
గుజరాత్‌లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ తన సత్తా చాటాలని తీవ్రంగా శ్రమిస్తుంది. ఆ
పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ రాష్ట్రంలో తరుచు పర్యటిస్తున్నారు. ఈ సారి తన రెండు రోజుల పర్యటనలో భాగంగా.. నేడు రాజ్‌కోట్‌లో పర్యటించనున్నారు.
ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తనకు అనుకూలంగా ఉండాలని బిజెపి కార్యకర్తలకు ప్రత్యేక విజ్ఞప్తి చేశారు.ఆమ్ ఆద్మీ పార్టీలో భారీ సంఖ్యలో బీజేపీ కార్యకర్తలు చేరుతున్నారని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆమ్ ఆద్మీ పార్టీ ఆఫీస్ బేరర్ మనోజ్ సొరాథియాపై జరిగిన దాడిపై ఆయన విచారం వ్యక్తం చేశారు. ఈ దాడులు గుజరాత్, హిందూ సంస్కృతి కాదని విమర్శించారు. బీజేపీ దాడులు చేస్తోందని ఆరోపించిన ఆయన.. బీజేపీ ఓటమి భయంతోనే.. ఇలాంటి దాడులకు పాల్పడుతోందన్నారు.
అయినా.. తాము ఆ దాడులకు భయపడబోమని అన్నారు. ఆప్ నేతలు ఓపిక ఉండాలనీ, ఎన్నికలు జరిగినప్పుడు బటన్ నొక్కి వారిపై ఆగ్రహాన్ని వ్యక్తం చేయాలని అన్నారు. తాము కాంగ్రెస్ వాళ్లం కాదన్నారు. కాబట్టి బీజేపీ నేతలు తమ మార్గాలను మార్చుకోవాలని, తాము భయపెడితే.. భయపడమని, తాము వల్లభాయ్ పటేళ్లం.. భగత్ సింగ్‌లం.. ఎదురొడ్డి పోరాటం చేస్తామని అన్నారు.
సూరత్‌లోని 12 లో 7 గెలుపు
సూరత్‌లోని 12 సీట్లకు గాను ఆమ్ ఆద్మీ పార్టీ ఏడు స్థానాలను గెలుచుకోనుంది. సమయం తక్కువ కాబట్టి మీరంతా మీ స్థాయిలో ప్రచారం చేయాలని అన్నారు. 27 ఏళ్లుగా బీజేపీ ఉద్యోగులకు చేసిందేమీ లేదన్నారు. ఎన్నికలకు మూడు నెలల ముందు వారి మళ్లీ లాలీపాప్‌లు ఇస్తారని అన్నారు..
కేజ్రీవాల్‌ను టార్గెట్ చేసిన తేజస్వి సూర్య
బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్‌పై విమర్శల దాడి చేశారు. దేశంలోనే అతిపెద్ద యూటర్న్ లీడర్ కేజ్రీవాల్ అని అన్నారు. ఆయన ఉచిత తాయిలాల రాజకీయాలను గుజరాత్ తిరస్కరిస్తుందని అన్నారు. కేజ్రీవాల్ రాజకీయాల్లో విశ్వసనీయత, చిత్తశుద్ధి లోపించిందని తేజస్వి సూర్య అన్నారు. జర్నలిస్టులను ఉద్దేశించి తేజస్వి సూర్య మాట్లాడుతూ.. మంచి పాఠశాలలు, మొహల్లా క్లినిక్‌లు, స్వచ్ఛమైన రాజకీయాల ఆప్ నాయకుడి వాదనలను ఢిల్లీలో బిజెపి బద్దలు కొట్టిందని అన్నారు.
ఢిల్లీలో ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియాపై సీబీఐ దాడి కేజ్రీవాల్ స్వచ్ఛమైన రాజకీయాల శవపేటికకు చివరి మేకుగా నిరూపిస్తుందని బీజేపీ ఎంపీ అన్నారు. దాదాపు 30 ఏళ్లుగా నిరంతర అభివృద్ధి ప్రయాణాన్ని వేగవంతం చేయాలని గుజరాత్ యువత సంకల్పించారని ఆయన అన్నారు.
ఆప్ నేతపై ఎఫ్ఐఆర్
సూరత్‌లో జరిగిన ర్యాలీలో గుజరాత్ బీజేపీ చీఫ్ సీఆర్ పాటిల్, మంత్రి హర్ష్ సంఘ్వీలపై కించపరిచే పదజాలం ఉపయోగించిన ఆరోపణలపై గుజరాత్ ఆప్ చీఫ్ గోపాల్ ఇటాలియాపై ఎఫ్‌ఐఆర్ నమోదైంది.