కేంద్రమంత్రి నారాయణ్ రాణేకు హైకోర్టు షాక్.. ఆయన ఇంటిలోని అక్రమ నిర్మాణాన్ని కూల్చేయండి.. రూ. 10 లక్షల ఫైన్

By Mahesh KFirst Published Sep 20, 2022, 2:27 PM IST
Highlights

కేంద్రమంత్రి నారాయణ్ రాణేకు బొంబాయ్ హైకోర్టు షాక్ ఇచ్చింది. జుహులోని ఆయన బంగ్లా ప్రాంగణంలో అక్రమంగా నిర్మించిన వాటిని కూల్చేయాలని ఆదేశించింది. రూల్స్ అతిక్రమించినందుకు రూ. 10 లక్షల జరిమానా విధించింది. 

ముంబయి: కేంద్ర మంత్రి నారాయణ్ రాణేకు బొంబాయ్ హైకోర్టులో చుక్కెదురైంది. జుహులోని ఆయన బంగ్లా ప్రాంతంలో బ్రిహన్‌ముంబయి మున్సిపల్ కార్పొరేషన్ నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన కట్టడాలను తొలగించాలని ఆదేశించింది. అంతేకాదు, చట్టాన్ని అతిక్రమించినందుకు రూ. 10 లక్షల జరిమానా కూడా విధించింది. జుహు ఏరియాలోని నారాయణ్ రాణే బంగ్లా ప్రాంగణంలో ఫ్లోర్ స్పేస్ ఇండెక్స్, కోస్టల్ రెగ్యులేషన్ జోన్ నిబంధనలు ఉల్లంఘించినట్టు కోర్టు పేర్కొంది.

జస్టిస్ ఆర్ డీ ధనుకా, జస్టిస్ కమల్ ఖాతాల ద్విసభ్య ధర్మాసనం ఈ రోజు తీర్పు వెలువరించింది. ఈ బంగ్లాలో అనుమతుల్లేకుండా నిర్మించిన వాటినీ రెగ్యులరైజేషన్ కోసం రాణే కుటుంబానికి చెందిన ఓ కంపెనీ చేసిన దరఖాస్తును పరిగణనలోకి తీసుకోరాదని బీఎంసీని ఆదేశించింది. ఆ బంగ్లాలో చట్టాన్ని అతిక్రమించి కట్టిన నిర్మాణాలను కూల్చేయాలని ఆదేశించింది. రెండు వారాల్లో కూల్చివేతలు పూర్తి కావాలని స్పష్టం చేసింది. తదుపరి వారంలో ఇందుకు సంబంధించిన రిపోర్టును తమకు సమర్పించాలని ఆదేశించింది.

రూ. 10 లక్షల జరిమానాను మహారాష్ట్ర స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ పేరిట రెండు వారాల్లోపు జమ చేయాలని కేంద్రమంత్రి నారాయణ్ రాణేను ధర్మాసనం ఆదేశించింది.

ఈ ఆదేశాలపై ఆరు వారాలపాటు స్టే కావాలని తాము కోరామని, తద్వారా సుప్రీంకోర్టును ఆశ్రయించాలని భావిస్తున్నట్టు కేంద్రమంత్రి నారాయణ్ రాణే న్యాయమూర్తి శార్దూల్ సింగ్ వెల్లడించారు. అయితే, ఆ విజ్ఞప్తిని హైకోర్టు తిరస్కరించింది.

రాణే కుటుంబానికి చెందిన రియల్ ఎస్టేట్ కంపెనీ కాల్‌కా వేసిన పిటిషన్‌ను కూడా హైకోర్టు డిస్మిస్ చేసింది. తమ రెండో దరఖాస్తును బీఎంసీ పరిగణనలోకి తీసుకునేలా ఆదేశించాలని ఆ కంపెనీ పిటిషన్ వేసింది.

click me!