
మధ్యప్రదేశ్ హోం మంత్రి, బీజేపీ సీనియర్ నేత నరోత్తమ్ మిశ్రా తన వ్యాఖ్యలతో తరచు వార్తల్లో నిలుస్తారు. తాజాగా మరోసారి ఆయన వ్యాఖ్యలు చర్చనీయంగా మారాయి. బిల్కిస్ బానో గ్యాంగ్ రేప్ దోషుల విడుదలపై బాలీవుడ్ నటి షబానా అజ్మీ గురువారం అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆమె వ్యాఖ్యాలపై ఎంపీ నరోత్తమ్ మిశ్రా స్పందించారు. బాలీవుడ్ నటులు షబానా అజ్మీ, నసీరుద్దీన్ షా, జావేద్ అక్తర్ లపై ఎంపీ నరోత్తమ్ మిశ్రా తీవ్ర స్థాయిలో విరుచుకపడ్డారు. వారంతా తుక్డే-తుక్డే గ్యాంగ్ కు ఏజెంట్లు, వారందరూ స్లీపర్ సెల్స్ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
బీజేపేతర రాష్ట్రాల్లో నేరాలు కనిపించవా..?
బిల్కిస్ బానో రేప్ కేసులో 11 మంది దోషుల విడుదల గురించి మాట్లాడుతూ టెలివిజన్ ఇంటర్వ్యూలో నటి షబానా అజ్మీ విరుచుకుపడిన తర్వాత ఎంపీ హోం మంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు. బీజేపీ నేత నరోత్తమ్ మిశ్రా మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ.. బీజేపీయేతర రాష్ట్రంలో నేరాలు జరిగినప్పుడు.. ఈ వ్యక్తులు ఒక్క మాట కూడా మాట్లాడరని అన్నారు. ఎందుకంటే వారు బీజేపీ పాలిత రాష్ట్రాల్లోనే నేరాలను చూస్తారు. వాళ్లందరికీ దేశంలో ఉండాలంటే భయం మొదలవుతుంది. వీళ్లంతా ఒళ్లు గగుర్పొడిచేలా అరవడం మొదలుపెడతారని అన్నారు.
జార్ఖండ్, ఉదయపూర్ ఘటనపై మౌనం ఎందుకు..
జార్ఖండ్‌లో మైనర్ బాలికను సజీవ దహనం జరిగినప్పుడు వీరు ఎందుకు మౌనంగా ఉన్నారని, రాజస్థాన్‌లో కన్హయ్య లాల్ హత్యపై ఎందుకు ఒక్క మాట కూడా మాట్లాడలేదని నరోత్తమ్ మిశ్రా ఆగ్రహం వ్యక్తం చేశారు. షబానా అజ్మీ, నసీరుద్దీన్ షా వంటి వారిని తుక్డే-తుక్డే గ్యాంగ్ స్లీపర్ సెల్ ఏజెంట్లని నరోత్తమ్ మిశ్రా అభివర్ణించారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో జరుగుతున్న సంఘటనలపై ఈ వ్యక్తులు మౌనంగా ఉన్నారని అన్నారు. అంతేకాదు.. అవార్డు వాపస్‌కు శ్రీకారం చుట్టింది వీరే అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
గురువారం నాడు. నటి షబానా అజ్మీ ఓ ప్రైవేట్ న్యూస్ ఛానెల్ లోని ఇంటర్వ్యూలో పాల్గొంది.ఆగస్ట్ 15 న గ్యాంగ్ రేప్ దోషుల విడుదల గురించి మాట్లాడుతూ.. ఈ దేశంలో స్త్రీలు అభద్రతా భావంతో ఉన్నారనీ, రోజూ అత్యాచారాల ముప్పును ఎదుర్కొంటున్నారని అన్నారు. వారికి కొంత భద్రత కల్పించాలి కదా? నా పిల్లలకు, నా మనవళ్లకు నేను ఏం సమాధానం చెప్పాలి? బిల్కిస్‌కి నేను ఏమి చెప్పగలను? నేను సిగ్గుపడుతున్నాను" అని అన్నారు. ఇదిలా ఉండగా.. ఆగస్టు 15న దోషుల విడుదలపై దేశవ్యాప్తంగా ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి. ఈ అంశం సుప్రీంకోర్టుకు చేరుకుంది, ఇది గుజరాత్ ప్రభుత్వం నుండి ప్రతిస్పందనను కోరింది.