వివాదానికి తెర: కాశీ విశ్వనాథ ఆలయానికి స్థలం అప్పగించిన ముస్లింలు.. వెల్లివిరిసిన మత సామరస్యం

By Siva KodatiFirst Published Jul 23, 2021, 8:32 PM IST
Highlights

కాశీ విశ్వనాథ ఆలయం-జ్ఞానవాపి మసీదు కేసులో వివాదానికి తెరపడింది. విశ్వనాథ కారిడార్ కోసం 1700 చదరపు అడుగుల స్థలాన్ని ముస్లిం పెద్దలు కాశీ విశ్వనాథ ఆలయ ట్రస్టుకు అప్పగించారు
 

కాశీ విశ్వనాథ ఆలయం-జ్ఞానవాపి మసీదు కేసులో మతసామరస్యం వెల్లి విరిసింది. కాశీ విశ్వనాథ కారిడార్ కోసం 1700 చదరపు అడుగుల స్థలాన్ని ముస్లిం పెద్దలు కాశీ విశ్వనాథ ఆలయ ట్రస్టుకు అప్పగించారు. ఇందుకు ప్రతిగా, జ్ఞానవాపి మసీదు, కాశీ విశ్వనాథ ఆలయానికి దూరంగా ఉన్న 1000 చదరపు అడుగుల స్థలాన్ని ముస్లింలకు ఆలయ పాలకవర్గం అప్పగించింది.

కేసు ఇప్పటికీ కోర్టులోనే ఉందని.. ప్రభుత్వం కారిడార్ నిర్మాణం జరుపుతోందని అంజుమన్ ఇంతజమియా మసీదు సంయుక్త కార్యదర్శి ఎస్.ఎం.వాసిన్ తెలిపారు. వాళ్లు స్థల స్వాధీనం చేయాలని కోరుతుండటంతో ఈ విషయాన్ని మా వాళ్లతో చర్చించామని వెల్లడించారు. దీంతో కాశీ విశ్వనాథ ఆలయం కారిడార్ కోసం 1700 చదరపు అడుగులు అప్పగించేందుకు మసీదు బోర్డు అంగీకరించింది అని వాసిన్ పేర్కొన్నారు.

కాగా, ఈ ఏడాది ప్రారంభంలో కాశీ విశ్వనాథ ఆలయానికి సమీపంలోని మసీదు ప్రాంతంలో సర్వే జరిపేందుకు ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియాకు వారణాసి కోర్టు అనుమతి ఇచ్చింది. మందిరం-మసీదు వివాదంపై విచారణ జరుపుతున్న కోర్టు.. ఐదుగురు ఆర్కియాలజికల్ నిపుణులతో కమిటీ ఏర్పాటుకు ఆదేశించింది. అయితే ఈ ఆదేశాలను జ్ఞానవాపి మసీదు మేనేజిమెంట్ కమిటీ హైకోర్టులో సవాలు చేసినట్టుగా తెలుస్తోంది. కాశీ విశ్వనాథ ఆలయాన్ని మొగల్ చక్రవర్తి ఔరంగజేబు కూల్చివేశాడని, అనంతరం 1669లో జ్ఞానవాపి మసీదు నిర్మాణం జరిగిందని ఆలయం తరఫున పిటిషన్ వేసిన విజయ్ శంకర్ రస్తోగి వాదిస్తున్నారు. మసీదు నిర్మించిన స్థలం హిందువులకు చెందినదని ఆయన తన పిటిషన్‌లో పేర్కొన్నారు.

click me!