
CM Pinarayi Vijayan: పౌరసత్వ సవరణ చట్టం (CAA)పై తమ ప్రభుత్వ వైఖరి స్పష్టంగా ఉందని, అదే వైఖరిని కొనసాగిస్తుందని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ అన్నారు. మత ప్రాతిపదికన పౌరసత్వాన్ని నిర్ణయించబోమని, ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం గట్టి వైఖరిని అవలంభిస్తుందని అన్నారు.
గురువారం ఎల్‌డిఎఫ్ ప్రభుత్వ మొదటి వార్షికోత్సవ వేడుకల్లో సీఎం పినరయి విజయన్ మాట్లాడుతూ.. తమ ప్రభుత్వం వివాదాస్పద పౌరసత్వ (సవరణ) చట్టాన్ని (CAA) అమలు చేయబోదని తేల్చి చెప్పారు. మత ప్రాతిపదికన పౌరసత్వాన్ని నిర్ణయించబోమని, ఈ చట్టంపై రాష్ట్ర ప్రభుత్వం స్పష్టమైన వైఖరిని అవలంబిస్తోందని అన్నారు.
పౌరసత్వ సవరణ చట్టం (సిఎఎ)పై ప్రభుత్వ వైఖరి స్పష్టంగా ఉందని, అదే వైఖరిని కొనసాగుస్తుందని, బాధ్యతాయుతమైన స్థానాల్లో ఉన్నవారు చట్టాన్ని అమలు చేస్తామని తరచూ చెబుతుంటారని పరోక్షంగా కేంద్ర ప్రభుత్వంపై మండిపడ్డారు. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి స్పష్టమైన వైఖరి ఉందనీ. ఇందులో ఎలాంటి మార్పు ఉండదని తేల్చి చెప్పారు.
'మతం ఆధారంగా పౌరసత్వాన్ని నిర్ణయించే హక్కు ఎవరికీ లేదు'
పౌరసత్వ (సవరణ) చట్టం.. రాజ్యాంగ మౌళిక లక్షణమైన లౌకికవాదానికి విరుద్ధమని విజయన్ అన్నారు. మతం ఆధారంగా పౌరసత్వాన్ని నిర్ణయించే హక్కు దేశంలో ఎవరికీ లేదని అన్నారు. ఇలాంటి విషయాలను నిర్ణయించేది రాజ్యాంగమేననీ, రాజ్యాంగమే అత్యున్నతమైనదని, రాజ్యాంగ సూత్రాల ప్రాతిపదికన ఈ అంశంపై రాష్ట్ర ప్రభుత్వం తన వైఖరిని తీసుకుందని స్పష్టం చేశారు. ప్రజల మధ్య మత ఘర్షణలు సృష్టించేందుకు దేశంలోని వివిధ ప్రాంతాల్లో అనేక సర్వేలు జరుగుతున్నాయని సీఎం విజయన్ ఆరోపించారు. కరోనా మహమ్మారి ముగిసిన తర్వాత పౌరసత్వ (సవరణ) చట్టాన్ని అమలు చేస్తామని గత నెలలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా పశ్చిమ బెంగాల్‌లోని సిలిగురిలో చెప్పడం గమనించదగ్గ విషయం.
పౌరసత్వ (సవరణ) చట్టం అంటే ఏమిటి?
పౌరసత్వ (సవరణ) చట్టం - 2019 అనేది 31 డిసెంబర్ 2014 కంటే ముందు భారత్‌కు పొరుగున ఉన్న పాకిస్థాన్, అప్ఘానిస్థాన్, బంగ్లాదేశ్.. ఇస్లామిక్ దేశాల నుంచి హిందువులు, సిక్కులు, క్రిస్టియన్లు, బౌద్ధులు, జైనులు, పార్శీలు మైనార్టీలుగా మత హింసకు గురైన మన దేశానికి శరణార్థులుగా వచ్చారు. అలాంటి వారికి భారత పౌరసత్వం కల్పించడం కోసం ఈ చట్టాన్ని రూపొందించారు. అంటే.. 2014 డిసెంబర్ 31లోగా భారత్‌లోకి శరణార్థులుగా వచ్చిన వారికి మాత్రమే భారత దేశ పౌరసత్వాన్ని ఇవ్వనున్నారు. గతంలో భారత్‌లో 11 ఏళ్లుగా శరణార్థులుగా నివాసం ఉంటున్న వారికే భారత పౌరసత్వం ఇవ్వగా.. ఇప్పుడు దాన్ని ఐదేళ్లకు తగ్గించారు.
1955 నాటి చట్టానికి సవరణ
1955 నాటి పౌరసత్వ చట్టం ప్రకారం అక్రమంగా వలస వచ్చిన వారు భారత పౌరసత్వాన్ని పొందలేరు. ఎలాంటి పత్రాలు లేకుండా దేశంలోకి ప్రవేశించిన వారు లేదా వీసా గడువు ముగిసినా దేశంలో ఉంటున్నవారిని అక్రమ వలసదారులుగా గుర్తిస్తారు. 1955 పౌరసత్వ చట్టాన్ని సవరించడం ద్వారా పార్సీలు, క్రైస్తవులకు భారత పౌరసత్వం ఇవ్వవచ్చు. ఇంతకు ముందు భారత పౌరసత్వం పొందాలంటే 11 ఏళ్ల పాటు భారత్‌లో ఉండడం తప్పనిసరి. ఇప్పుడు దాన్ని 5 సంవత్సరాలకు తగ్గించారు.
పార్లమెంట్‌లో ఆమోదం..
పౌరసత్వ సవరణ బిల్లు ను డిసెంబర్ 9న లోక్ సభలో ఆమోదించగా.. 11న రాజ్యసభలో ఆమోదించారు. మరునాడే రాష్ట్రపతి సంతకం చేయడంతో అది చట్టంగా మారింది. అయితే.. ఈ చట్టం రాజ్యాంగ విరుద్ధమని సుప్రీంలో సవాల్ చేస్తామని ప్రతిపక్షాలు చెబుతున్నాయి.