అమిత్ షా అధ్యక్షతన సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశం ప్రారంభం.. తెలుగు రాష్ట్రాల నుంచి హాజరైంది వీరే..

By Sumanth KanukulaFirst Published Sep 3, 2022, 3:25 PM IST
Highlights

కేంద్ర హోం మంత్రి అమిత్ షా అధ్యక్షతన శనివారం కేరళలోని తిరువనంతపురంలో 30 సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశం ప్రారంభం అయింది. అయితే ఈ సమావేశానికి తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు గైర్హాజరయ్యారు. 

కేంద్ర హోం మంత్రి అమిత్ షా అధ్యక్షతన శనివారం కేరళలోని తిరువనంతపురంలో 30 సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశం ప్రారంభం అయింది. ఈ సమేశంలో కేరళ ముఖ్యమంత్రి పినరాయి విజయన్, తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్, కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్‌ బొమ్మై, కేంద పాలిత ప్రాంతాలైన పుదుచ్చేరి, లక్షద్వీప్, అండమాన్ నికోబార్ దీవుల లెఫ్టినెంట్ గవర్నర్లు ఈ సమావేశంలో పాల్గొన్నారు. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు మాత్రం ఈ సమావేశానికి గైర్హాజరయ్యారు. 

తెలంగాణ తరపున హోంమంత్రి మహమూద్‌ ఆలీ, ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, ఉన్నతాధికారులు హాజరయ్యారు.  ఏపీ, తెలంగాణ మధ్య విద్యుత్‌ బకాయిలు, విభజన సమస్యలు, కృష్ణా జలాల పంపిణీ, నీటిపారుదలకు సంబంధించిన అంశాలపై తెలంగాణ ఈ సమావేశంలో చర్చించినట్లు తెలుస్తోంది.

ఏపీ నుంచి ఆర్థికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌, విద్యుత్‌శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పలువురు ఉన్నతాధికారులు.. సదరన్ జోనల్ కౌన్సిల్ మీటింగ్‌కు హాజరయ్యారు. విభజన సమస్యలు, సదరన్ జోనల్ కౌన్సిల్ మీటింగ్, ఏపీ రెవెన్యూ లోటు.. తదితర అంశాల గురించి ఏపీ ఈ సమావేశంలో ప్రస్తావించనుంది. 

ఇక, ఈ సమావేశాల కోసం శుక్రవారం రాత్రి తిరువనంతపురం చేరుకున్న అమిత్ షాకు కేరళ సీఎం విజయన్ స్వాగతం పలికారు. ఇక, తిరునంతపురం ఎయిర్‌పోర్టు వెలుపల భారీ సంఖ్యలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు పార్టీ జెండాలు పట్టుకుని అమిత్ షాకు స్వాగతం పలికారు. దీంతో అమిత్ షా వారికి అభివాదం చేశారు. 

ఇక, ఈ సమావేశానికి హాజరు కావడం కోసం తిరువనంతపురం చేరుకున్న తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్.. శుక్రవారం కేరళ ముఖ్యమంత్రి విజయన్‌ను కలిశారు. ఈ సందర్భంగా రెండు రాష్ట్రాలకు సంబంధించిన వివిధ అంశాలపై చర్చించారు.

click me!