
Supreme Court Issues Notice To Bengal, Tamil Nadu Govts: రాజకీయ ప్రకంపనలు, వివాదాలకు కేంద్ర బిందువుగా మారిన 'ది కేరళ స్టోరీ' సినిమా నిషేధంపై రచ్చ కొనసాగుతోంది. ఈ క్రమంలోనే తమిళనాడు, పశ్చిమబెంగాల్ ప్రభుత్వాల నిషేధాన్ని సవాల్ చేస్తూ 'ది కేరళ స్టోరీ' నిర్మాతలు దాఖలు చేసిన పిటిషన్ ను సుప్రీంకోర్టు విచారించింది. అయితే, సీబీఎఫ్సీ సర్టిఫికేషన్ ను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్ ను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. ఈ క్రమంలోనే ఈ సినిమాపై నిషేధం విధించిన రాష్ట్ర ప్రభుత్వాలకు పలు ప్రశ్నలు సంధించింది.
వివరాల్లోకెళ్తే.. రాష్ట్రంలో సినిమా ప్రదర్శనను నిషేధిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్న 'ది కేరళ స్టోరీ' చిత్ర నిర్మాతలు చేసిన అభ్యర్థనకు సంబంధించి సుప్రీంకోర్టు శుక్రవారం పశ్చిమ బెంగాల్ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. ఈ సినిమాను రాష్ట్రంలో అనధికారికంగా నిషేధించడంపై సుప్రీంకోర్టు తమిళనాడు ప్రభుత్వానికి సైతం నోటీసులు జారీ చేసింది. వివాదాస్పద బహుభాషా చిత్రం 'ది కేరళ స్టోరీ' ప్రదర్శనపై పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం నిషేధం విధించడాన్ని సవాలు చేస్తూ నిర్మాతలు దాఖలు చేసిన పిటిషన్ విచారించిన తర్వాత సుప్రీంకోర్టు ఈ నోటీసులు జారీ చేసింద. అలాగే, పలు కీలక ప్రశ్నలు సంధించింది.
కేరళ స్టోరీని దేశంలోని మిగతా ప్రాంతాల్లో ప్రదర్శిస్తున్న విషయాన్ని ప్రస్తావిస్తూ.. ఈ చిత్ర ప్రదర్శనను నిషేధించడానికి ఎటువంటి కారణం కనిపించడం లేదని బెంగాల్ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు తెలిపింది. 'ది కేరళ స్టోరీ' ప్రదర్శిస్తున్న సినిమా హాళ్లకు రక్షణ కల్పించేందుకు ఎలాంటి చర్యలు తీసుకున్నారో తెలపాలని సుప్రీంకోర్టు తమిళనాడు ప్రభుత్వాన్ని కోరింది. పశ్చిమబెంగాల్ ప్రభుత్వం విధించిన నిషేధాన్ని, తమిళనాడులో 'వాస్తవిక' నిషేధాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్ పై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ పీఎస్ నరసింహలతో కూడిన ధర్మాసనం ముందు సీనియర్ న్యాయవాది హరీశ్ సాల్వే వాదనలు వినిపించారు. అదా శర్మ నటించిన 'ది కేరళ స్టోరీ' మే 5న థియేటర్లలో విడుదలైంది. సుదీప్తో సేన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కేరళకు చెందిన మహిళలను బలవంతంగా ఇస్లాం మతంలోకి మారుస్తున్నారనీ, ఆ తర్వాత ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్) రిక్రూట్ చేసుకుంటున్నారనే కథాంశంతో తెరకెక్కింది.
ఈ చిత్రానికి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (సీబీఎఫ్సీ) ఇచ్చిన సర్టిఫికేషన్ ను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్ ను మూడోసారి విచారణకు స్వీకరించేందుకు సుప్రీంకోర్టు మే 4న నిరాకరించింది. ఈ సినిమా కోసం నిర్మాతలు పెట్టుబడి పెట్టారనీ, నటీనటులు తమ శ్రమను అంకితం చేశారనీ, సినిమా ఆశించిన స్థాయిలో లేకపోతే మార్కెట్ నిర్ణయిస్తుందని పేర్కొంది. విద్వేషం, హింసాత్మక ఘటనలు చోటుచేసుకోకుండా ఉండేందుకు పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మే 8న ఈ సినిమా ప్రదర్శనను తక్షణమే నిషేధించాలని ఆదేశించినట్లు రాష్ట్ర ప్రభుత్వ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు.
ఈ సినిమా విడుదలపై స్టే ఇచ్చేందుకు నిరాకరించిన కేరళ హైకోర్టు ఈ ట్రైలర్ లో ఏ ఒక్క వర్గాన్ని కించపరిచేలా ఏమీ లేదని స్పష్టం చేసింది. కేరళకు చెందిన 32,000 మంది మహిళలను మతమార్పిడి చేసి ఉగ్రవాద సంస్థలో చేరినట్లు చేసిన ప్రకటనను కించపరిచేలా ఉన్న టీజర్ ను నిలుపుకోవాలనే ఉద్దేశం తమకు లేదని నిర్మాతలు వాదించారు. ఇదే సమయంలో సీబీఎఫ్ సీ ఈ చిత్రాన్ని పరిశీలించి పబ్లిక్ ఎగ్జిబిషన్ కు అనువైనదిగా గుర్తించిందని కేరళ హైకోర్టు తెలిపింది. ఈ చిత్రంతో పాటు నిర్మాతలు ఒక డిస్క్లైమర్ ను ప్రచురించారనీ, ఇది కల్పితం- సంఘటనల నాటకీయ వెర్షన్ అనీ, ఈ చిత్రం చారిత్రాత్మక సంఘటనల ఖచ్చితత్వం లేదా వాస్తవికతను చెప్పదని హైకోర్టు పేర్కొంది.
'డిస్క్లైమర్ దృష్ట్యా ప్రతివాదులు సినిమాను ప్రదర్శించకుండా మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయడానికి మేం సుముఖంగా లేం. పై అంశాలను దృష్టిలో ఉంచుకుని, అభ్యంతరకరమైన టీజర్ ను తమ సోషల్ మీడియా హ్యాండిల్స్ లో ఉంచే ఉద్దేశం నిర్మాతకు లేదని చేసిన ప్రకటనను పరిగణనలోకి తీసుకొని, ఈ దశలో ఈ పిటిషన్ లో తదుపరి ఆదేశాలు అవసరం లేదు" అని సెన్సార్ బోర్డు ఈ చిత్రానికి ఇచ్చిన బహిరంగ ప్రదర్శన సర్టిఫికేట్ ను కొట్టివేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్లపై విచారణ సందర్భంగా హైకోర్టు వ్యాఖ్యానించింది.