కేరళ గోల్డ్ స్కాంలో సంచలనం: రోడ్డుపై అపస్మారక స్థితిలో యూఏఈ కాన్సుల్ జనరల్ గన్‌మెన్

By Siva KodatiFirst Published Jul 17, 2020, 4:00 PM IST
Highlights

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కేరళ గోల్డ్ స్మగ్లింగ్ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కేరళ గోల్డ్ స్మగ్లింగ్ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. గురువారం నుంచి కనిపించకుండా పోయిన యూఏఈ కాన్సుల్ జనరల్ గన్‌మెన్ జయ‌ఘోష్.. తన ఇంటికి సమీపంలో ఉన్న రోడ్డు పక్కన తీవ్ర గాయాలతో పడివున్నాడు.

ఆయన చేతి మణికట్టుపై కోసిన గాయం వుంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని పరిశీలించారు. ప్రాథమిక అంచనా బట్టి జయఘోష్ ఆత్మహత్యకు ప్రయత్నించినట్లుగా భావిస్తున్నారు.

అనంతరం అతనిని ఆసుపత్రికి తరలించారు. బంగారం స్మగ్లింగ్ కేసు వెలుగులోకి వచ్చినప్పటి నుంచి జయఘోష్ కలత చెందుతున్నాడని అతని కుటుంబసభ్యులు చెబుతున్నారు.

స్నేహితులతో పాటు తెలిసిన వారు సైతం ఘోష్‌ను నిందించడంతో అతను మనస్తాపానికి గురైనట్లు చెప్పారు. మరోవైపు ఈ కేసు అటు తిరిగి, ఇటు తిరిగి సీఎం పినరయి విజయన్ ప్రభుత్వానికి ఎసరు పెడుతోంది.

విజయన్ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం పెడతామని ప్రతిపక్షనేత రమేశ్ చెన్నితల తెలిపారు. ఇకపోతే, ఈ గోల్డ్ స్కాంలో సీఎం విజయన్ మాజీ ప్రిన్సిపాల్ సెక్రటరీ ఎం. శివశంకర్ పై గురువారం సస్పెన్షన్ వేటు పడింది.

గోల్డ్ స్మగ్లింగ్ కేసులో సూత్రధారులుగా భావిస్తున్న స్వప్న సురేశ్‌ను ఐటీ శాఖలో చేర్చుకోవడం దగ్గర్నుంచి, ఆమెతో ఇతర సంబంధాలను కూడా కలిగి వున్నారనే ఆరోపణలపై శివశంకర్‌ను గతవారం బదిలీ చేశారు.

ఇండియాతోపాటు గల్ఫ్ దేశాల్లోనూ సంచలనం రేపిన కేరళ గోల్డ్ స్మగ్లింగ్ వ్యవహారంపై ఎన్ఐఏ దర్యాప్తు కొనసాగుతోంది. నిందితులు, అనుమానితుల్ని ఒక్కొక్కరుగా విచారిస్తోన్న ఎన్ఐఏ.. ఆధారాలను సేకరించే పనిలో బిజీగా ఉంది. 

click me!