
ఢిల్లీ పోలీసులు తమతో దుర్భాషలాడారని, అనుచితంగా ప్రవర్తించారని రెజ్లర్లు ఆరోపించిన నేపథ్యంలో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ గురువారం బీజేపీ పాలిత కేంద్ర ప్రభుత్వంపై మండిపడ్డారు. బిజెపిని నిర్మూలించడమే కాకుండా వారిని దేశం నుంచి తరిమికొట్టాలని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) అధినేత పౌరులకు పిలుపునిచ్చారు.
ఈ ఘటనపై కేజ్రీవాల్ ట్వీట్ ద్వారా స్పందిస్తూ.."దేశంలోని ఛాంపియన్ ప్లేయర్‌లతో ఇలాంటి దుర్మార్గంగా ప్రవర్తించడం..? ఇది చాలా విచారకరం, సిగ్గుచేటని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వ్యక్తులు (బిజెపి) మొత్తం వ్యవస్థను గూండాయిజంతో నడపాలని కోరుకుంటారనీ, బీజేపీ మొత్తం వ్యవస్థను అపహాస్యం చేసిందని ఆరోపించారు. ఇకపై బీజేపీ గూండాయిజాన్ని సహించవద్దని, బీజేపీని తరిమికొట్టాల్సిన సమయం ఆసన్నమైందని దేశ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
\
బుధవారం అర్ధరాత్రి ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. కొనసాగుతున్న రెజర్ల నిరసనతో పోలీసులు అనుచితంగా ప్రవర్తించారు. దీంతో ఇరువర్గాల మధ్య తోపులాట జరిగింది. ఈ క్రమంలో పోలీసులు పలువురిపై దాడి చేసినట్టు సమాచారం. అదే సమయంతో భారత అగ్రశ్రేణి రెజ్లర్ వినేశ్ ఫోగట్ మీడియాతో మాట్లాడుతూ ఉద్వేగానికి గురయ్యారు. ఇలాంటి అవమానాలను చూడటానికా తాము ఇన్ని పతకాలు గెలిచిందని ఆవేదన వ్యక్తం చేశారు.
మద్యం మత్తులో ఉన్న పోలీసు అధికారి రెజ్లర్లపై దాడి చేశారని, మిగితా పోలీసులు కనీసం ఆపడానికి కూడా ప్రయత్నించలేదని,ప్రేక్షకులుగా చూస్తూ కూర్చున్నరని ఆమె ఆరోపించారు. తాము క్రిమినల్స్ కాదని, అయినా పోలీసులు తమతో ఇలా ప్రవర్తిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఘటనా స్థలంలో మహిళా పోలీసు అధికారులు లేకపోవడంపై ఆమె ప్రశ్నలు సంధించారు. ‘నన్ను పోలీసులు దూషించి, తోసేశారు. మహిళా పోలీసులు ఎక్కడున్నారు’ అని ప్రశ్నించారు..
ఈ సందర్భంగా భజరంగ్ పూనియా కూడా భావోద్వేగానికి లోనయ్యారు. తన పతకాలన్నీ వెనక్కి తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. తాము ఏప్రిల్ 23 నుంచి జంతర్ మంతర్ వద్ద నిరసన చేస్తున్నామని, ఎండ, వాన, చలి అనే తేడా లేకుండా నిరసన చేస్తున్న ప్రభుత్వం పట్టించుకోవడం లేదనీ, పైగా పోలీసులు బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆరోపించారు.
బాధిత రెజర్లకు మద్దతుగా గురువారం ఉదయం జంతర్ మంతర్ వద్దకు వచ్చిన ఢిల్లీ మహిళా కమిషన్ (డీసీడబ్ల్యూ) చీఫ్ స్వాతి మలివాల్, తనను నిరసన ప్రదేశంలోకి అనుమతించడం లేదని ఆరోపించారు. “రెజ్లర్లు వినేష్ ఫోగట్, సాక్షి మాలిక్ తమను చిత్రహింసలకు గురిచేస్తున్నారని మాకు చెప్పారు. అక్కడ పోలీసు అధికారులు తాగి వారితో అసభ్యంగా ప్రవర్తించారు. వారి భద్రత గురించి నేను ఆందోళన చెందుతున్నాను. ఢిల్లీ పోలీసులు బ్రిజ్ భూషణ్‌కు ఎందుకు రక్షణ కల్పిస్తున్నారు? ఢిల్లీ పోలీసులు అతన్ని ఎందుకు అరెస్ట్ చేయడం లేదు? అని స్వాతి మలివాల్ ప్రశ్నించారు.