
తిరువనంతపురం: కేరళలో ఓ దారుణం ఆలస్యంగా వెలుగుచూసింది. ఓ వ్యక్తి తన భార్యను చంపేసి.. ఇంటిలోనే పాతి పెట్టాడు. అదే ఇంటిలో అతను జీవిస్తున్నాడు. ఏడాదిన్నర తర్వాత పోలీసులు ఈ కేసును ఛేదించారు. చివరకు ఆ భర్త కటకటాలపాలయ్యాడు. పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు. ఈ ఘటన కేరళలోని ఎర్నాకుళంలో చోటుచేసుకుంది.
సంజీవ్, రమ్య దంపతులు. వారు కేరళలోని ఎర్నాకుళంలో నివసించారు. వీరికి ఫోన్ కాల్స్ విషయమై గొడవ జరిగింది. కొన్నాళ్లకు బంధువులకు, ఇరుగు పొరుగు వారికి తన భార్య వేరే వ్యక్తితో లేచిపోయిందని చెప్పాడు. వారిని నమ్మించాడు. కానీ, ఫోన్ కాల్స్ విషయమై జరిగిన గొడవ తర్వాత తన భార్యను అతనే చంపేశాడు. ఈ విషయం వేరే వారికి తెలియకుండా జాగ్రత్తపడ్డాడు. ఇంటి ప్రాంగణంలోనే గుంత తవ్వి పూడ్చి పెట్టాడు.
2021 ఆగస్టు నుంచి రమ్య కనిపించలేదు. 2022 ఫిబ్రవరిలో సంజీవ్ తన భార్య కనిపించడం లేదని జరక్కాల్ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. ఈ కేసును ఛేదించడానికి ప్రత్యేకంగా ఏర్పడిన పోలీసు బృందం సైంటిఫిక్ ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత సంజీవ్‌ను అరెస్టు చేశారు.
మిస్సింగ్ కంప్లైంట్ ఇచ్చిన తర్వాత పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. కానీ, చాలా ప్రశ్నలకు సంజీవ్ తనకు తెలియదు అనే సమాధానం ఇచ్చేవాడు. చాలా విషయాలు అతనికి తెలియదని చెప్పడంపై అనుమానం వచ్చింది. సుమారు ఏడాది పాటు సంజీవ్ పై పోలీసులు నిఘా వేసి ఉంచారు. ఈ కేసులో అప్పటి వరకు సరిపడా ఆధారాలు సేకరించి సంజీవ్‌ను అరెస్టు చేశారు.
ప్రాథమిక సమాచారం ప్రకారం, ఫోన్ కాల్స్ విషయమై భార్య భర్తలకు మధ్య తీవ్ర గొడవ జరిగింది. ఆ తర్వాత రమ్యను సంజీవ్ దారుణంగా చంపేశాడు. ఆ తర్వాత ఆమె డెడ్ బాడీని ఇంటికి సమీపంలోనే పూడ్చి పెట్టాడు. ఆ తర్వాత అదే ఇంటిలో సంజీవ్ 18 నెలలు జీవించాడు. సంజీవ్ మరో పెళ్లికి సిద్ధం అవుతున్నాడు. తన భార్య మరొకరితో లేచిపోయిందని స్థానికులు, బంధువులకు చెప్పి తనకు లైన్ క్లియర్ చేసుకున్నాడు.
పోలీసులు చేసిన దర్యాప్తులో రమ్య మృతదేహానికి చెందిన కొన్ని భాగాలు ఆ ఇంటి ఆవరణలో కనిపించాయి. వీటితోపాటు మరికొన్ని ఆధారాలపై సంజీవ్‌ను హత్యా ఆరోపణలు, సాక్ష్యాల ధ్వంసం అభియోగాల కింద అరెస్టు చేశారు. ఈ కేసులో దర్యాప్తు సాగుతున్నది.