
న్యూఢిల్లీ: టీకా పంపిణీ విషయం పై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రెండో డోసుకు బూస్టర్ డోసుకు మధ్య గ్యాప్‌ను తొమ్మిది నెలల నుంచి ఆరు నెలలకు కుదించింది. నేషనల్ టెక్నికల్ అడ్వైజరీ గ్రూప్ ఆన్ ఇమ్యునైజేషన్ ఈ మేరకు సిఫారసులు చేసింది. తాజాగా, కేంద్ర ప్రభుత్వం అందుకు అనుగుణమైన నిర్ణయం తీసుకుంది.
ఇప్పటి వరకు కరోనా టీకా రెండో డోసు తీసుకున్న తర్వాత 9 నెలలకు మాత్రమే బూస్టర్ డోసు వేసుకునే అవకాశం ఉండేది. కానీ, తాజాగా, ఈ కాల వ్యవధిని కేంద్ర ప్రభుత్వం తగ్గించింది. తొమ్మిది నెలలకు బదులు ఆరు నెలలు లేదా 26 వారాల తర్వాత బూస్టర్ డోసు వేసుకోవచ్చని వివరించింది. వారంతా ప్రైవేటు టీకా కేంద్రాల్లో రెండో డోసు వేసుకున్న తర్వాత ఆరు నెలలకు బూస్టర్ డోసు వేసుకోవచ్చని తెలిపింది.
18 నుంచి 59 ఏళ్ల వయసు ఉన్న లబ్దిదారులు రెండో డోసు వేసుకున్న తర్వాత ఆరు నెలలకు బూస్టర్ డోసు వేసుకోవచ్చని కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్.. రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులకు లేఖ రాశారు. రాష్ట్రాలతోపాటు కేంద్ర పాలిత ప్రాంతాల అడ్మినిస్ట్రేటర్లకు లెటర్ పంపారు.
60 ఏళ్లు పైబడినవారు.. హెల్త్ కేర్ వర్కర్లు, ఫ్రంట్ లైన్ వర్కర్లు రెండో డోసు వేసుకున్న 6 నెలలు లేదా 26 వారాల తర్వాత ప్రభుత్వ టీకా పంపిణీ కేంద్రాల్లో ఉచితంగా బూస్టర్ డోసు లేదా ప్రికాషన్ డోసు వేసుకోవచ్చని తెలిపింది.