
ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ (ఐయూఎంఎల్) ఇన్‌ఛార్జ్ జనరల్ సెక్రటరీ పీఎంఏ సలాం వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. స్కూళ్లలో అబ్బాయిలు, అమ్మాయిలు కలిసి కూర్చోవడం ప్రమాదకరమని అన్నారు. కేరళ రాష్ట్ర ప్రభుత్వం విద్యా వ్యవస్ధలో జెండర్-న్యూట్రల్( లింగ- తటస్థ) వ్యవస్ధను ప్రవేశపెట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్న తరుణంలో సలాం వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. లింగ-తటస్థ అనేది లింగం ఆధారంగా వివక్ష లేని ఆలోచన. అందరూ సమానమనే భావనను పెంపొందిస్తుంది.
కేరళ ప్రభుత్వ లింగ-తటస్థ విధానాలను సలామ్ విమర్శించారు. ఇది ప్రమాదకరమైన అంశం, అసలు క్లాస్‌రూంల్లో అమ్మాయిలు, అబ్బాయిలు కలిసి కూర్చోవాల్సిన అవసరం ఏముందని ఆయన ప్రశ్నించారు. ఇలాంటి అవకాశాలను వారికి బలవంతంగా ఎందుకు ఇవ్వాలనుకుంటున్నారు. విద్యార్థులు చదువులకు దూరమయ్యే అవకాశం ఉందని ఆయన హెచ్చరించారు.
జెండర్ న్యూట్రాలిటీ అనేది మతపరమైన అంశం కాదని, నైతిక అంశమని సలాం చెప్పుకొచ్చారు. లింగభేదం లేకుండా విద్యార్థులకు ఒకే విధమైన యూనిఫాంలు ఇవ్వాలని ప్రభుత్వం ప్రయత్నిస్తోందని, జెండర్ న్యూట్రాలిటీ విద్యార్థులను తప్పుదోవ పట్టిస్తుందని, ఈ నిర్ణయాన్ని ఉపసంహరించాలని తాము ప్రభుత్వాన్ని కోరతామని ఆయన అన్నారు. రాష్ట్రంలోని విద్యా సంస్థలపై "లింగ-తటస్థ అభిప్రాయాలను విధించడం" మానుకోవాలని గతంలో ముస్లిం సంస్థలు ప్రభుత్వాన్ని కోరాయి. విద్యా సంస్థల్లో ఉదారవాద భావజాలాన్ని అమలు చేసేందుకు వామపక్ష ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆరోపించారు.