జర్నలిస్టు ఫోన్లను సీజ్ చేయడంపై  కోర్టు కీలక వ్యాఖ్యలు.. కోర్టు ఏమన్నదంటే..?  

Published : Jul 10, 2023, 11:50 PM IST
జర్నలిస్టు ఫోన్లను సీజ్ చేయడంపై  కోర్టు కీలక వ్యాఖ్యలు.. కోర్టు ఏమన్నదంటే..?  

సారాంశం

చట్టం నిర్దేశించిన విధానాన్ని అనుసరించకుండా, కేసుకు సంబంధించి జర్నలిస్టు ఫోన్‌ను పోలీసులు స్వాధీనం చేసుకోరాదని కేరళ హైకోర్టు పేర్కొంది. జర్నలిస్టులు ఫోర్త్ ఎస్టేట్‌లో భాగమని, కేసుకు సంబంధించి వారి మొబైల్ ఫోన్ అవసరమైతే, దానిని సీజ్ చేసే ముందు క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ (సిఆర్‌పిసి) నిబంధనలను అనుసరించాలని జస్టిస్ పివి కున్హికృష్ణన్ అన్నారు.  

కేసుకు సంబంధించి పోలీసులు విచారణ పేరుతో ఓ జర్నలిస్టు ఫోన్‌ను  సీజ్‌ చేయడాన్ని కేరళ హైకోర్టు (Kerala High Court) తప్పుపట్టింది. చట్టం నిర్దేశించిన విధానాన్ని అనుసరించకుండా, కేసుకు సంబంధించి జర్నలిస్టు ఫోన్‌ను పోలీసులు స్వాధీనం చేసుకోరాదని కేరళ హైకోర్టు పేర్కొంది. జర్నలిస్టులు ఫోర్త్ ఎస్టేట్‌లో భాగమని, కేసుకు సంబంధించి వారి మొబైల్ ఫోన్ అవసరమైతే, దానిని సీజ్ చేసే ముందు క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ (సిఆర్‌పిసి) నిబంధనలను అనుసరించాలని జస్టిస్ పివి కున్హికృష్ణన్ అన్నారు.

కేరళకు చెందిన షాజన్‌ స్కారియా అనే జర్నలిస్ట్ మలయాళం వెబ్ పోర్టల్ 'మరునాదన్ మలయాళీ'ను నిర్వహిస్తున్నాడు. అయితే.. ఉద్దేశపూర్వకంగా తప్పుడు వార్తలతో తన పరువు తీశాడని ఆరోపిస్తూ స్థానిక ఎమ్మెల్యే పీవీ శ్రీనిజిన్‌ అతనిపై ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు అతనిపై ఎస్సీ, ఎస్టీ చట్టం కింద కేసు నమోదు చేశారు. ఇదిలా ఉండగా.. స్కారియాతో మలయాళ దినపత్రిక మంగళం జర్నలిస్టు జి విశాకన్ కు వార్తల విషయంలో కొద్దిపాటి పరిచయం ఉంది.

ఈ క్రమంలోనే షాజన్‌ కేసుతో తనకు ఎటువంటి సంబంధం లేకపోయినప్పటికీ.. విచారణలో భాగంగా పోలీసులు వేధిస్తున్నారని విశాఖన్‌ ఆరోపించారు. ఈ మేరకు ఆయన హైకోర్టును ఆశ్రయించారు. తన ఇంట్లో అక్రమంగా సోదాలు (జులై 3న) జరిపారని, ఎస్సీ/ఎస్టీ చట్టం కింద ఈ కేసులో తాను నిందితుడిని కాదని, తనపై ఎలాంటి నేరపూరిత సాక్ష్యాలు లేవని విశాఖన్ పేర్కొన్నారు. నిందితుడు స్కారియాతో తనకున్న ఏకైక అనుబంధం రెమ్యునరేషన్ కోసం అప్పుడప్పుడు వార్తలు పంచుకోవడం మాత్రమేనని విశాకన్ చెప్పాడు. తనను వేధించవద్దని, తన ఇంట్లో సోదాలు చేయవద్దని లేదా పోలీస్ స్టేషన్‌కు పిలిపించవద్దని పోలీసులను ఆదేశించాలని  తన పిటిషన్‌లో కోర్టును కోరారు విశాకన్. తన ఇంట్లో అక్రమంగా సోదాలు నిర్వహించారని ఆరోపిస్తూ పోలీసులపై కూడా చర్యలు తీసుకోవాలని కోరారు.

విశాకన్ పిటిషన్‌ను విచారించిన జస్టిస్‌ పీవీ కున్హి కృష్ణన్‌ ఇరుపక్షాలను విన్న తర్వాత.. "ఈ కేసులో పోలీసుల తీరును తప్పుపట్టారు. క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ నిబంధనలను ఉల్లంఘించి, జర్నలిస్టు మొబైల్ ఫోన్‌ను పోలీసు అధికారులు స్వాధీనం చేసుకోరాదని  భావిస్తున్నాను. మొబైల్ ఫోన్ అవసరమైతే క్రిమినల్ కేసుకు సంబంధించి, ఆ వస్తువులను స్వాధీనం చేసుకునే ముందు అనుసరించాల్సిన విధానాలు ఉన్నాయి. జర్నలిస్టులు ఫోర్త్ ఎస్టేట్‌లో భాగం. ఒకవేళ అతడి ఫోన్‌ అవసరమని భావిస్తే నిబంధనలు పాటించాలి" అని పేర్కొన్నారు. జర్నలిస్టు ఫోన్‌ను ఏ పరిస్థితుల్లో స్వాధీనం చేసుకున్నారనే దానిపై స్టేట్‌మెంట్ దాఖలు చేయాలని కోర్టు పోలీసులను ఆదేశించింది. తదుపరి విచారణను జులై 21కి వాయిదా వేసింది

PREV
click me!

Recommended Stories

Republic Day Parade: ఘనంగా గణతంత్ర దినోత్సవ పరేడ్ సన్నాహాలు| Asianet News Telugu
Fresh Snowfall in Shimla Delights Tourists: రికార్డు స్థాయిలో సిమ్లాలో మంచు వర్షం| Asianet Telugu