పాస్‌పోర్టు కవర్ ఆర్డర్ చేస్తే.. పాస్‌పోర్టునూ డెలివరీ చేశారు..!

By telugu teamFirst Published Nov 4, 2021, 3:09 PM IST
Highlights

కేరళకు చెందిన మిథున్ బాబు అమెజాన్‌లో పాస్‌పోర్టు కవర్ ఆర్డర్ చేశారు. కానీ, ఆయన పాస్‌పోర్టు కవర్‌తో పాటు అందులో పాస్‌పోర్టునూ అమెజాన్ డెలివరీ చేసింది. ఆ పాస్‌పోర్టును చూసి మిథున్ షాక్ అయ్యారు. ఇప్పుడు ఆ పాస్‌పోర్టును వాస్తవ యజమాని దగ్గరకు చేర్చే పనిలో ఉన్నారు.
 

తిరువనంతపురం: ఈకామర్స్ చిత్రాలు కొత్తవేమీ కావు. ఒకటి Order చేస్తే మరొకటి రావడం మనం చూస్తూనే ఉన్నాం. Keralaలో గతేడాది అక్టోబర్‌లో ఓ వ్యక్తి ఐఫోన్ 12ను ఆర్డర్ చేశారు. డెలివరీలో ఐఫోన్ 12కు బదులు ఓ సబ్బు.. ఐదు రూపాయల కాయిన్ అందాయి. దీంతో ఆ వ్యక్తి అవాక్కయ్యారు. ఇదే తరహా ఘటన కేరళలోనే మరొకటి జరిగింది. ఈ సారి ఆర్డర్ చేసిన వస్తువుకు వేరే రావడం కాదు.. ఆర్డర్ చేసిన దానికి అదనంగా వచ్చాయి.

వయానాడ్ జిల్లా కానియంబెట్టాకు చెందిన మిథున్ బాబు Amazonలో పాస్‌పోర్ట్ కవర్ ఆర్డర్ చేశారు. కానీ, ఆయన అనూహ్యంగా Passport Cover తోపాటు అందులో పాస్‌పోర్టునూ అందుకున్నారు. పాస్‌పోర్టు చూశాక ఆయన షాక్ అయ్యారు.

గతనెల 30న మిథున్ ఓ పాస్‌పోర్టు కవర్‌ను అమెజాన్‌లో ఆర్డర్ చేశారు. నవంబర్ 1న ప్రాడక్ట్ రిసీవ్ చేసుకున్నారు. ఆ బాక్స్ ఓపెన్ చేయగానే కవర్‌లో రియల్ పాస్‌పోర్టు కూడా కనిపించింది. అదేమీ తనకు అర్థం కాలేదు. అమెజాన్ కస్టమర్ కేర్‌ను సంప్రదించాడు. వారి సమాధానం విని మరోసారి షాక్ అయ్యారు.

Also Read: ఆన్‌లైన్‌లో ఐఫోన్‌ 12 ఆర్డర్ చేశాడు.. డెలివరీ బాక్సులో సబ్బు, 5 రూపాయిల నాణెం.. పోలీసుల విచారణలో ఏం తేలిందంటే

మరోసారి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసుకుంటామని కస్టమర్ కేర్ ఎగ్జిక్యూటివ్ సమాధానం తెలిపారు. అంతేకాదు, అమ్మకందారున్ని జాగ్రత్త వహించమని సూచిస్తామనీ తెలిపారు. అయితే, తనకు వచ్చిన పాస్‌పోర్టును ఏం చేయాలో చెప్పనేలేదు.

మిథున్ అందుకున్న పాస్‌పోర్టు కేరళకే చెందిన త్రిస్సూర్ జిల్లా నివాసి మొహమ్మద్ సాలిహ్‌కు చెందినది. అయితే, ఆ పాస్‌పోర్టుపై మొహమ్మద్ సాలిహ్ మొబైల్ నెంబర్ లేదు. దీంతో ఆయనను కాంటాక్ట్ చేయడం కష్టంగా మారింది. కానీ, మిథున్ వదిలిపెట్టలేదు.

మిథున్ ప్రయత్నాలు ఫలించి ఎట్టకేలకు మొహమ్మద్ సాలిహ్‌ను సంప్రదించగలిగాడు. త్వరలోనే ఆ పాస్‌పోర్టును నిజమైన ఓనర్ దగ్గరకు చేర్చబోతున్నట్టు తెలిపారు.

ఆ పాస్‌పోర్టు కవర్‌ను బహుశా మొహమ్మద్ సాలిహ్ ముందుగా ఆర్డర్ చేసి ఉంటాడని మిథున్ బాబు వివరించారు. ఆ పాస్‌పోర్టు కవర్‌ను చెక్ చేసి అందులో తన పాస్‌పోర్టునూ ఉంచి పరిశీలించి ఉంటారని తెలిపారు. కానీ, ప్రాడక్ట్ నచ్చక రిటర్న్ చేసి ఉండవచ్చని, రిటర్న్ చేసినప్పుడు తన పాస్‌పోర్టును అదే కవర్‌లో ఉంచి ఉంటారని వివరించారు. అలా ఆ పాస్‌పోర్టు అమెజాన్ సెల్లర్‌కు చేరి ఉంటుందని పేర్కొన్నారు. తాను పాస్‌పోర్టు కవర్‌ను ఆర్డర్ చేసినప్పుడు మొహమ్మద్ సాలిహ్ పాస్‌పోర్టు ఉంచిన కవర్‌నే సరిగా పరిశీలించకుండా తనకు మళ్లీ రీసెండ్ చేసి ఉండవచ్చని వివరించారు.

ఈకామర్స్‌కు సంబంధించి ఇప్పటికే పలుసార్లు ఇలాంటి ఘటనలు వెలుగులోకి వచ్చాయి. ఖరీదైన వస్తువులను ఆర్డర్ చేస్తే అందుకు బదులు చౌక అయిన వస్తువులు డెలివరీ అయ్యాయి. కేవలం ఫోన్‌లే కాదు.. ల్యాప్‌టాప్‌ల విషయంలోనూ ఇలాంటి ఘటనలు జరిగాయి. రాళ్లు, రప్పలు, కట్టెలు వచ్చిన దాఖలాలు ఉన్నాయి. అమెజాన్‌తోపాటు మరికొన్ని ఈకామర్స్ వెబ్‌సైట్‌లలోనూ కస్టమర్లు విస్మయపరిచే ఘటనలు జరిగాయి. 

click me!