అమ్మాయి వద్దంటే వద్దనే అర్థం.. వారి అనుమతి లేకుండా తాకకూడదని అబ్బాయిలకు నేర్పండి: కేరళ హైకోర్టు

By Sumanth Kanukula  |  First Published Jan 22, 2023, 11:53 AM IST

బాలిక లేదా మహిళను ఆమె స్పష్టమైన అనుమతి లేకుండా తాకకూడదని అబ్బాయిలకు నేర్పించాలని కేరళ హైకోర్టు పేర్కొంది. పాఠశాలల, కుటుంబాలలో ఈ పాఠాన్ని వారికి చెప్పాలని తెలిపింది.


బాలిక లేదా మహిళను ఆమె స్పష్టమైన అనుమతి లేకుండా తాకకూడదని అబ్బాయిలకు నేర్పించాలని కేరళ హైకోర్టు పేర్కొంది. పాఠశాలల, కుటుంబాలలో ఈ పాఠాన్ని వారికి చెప్పాలని తెలిపింది. మాజంలో లైంగిక వేధింపుల కేసుల పెరుగుదలను పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు.. ప్రాథమిక తరగతి స్థాయి నుంచే మంచి ప్రవర్తన, మర్యాదలకు సంబంధించిన అంశాలు పాఠ్యాంశాల్లో భాగంగా ఉండాలని అభిప్రాయపడింది. అమ్మాయిలు వద్దని అంటే దాని అర్థం వద్దని  అబ్బాయిలు అర్థం చేసుకోవాలని పేర్కొంది. స్వార్థం, హక్కుగా కాకుండా నిస్వార్థంగా, సౌమ్యంగా ఉండేలా వారికి బోధించాలని సమాజాన్ని కోరింది. 

కాలేజీ క్యాంపస్‌లో విద్యార్థినుల పట్ల అనుచితంగా ప్రవర్తించి, అసభ్యంగా ప్రవర్తించాడనే ఘటనలో నిందితుడిగా ఉన్న 24 ఏళ్ల నిందితుడు దాఖలు చేసిన పిటిషన్‌ను కోర్టు విచారించింది. తనపై చర్యలు తీసుకునే ముందు ప్రిన్సిపాల్, అంతర్గత ఫిర్యాదుల కమిటీ (ఐసీసీ)తో సహా కళాశాల అధికారులు తన మాట వినలేదని అతను కోర్టు ముందు అతడు పేర్కొన్నాడు. ఆ పిటిషన్‌ను పరిశీలిస్తున్నప్పుడు కేరళ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ దేవన్ రామచంద్రన్.. స్త్రీ పట్ల గౌరవం చూపడం పాత పద్ధతి కాదని.. అన్ని కాలాలకూ ధర్మమని అన్నారు. జనవరి 18న ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు.  ‘‘...చట్టబద్ధమైన కాలేజియేట్ స్టూడెంట్ రిడ్రెసల్ కమిటీని ఏర్పాటు చేయండి. తద్వారా అది తుది నిర్ణయం తీసుకునే ముందు పిటిషనర్‌తో పాటు బాధిత వ్యక్తులు, ఇంకా ఎవరైనా ఉంటే వారి వాదనలు వినవచ్చు’’ అని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. 

Latest Videos

‘‘అమ్మాయిని/స్త్రీని స్పష్టమైన సమ్మతి లేకుండా తాకకూడదని అబ్బాయిలు తెలుసుకోవాలి. 'వద్దు' అంటే 'వద్దు' అనే అర్థం చేసుకోవాలి... పురుషాధిక్యపు ప్రాచీన భావనలు మారాయి.. ఇది మరింత మారాలి. సెక్సిజం ఆమోదయోగ్యం కాదు’’ అని న్యాయమూర్తి పేర్కొన్నారు. ఒక స్త్రీతో ఎలా ప్రవర్తిస్తాడనేది అతని పెంపకం, వ్యక్తిత్వంపై అంతర్దృష్టిని ఇస్తుందని అన్నారు. 

‘‘పిల్లలకు కుటుంబంలో, పాఠశాల ప్రారంభం నుంచి.. అతను/ఆమె ఇతర లింగాన్ని గౌరవించాలని బోధించాలి. నిజమైన పురుషులు స్త్రీలను వేధించరని వారికి బోధించాలి.. ఇది పురుషత్వం లేనిది. ఇది మంచి జీవన విధానం కాదు. నిజానికి మహిళలపై ఆధిపత్యం చెలాయించేది, వేధించేది బలహీన పురుషులే.. ఈ సందేశం బిగ్గరగా, స్పష్టంగా వినిపించాలి’’ జస్టిస్ రామచంద్రన్ అన్నారు. 

ప్రస్తుత విద్యా విధానం చాలా అరుదుగా క్యారెక్టర్ బిల్డింగ్‌పై దృష్టి సారిస్తుందని కోర్టు పేర్కొన్నారు. కేవలం అకడమిక్ ఫలితాలు, ఎంప్లాయబిలిటీపై మాత్రమే దృష్టి సారిస్తుందని తెలిపారు. విలువలతో కూడిన విద్యపై దృష్టి మరల్చాల్సిన సమయం ఇదని  పేర్కొన్నారు. మంచి ప్రవర్తన, మర్యాదలకు సంబంధించిన పాఠాలు తప్పనిసరిగా పాఠ్యాంశాల్లో భాగంగా ఉండాలని తెలిపారు.  విద్యారంగంలో విధాన రూపకర్తలు, ప్రభావశీలులు దీనిపై శ్రద్ధ కల్పించాలని పిలుపునిచ్చారు.

న్యాయమూర్తి పిటిషన్‌ను పరిష్కరించినప్పటికీ.. సాధారణ విద్య, ఉన్నత విద్యా శాఖల కార్యదర్శులు, సీబీఎస్‌ఈ, ఐసీఎస్‌ఈ వంటి బోర్డులు, దాని పరిశీలనల ఆధారంగా అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించించారు. ఫిబ్రవరి 3న తదుపరి విచారణకు జాబితా చేశారు.

click me!