికాలోనే న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టాడు. ఆయనే 51 ఏళ్ల సురేంద్రన్ కే పటేల్. టెక్సాస్‌లో జిల్లా జడ్జీగా ఆయన ఇటీవలే ప్రమాణం స్వీకారం చేశారు.

కేరళలోని కాసర్‌గోడ్‌లో జన్మించిన సురేంద్రన్ స్కూల్ డ్రాపౌట్. ‘నేను పదో తరగతి చదువుతున్నప్పుడే డ్రాపౌట్ అయ్యాను. నా చదువును కొనసాగించే ఆర్థిక వెసులుబాటు నా కుటుంబానికి లేకపోయింది. ఒక ఏడాదిపాటు దినసరి కూలీగా బీడీలు చుట్టాను. అప్పుడే జీవితంపై నా దృక్కోణం మారింది’ అని సురేంద్రన్ పటేల్ ఎన్డీటీవీకి తెలిపారు.

అప్పుడే ఇక తన జీవితాన్ని తానే మార్చుకోవాలనే నిర్ణయం తీసుకున్నాడని వివరించారు. గ్రామంలోని కొందరు స్నేహితుల సహకారంతో చదువు మళ్లీ ప్రారంభించానని చెప్పారు. న్యాయ శాస్త్రంలో డిగ్రీ పట్టా పొందే వరకు ఆ ఒడిదుడుకుల ప్రయాణమే కొనసాగిందని వివరించారు. తాను చదివేటప్పుడు ఓ హోటల్‌లో హౌజ్ కీపింగ్ జాబ్ కూడా చేశానని తెలిపారు.

Also Read: ఐర్లాండ్ ప్ర‌ధానిగా భార‌త సంత‌తి వ్య‌క్తి లియో వరద్కర్.. ప్రధాని మోదీ అభినందనలు

‘ఒక్క సారి నా ఎల్ఎల్‌బీ పూర్తవ్వగానే ప్రాక్టీస్ మొదలుపెట్టేశాను. ఇండియాలో ప్రాక్టీస్ నాకు అమెరికాలో జీవించడానికి ఎంతో ఉపకరించింది’ అని వివరించారు. అమెరికాలోనూ నల్లేరు మీద నడకలాగే ఏమీ లేదని అన్నారు. ఇక్కడ కూడా తన భాష యాసలపై కామెంట్లు ఎదుర్కొన్నారని పేర్కొన్నారు. తనకు వ్యతిరేకంగా క్యాంపెయిన్లు చేపట్టారనీ వివరించారు.

‘టెక్సాస్‌లో నేను ఈ పొజిషన్‌కు పోటీ పడ్డప్పుడు నా యాసపై నెగెటివ్ కామెంట్లు, క్యాంపెయిన్లు చేశారు. నా సొంత పార్టీ కూడా నేను గెలుస్తానని అనుకోలేదు. డెమోక్రాటిక్ పార్టీ ప్రైమరీని గెలిచి వారిని ఆశ్చర్యంలోకి నెట్టేశాను’ అని తెలిపారు.

‘నేను ఇది సాధిస్తానని ఎవరూ ఊహించలేదు. కానీ, నేను ఇప్పుడు ఇక్కడ ఉన్నాను. ప్రతి ఒక్కరికి నా సందేశం ఒక్కటే. మీ భవిష్యత్‌ను ఇతరులు నిర్ణయించేలా ఉండకండి. నీవు మాత్రమే నీ భవితను నిర్ణయించుకోవాలి’ అని సందేశమిచ్చారు.

click me!