
చెన్నై: ఓ వ్యక్తి తనకు అతీత శక్తులు ఉన్నాయని మిత్రుడిని నమ్మబలికాడు. పుట్టపర్తి సాయిబాబా ఆత్మతో మాట్లాడుతానని, మరణించిన మీ ఆప్తుల ఆత్మలతోనూ సంభాషించగలను అని చెప్పాడు. పలుమార్లు మిత్రుడి తల్లి ఆత్మతోనూ మాట్లాడినట్టు నమ్మించాడు. అవన్నీ నిజమేనని ఆయన మిత్రుడు విశ్వసించాడు. ఏ నిర్ణయం తీసుకున్నా.. ఆయన సూచనల మేరకే తీసుకున్నాడు. ఇవన్నీ ఉచితం కాదు సుమా. సమర్పణం చేసుకోవాల్సిందే. ఇలా నాలుగేళ్లలో తన మిత్రుడి నుంచి సుమారు రూ. 2 కోట్ల వరకు ఆ మాయగాడు కాజేశాడు.
కేరళకు చెందిన 52 ఏళ్ల సుబ్రమణి, 52 ఏళ్ల గౌతమ్ శివగామి ఇద్దరూ 2005లో పరిచయం అయ్యారు. నైజీరియాలోని ఓ ప్రైవేటు కంపెనీలో పని చేస్తుండగా వారికి పరిచయం ఏర్పడింది. అప్పటి నుంచి మిత్రులుగా కొనసాగారు. వారి కుటుంబాల మధ్య కూడా సాన్నిహిత్యం ఏర్పడింది.
గౌతమ్ శివగామి స్పిరిచువల్ పర్సన్ అని తెలుసుకున్న సుబ్రమణి ఆయన ముందు పలు క్రతువులు నిర్వహించాడు. అక్కడ మరణించిన వ్యక్తుల ఆత్మలతో మాట్లాడినట్టు నటించాడు. ఒక సందర్భంలో మరణించిన గౌతమ్ శివగామి తల్లితోనూ సుబ్రమణి మాట్లాడినట్టు చూపించాడు. సుబ్రమణి నిజంగానే తన తల్లి ఆత్మతో మాట్లాడుతున్నట్టు గౌతమ్ శివగామి భ్రమపడ్డాడు.
మరోసారి పుట్టపర్తి సాయిబాబ ఆత్మతోనూ మాట్లాడుతున్నట్టు గౌతమ్‌కు చూపించాడు. ఆ తర్వాత ఏళ్ల తరబడి సుబ్రమణి ఎన్నో అనూహ్య విషయాలను తనకు చూపెట్టాడని గౌతమ్ తన బెంగళూరు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఒక సారి ఆయన ఏదో చేస్తే పూజ గదిలోని ప్లేట్లు కదలడం, ఉన్నట్టుండి గాలిలో నుంచే నిమ్మకాయను తీయడం తనకు చూపించాడని గౌతమ్ వివరించాడు. కానీ, ఇవన్నీ ఆయన గారడి అని, నైపుణ్యంగా తనను మోసం చేశాడని గౌతమ్ తెలుసుకున్నాడు.
కొన్నిసార్లు గౌతమ్‌కు సుబ్రమణి మెయిల్స్ పంపేవాడని, అందులో గౌతమ్ తల్లి ఆత్మతో చేసిన సంభాషణను పంపేవాడని పేర్కొన్నాడు. గౌతమ్ శివగామిని సుబ్రమణి లోబర్చుకున్నాడు. ఆయన ఏటీఎంలను కూడా సుబ్రమణి వాడుకునేవాడు. డబ్బు విత్‌డ్రా చేసుకునేవాడు. సుబ్రమణి చెప్పాడని గుండు కొట్టించుకున్నాడని, ఇంటి నిర్మాణంలోనూ మార్పులు చేశాడనని, జీవితంలో ఎన్నో ముఖ్యమైన నిర్ణయాలను సుబ్రమణి సూచనల మేరకు తీసుకున్నానని గౌతమ్ చెప్పాడు. వీటన్నింటికీ డబ్బులు చెల్లించుకున్నాడని వివరించాడు. నాలుగేళ్లలో పలు సందర్భాల్లో కలిపి ఆయన మొత్తం రూ. 2 కోట్ల వరకు చెల్లించుకున్నాడని తెలిపాడు. చివరకు సుబ్రమణి తనను మోసం చేస్తున్నాడని గ్రహించగలిగాడు.
వెంటనే ఆయన బెంగళూరు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. 2022లో కేసు ఫైల్ అయింది. సీసీబీకి చెందిన ఎంట్రస్ట్‌మెంట్ డాక్యుమెంట్ ఫ్రాడ్ వింగ్ దర్యాప్తు ప్రారంభించింది. సుబ్రమణి యాంటిసిపేటరీ బెయిల్‌కు దరఖాస్తు చేసుకున్నాడు. ఆ బెయిల్ రిజెక్ట్ కావడంతో పరారీలో ఉన్నాడు. పోలీసులు బుధవారం తిరువనంతపురంలో సుబ్రమణిని పట్టుకున్నారు.