కశ్మీరీ టెర్రరిస్టుకు ఆ స్వచ్ఛంద సంస్థపై ఎందుకంత నమ్మకం? తన బిడ్డను అక్కడే పెంచాలని ఆదేశం

Published : Aug 21, 2023, 04:50 PM IST
కశ్మీరీ టెర్రరిస్టుకు ఆ స్వచ్ఛంద సంస్థపై ఎందుకంత నమ్మకం? తన బిడ్డను అక్కడే పెంచాలని ఆదేశం

సారాంశం

ఓ కశ్మీరీ టెర్రరిస్టు స్వచ్ఛంద సంస్థ శరణాలయంలోకి చొరబడి అక్కడి విషయాలను అడిగి తెలుసుకున్నాడు. తాను మరణించిన తర్వాత తన బిడ్డను అక్కడే పెంచాలని తన భార్యకు చెప్పాడు. అతను ఓ ఎన్‌కౌంటర్‌లో మరణించిన తర్వాత బాలికను అక్కడే పెంచారు. అదే బార్డర్‌లెస్ వరల్డ్ ఫౌండేషన్ ఎన్జీవో. ఈ ఎన్జీవోను మహారాష్ట్రకు చెందిన అధిక్ కాదమ్ నిర్వహిస్తున్నారు. కశ్మీరీ అనాథ బాలికల కోసం ఆయన ఈ ఎన్జీవో నడుపుతున్నారు.  

న్యూఢిల్లీ: అది 2006. ఓ టెర్రరిస్టు మరో ఇద్దరు సహచరులతో కలిసి ఉత్తర కశ్మీర్‌ కుప్వారాలోని ఓ ఇంటిలోకి దూరారు. అక్కడ బార్డర్‌లెస్ వరల్డ్ ఫౌండేషన్ అనే స్వచ్ఛంద సంస్థ అనాథలైన ఆడపిల్లలను బాగోగులను చూసుకుంటున్నది.

విచిత్రంగా ఆ ఉగ్రవాదులు అక్కడున్నవారిని సౌకర్యాలు ఎలా ఉన్నాయని వాకబు చేశారు. కొందరికి వారెవరో తెలియక నార్మల్‌గా ఉన్నారు. కానీ, వారు టాప్ టెర్రరిస్టులని తెలిసినవారు మాత్రం ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని నిలబడ్డారు. అయితే.. ఆ ఉగ్రవాదులు ఏ హానీ తలపెట్టకుండా స్వల్ప సమయంలోనే అక్కడి నుంచి వెళ్లిపోయారు.

ఈ టెర్రరిస్టులు ఆ ఇంటికి తరుచూ ఎందుకు వస్తున్నారో వారికి పది నెలల తర్వాత అర్థమైంది. ఓ మహిళ బార్డర్‌లెస్ వరల్డ్ ఫౌండేషన్‌కు ఫోన్ చేసి తమ బిడ్డ రబియా(పేరు మార్చాం)ను అందులో చేర్చుకోవాలని విజ్ఞప్తి చేసింది. ఆ ఇంటిలోకి చొరబడిన ఉగ్రవాది యొక్క భార్యనే ఆ మహిళ. తన భర్త టెర్రరిస్టు అని, ఒక వేళ తాను మరణిస్తే బిడ్డను ఈ ఎన్జీవోలో చేర్చి పెద్ చేయాలని ఆదేశించాడని ఆ మహిళ బార్డర్‌లెస్ వరల్డ్ ఫౌండేషన్‌కు చెప్పింది.

ఇప్పుడు రబియాకు 11 ఏళ్లు. బార్డర్‌లెస్ వరల్డ్ ఫౌండేషన్‌లో ఉంటూ చదువుకుంటున్నది.

షాజియా ఖాన్ తండ్రి కూడా ఓ ఎన్‌కౌంటర్‌లో 2007లో మరణించాడు. దక్షిణ కశ్మీర్‌లోని అనంత్‌నాగ్‌లో షాజియా సముదాయానికి చెందిన మహిళ బయటికి వెళ్లి పని చేయరాదు. దీంతో ఆ తల్లి షాజియా ఖాన్‌ను పెంచడం కష్టమైంది. ఇప్పుడు షాజియా ఖాన్ ఆలనా పాలనా బాధ్యతను అధిక్ కాదమ్ తీసుకున్నారు. ఆమె ప్రస్తుతం మహారాష్ట్రలోని హోమియోపతి చదువుతున్నది.

జమ్ము కశ్మీర్‌లో వెలసిని అనాథ బాలికల కోసం జమ్ము కశ్మీర్‌లో వెలిసిన నాలుగు శరణాలయాల్లో అధిక్ కాదమ్ స్థాపించిన మొదటి ఫౌండేషన్ ఈ బార్డర్‌లెస్ వరల్డ్ ఫౌండేషన్. అధిక్ కాదమ్ మహారాష్ట్ర రైతుల కొడుకు. జమ్ము కశ్మీర్‌లో పాకిస్తాన్, భారత్ మధ్య ఘర్షణల్లో, ఉగ్రవాదంతో నలిగిపోయిన వారి ఆడబిడ్డలకు అండగా నిలబడాలని 19 ఏళ్ల వయసులో అధిక్ కాదమ్ అనుకున్నారు. 

సేవ్ ది చిల్డ్రన్ ఇంటర్నేషనల్ ఎన్జీవో ప్రకారం జమ్ము కశ్మీర్‌లో 2,15,000 మంది అనాథలున్నారు. తల్లి లేదా తండ్రి చనిపోయి భవిష్యత్ గందరగోళంతో వీరు సతమతమవుతున్నారు. వీరికి సహకరించి పెంచి పెద్ద చేసి ఉద్యోగాలు కల్పించి.. పెళ్లి చేసే వరకు కాదమ్ బాధ్యతలు తీసుకున్నారు.

ఆవాజ్ ది వాయిస్‌తో అధిక్ కాదమ్ మాట్లాడుతూ.. జమ్ము కశ్మీర్ పిల్లలకు అంకితమై 2004లో తాను బార్డర్‌లెస్ వరల్డ్ ఫౌండేషన్‌ను ప్రారంభించినట్టు చెప్పారు. ఇది కేవలం బాలికలకు ఆశ్రయం మాత్రమే కాదు.. ప్రేమ, మద్దతు, ఆరోగ్యం, విద్యను కూడా అందిస్తున్నదని వివరించారు.

మహారాష్ట్ర అహ్మద్‌నగర్ జిల్లా స్రిగొండ తాలూకాలో 1977లో అధిక్ జన్మించారు. తండ్రి సదాశివ్, తల్లి విమల్‌లు రైతులు. కొడుకుకు ఉన్నత విద్య కోసం తండ్రి పూణెకు వలస వచ్చాడు. కాలేజీలో అధిక్ కొంతమంది కశ్మీరీ విద్యార్థులతో స్నేహం చేశారు. పొలిటికల్ సైన్స్ విద్యార్థి కావడంతో కశ్మీర్ అభివృద్ధి కోసం కలలుగన్నారు.

కశ్మీర్‌లో 15 రోజుల రీసెర్చ్ కార్యక్రమానికి వెళ్లి నాలుగు నెలలు అక్కడే ఉండి పరిస్థితులను అర్థం చేసుకునే ప్రయత్నం కాదమ్ చేశారు. కశ్మీర్ ఘర్షణల పర్యవసానంగా యువ విధవలు, అనాథలను చూసి చలించిపోయారు. ‘నేను కశ్మీర్‌లో ఉన్నప్పడు చాలా మంది హతమవ్వడాన్ని చూశాను. ఈ రక్తపాతానికి అసలైన బాధితులు ఈ వాతావరణంలో పెరుగుతున్న పిల్లలు’ అని కాదమ్ చెప్పారు.

Also Read: అక్టోబర్‌లో 16న వరంగల్‌లో భారీ ర్యాలీ.. అదే రోజున బీఆర్ఎస్ ఎన్నికల మేనిఫెస్టో : కేసీఆర్

తొలినాళ్లలో కాదమ్ అనేక సంస్థలకు వాలంటీర్‌గా పని చేశారు. కార్గిల్యుద్ధం సమయంలో ఇళ్లు వదిలిపెట్టాల్సి వచ్చిన శరణార్థుల గురించి పని చేశారు. ఆ తర్వాత యూనిసెఫ్ ప్రాజెక్ట్‌లో పని చేశారు. పిల్లల కోసం పని చేశారు.

కొన్ని నెలల తర్వాత అధిక్ తిరిగి పూణెకు వచ్చిన తన ఫైనల్ ఎగ్జామ్స రాసి మాస్టర్స్ పూర్తి చేసుకున్నారు. తిరిగి కశ్మీర్‌కు వెళ్లిపోయారు. 1997లో కుప్వారాలో 369 గ్రామాలను సర్వే చేసి 24,000 మంది అనాథ బాలికలు ఉన్నట్టు గుర్తించారు. 

అనాథ బాలలకు శరణాలయాలున్నాయిగానీ, బాలికలకు అలాంటి వసతిలేమీ లేవు. ఈ పురుషాధిక్య సమాజంలో బాలికలను పెంచడం చాలా కష్టమైన పని అని, కొన్ని సంస్థలు పిల్లల కోసం కశ్మీర్‌లో పని చేస్తున్నాయని, కానీ, భద్రతా కారణాల వల్ల బాలికల బాధ్యత తీసుకోవడానికి ముందుకు రాలేవని కాదమ్ చెప్పారు. 

‘నా కశ్మీర్ అనుభవం తర్వాత అక్కడి బాలికలకు కచ్చితంగా సహాయం చేయాలని దృఢ నిశ్చయానికి వచ్చాను’ అని కాదమ్ తెలిపారు. బార్డర్‌లెస్ వరల్డ్ ఫౌండేషన్ ఇంటిని 2002లో ఓ అనాథ బాలికతో కుప్వారాలో ప్రారంభించామని వివరించారు. నలుగురు బాలికలతో మొదలైన ఈ ఫౌండేషన్‌ నేడు వందలాది మంది బాలికలకు ఆవాసమని చెప్పారు. కశ్మీర్‌లో ఒక సంస్థ ఏర్పాటు చేయడం చాలా కష్టమైన పని అని వివరించారు. స్థానికులను మెప్పించడం చాలా కష్టమని చెప్పారు. తరుచూ తన మీద అనుమానాలతో ఉగ్రవాదులు కిడ్నాప్ చేసేవారని వివరించారు.

గత 15 ఏళ్లలో అధిక్‌ కాదమ్‌ను 19 సార్లు ఉగ్రవాదులు ఎత్తుకెళ్లారు. కానీ, ఆయన పనులను జాగ్రత్తగా గమనించి సురక్షితంగా విడిచిపెట్టారు. ‘స్థానిక ప్రజలు లేకుంటా నాకు భద్రత కష్టమయ్యేది. స్థానిక ప్రజలే నాకు భద్రత, ఆర్థిక సహాయం చేశారు. కశ్మీర్‌లో ఉదారత్వం ఎల్లలు లేనిది. దురదృష్టవశాత్తు ప్రజలు దీన్ని అనుభవం చెందడానికి ప్రయత్నించరు’ అని కాదమ్ వివరించారు.

‘నువ్వు ఒక్కసారి భీకర టెర్రర్, బాధలు చూశావంటే.. చావుపట్ల భయం కనుమరుగైపోద్ది. ఇలాంటి అనుభవాలు పెద్దగా బాధించవు’ అని కాదమ్ అన్నారు.

కుప్వారాలో ఎన్జీవో ప్రారంభించిన వెంటనే స్థానిక క్లిరక్ ఒకరు అధిక్‌కు వ్యతిరేకంగా ఓ ఫత్వా జారీ చేశారు. అతడిని సామాజిక బహిష్కరణ చేయాలని ఆదేశించాడు. ఆయన కశ్మీరీయేతర వ్యక్తి అని, ఇక్కడి వారికి హిందూమతంలోకి మారుస్తారని అనుమానించాడు. అధిక్ కాదమ్ మాత్రం తన పనిని చేసుకుంటూ వెళ్లిపోయారు. 

బార్డర్‌లెస్ వరల్డ్ ఫౌండేషన్ గురించి ఆ నోటా ఈ నోటా కశ్మీరీ లోయంతా తెలిసిపోయింది. వాలంటీర్లు, ఆర్థిక సహాయం దానికదే వచ్చేసింది. దీంతో కాదమ్ ఇలాంటి గృహాలే అనంత్‌నాగ్, బీర్వాహ్, జమ్ములలో నిర్మించి ఎన్జీవోను విస్తరించారు. ప్రస్తుతం ఈ ఆశ్రయాల్లో సుమారు 200 మంది బాలికలు పెరుగుతున్నారు. ఈ పిల్లల పేరెంట్స్ ఎన్‌కౌంటర్‌లలో ప్రాణాలు కోల్పోయినవారే. 

ఈ శరణాలయాల్లో కంప్యూటర్లు ఏర్పాటు చేశారు. ఆడ పిల్లలు ఆడుకోవడానికి గార్డెన్‌ను కూడా సిద్ధం చేశారు. పిల్లలకు వొకేషనల్ ట్రైనింగ్‌నూ ఇచ్చారు. భవిష్యత్‌ను ఎదుర్కోవడానికి ఆ ఆడబిడ్డలను సన్నద్దం చేశారు. వ్యాపారాలనూ నిర్వహించడానికి సిద్ధం చేశారు. ఫ్యాబ్రిక్ పెయింటింగ్, సానిటరీ నాప్కిన్స్ తయారు చేయడం, ఎంబ్రాయిడరీ వస్త్రాలు, ఫొటోగ్రఫీ.. వంటి పనులు చేస్తుననారు.

ఇందులో చాలా మంది బాలికలు ఎంట్రప్రెన్యూయర్లుగానూ ఎదిగారు. కశ్మీర్‌లో మహిళలు వ్యాపారం నిర్వహిస్తున్న ఏకైక కేంద్రంగా కుప్వారా నిలిచింది.

‘నేను వారి బట్టలు ఉతికా. వారి తల దువ్వాను. నేను వారికి ఒక మిత్రుడిని, సోదరుడిని, గురువునయ్యాను. వారికి పెళ్లి చేస్తూ ఒక తండ్రిని కూడా అయ్యాననే అనుకుంటాను’ అని కాదమ్ చెప్పారు. 

గత ఐదేళ్లలో కశ్మీర్ లోయలో సుమారు 700 మంది బాలికలను ఈ ఎన్జీవో సాధికారులను చేసింది. ‘200 మంది బాలికలను దత్తత తీసుకోవడం ఇక్కడి సమస్యను పూర్తిగా పరిష్కరించదు. కానీ, ఒక రోజు ఈ బాలికలే వారి పిల్లలను పెంచుతారు. వారిలో కచ్చితంగా మంచి ఆలోచనలను నింపుతారు. ఇది చాలా నెమ్మదిగా సాగే ప్రక్రియ. కానీ, ఏదో ఒక చోట ప్రారంభించాలి కదా’ అని అధిక్ కాదమ్ అన్నారు.

ఈ ఎన్జీవో గత 20 ఏళ్లలో సుమారు 500 మెడికల్ క్యాంపులను నిర్వహించింది. ఇక్కడ 1,270 మంది పెల్లెట్ బాధితులకు వారి గాయాలను నయం చేయించడానికి కాదమ్ సహకరించారు. అలాంటి యువత సరైన చికిత్స తీసుకోకుంటే.. తమ కళ్లను శాశ్వతంగా కోల్పోయే ముప్పును ఎదుర్కొంటారని కాదమ్ చెప్పారు. ముంబయి, దక్షిణ భారతం నుంచి 13 మంది ఆఫ్తల్మాలజిస్టుల బృందాన్ని అరేంజ్ చేశారు. ప్రకృతి విపత్తుల్లో 450 గ్రామాలకు సహకారాలు అందిస్తున్నారు.

బార్డర్‌లెస్ వరల్డ్ ఫౌండేషన్‌ 21 అంబులెన్స్‌లను సమకూర్చుకుంది. వీటిని ఇండియన్ ఆర్మీ నిర్వహిస్తుంది. ఇది పది జిల్లాల్లోని 3 లక్షల మందికి ఉపయోగపడుతున్నది. 

అధిక్ కాదమ్‌కు అవార్డులు వెల్లువలా వచ్చాయి. ఔట్‌స్టాండింగ్ యానువల్ రిపోర్ట్, ది మదర్ థెరెసా అవార్డ్, ది యూత్ ఐకాన్ అవార్డ్, ది యువోన్మేష్ అవార్డ్, ది స్పిరిట్ ఆఫ్ మాస్టర్ అవార్డ్, ఐసీఏ అవార్డు, సావిత్రి సమ్మాన్ అవార్డ్, ఎన్బీసీ అవార్డ్, హ్యూమానిటీ హీరో సహా పలు అవార్డులను పొందారు.

--- ఛాయ కావిరె

PREV
click me!

Recommended Stories

Viral News: ఈ గ్రామంలో మ‌హిళ‌లు 5 రోజులు న‌గ్నంగా ఉంటారు.. వింత ఆచారం ఎక్క‌డంటే
Census 2027: 30 లక్షల మంది సిబ్బంది, రూ. 11,718 కోట్లు.. ప్రపంచంలోనే అతిపెద్ద ఫీల్డ్ ఆపరేషన్‌గా జ‌న‌గ‌ణ‌న‌