
తిరువనంతపురం: కేరళ సాంస్కృతిక, మత్స్య, సినిమా శాఖ మంత్రి సాజి చెరియన్ ఈ రోజు రాజీనామా చేశారు. రాజ్యాంగంపై ఆయన చేసిన వ్యాఖ్యల కారణంగా అసెంబ్లీలో సమావేశాలకు తీవ్ర ఆటంకం కలుగుతున్నది. ఈ అంతరాయాలకు అంతు లేకుండా పోయింది. ఈ నేపథ్యంలోనే కేరళ మంత్రి సాజి చెరియన్ తాను రాజీనామా చేసినట్టు వివరించారు. ఇది తన సొంత నిర్ణయం అని సాజి చెరియన్ చెప్పారు. రాజ్యాంగ విలువలను ఎత్తిపట్టే ప్రతి పార్టీ పనిలో తాను పూర్తిగా పాల్గొంటానని అన్నారు.
గత రెండు రోజులుగా కేరళలో జరుగుతున్న విషయాలపై మాట్లాడుతూ.. పథానంతిట్టలోని మల్లప్పల్లిలో జరిగిన పార్టీ కార్యక్రమంలో తాను రాజ్యాంగాన్ని అవమానించినట్టుగా కొన్ని వార్తలు వచ్చాయని అన్నారు. తాను దేశ రాజ్యాంగాన్ని గౌరవించే పౌరుడిని అని వివరించారు. దేశ లౌకిక, సమాఖ్యస్ఫూర్తిని, రాజ్యాంగాన్ని కాపాడటానికి పోరాడుతున్న పార్టీలో తాను భాగస్వామ్యుడినని అన్నారు. తామంతా రాజ్యాంగంలోని సమాఖ్యస్ఫూర్తిని, లౌకిక విలువలను కాపాడటానికి ప్రయత్నిస్తున్నామని వివరించారు. ఈ విలువలు మరింత బలోపేతం అవుతాయని తాను నమ్ముతానని చెప్పారు.
సీపీఎం పార్టీని టార్గెట్ చేయడానికే తన వ్యాఖ్యలను వక్రీకరించారని సాజి చెరియన్ అన్నారు. రాజ్యాంగాన్ని అవమానించాలని తాను ఎన్నడూ అనుకోలేదని చెప్పారు. మీడియా తన మొత్తం ప్రసంగాన్ని ప్రసారం చేయకుండా కేవలం ఒక భాగాన్ని మాత్రమే ప్రసారం చేసి తప్పుదారి పట్టేలా చేశారని వివరించారు. సెక్యులరిజం ఇప్పుడు ప్రమాదంలో ఉన్నదని, గుజరాత్ అల్లర్ల విచారణలో ఇటీవలే జరిగిన పరిణామాలే ఒక ఉదాహరణ అని చెప్పారు. ఇవన్నీ తన ప్రసంగంలో ఉన్నాయని, తన ప్రసంగాన్ని పూర్తిగా ప్రసారం చేయలేదని సాజి చెరియన్ తెలిపారు. మీడియాపై నా ఫిర్యాదు అదే అని అన్నారు. ప్రజలకు, రాజ్యాంగానికి బద్దుడినై ఉన్న తనపై దుష్ప్రచారం కావడం బాధాకరంగా ఉన్నదని పేర్కొన్నారు.
జులై 5న పథనంతిట్టలోని ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ కార్మికులను దోపిడీ చేయడానికి రాజ్యాంగం సహకరిస్తూనే ఉన్నదని ఆరోపించారు. ప్రజలను దోచుకునేందుకు వీలు కల్పించే రీతిలో రాజ్యాంగాన్ని రాశారని అభ్యంతరకరంగా మాట్లాడారు. ఈ వ్యాఖ్యలపై ప్రతిపక్షాలు భగ్గుమన్నాయి. కాంగ్రెస్, బీజేపీ సహా ప్రతిపక్షాలన్నీ నిరసనలకు దిగాయి. వెంటనే ఆ మంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ చేశాయి.