Karvy Scam: రూ. 110 కోట్ల ఆస్తులు అటాచ్ చేసిన ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్..

By Sumanth KanukulaFirst Published Jul 30, 2022, 12:55 PM IST
Highlights

కార్వీ స్కామ్‌కు సంబంధించి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ స్కామ్‌లో తాజాగా రూ. 110 కోట్ల ఆస్తులను అటాచ్ చేసింది.

కార్వీ స్కామ్‌కు సంబంధించి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ స్కామ్‌లో తాజాగా రూ. 110 కోట్ల ఆస్తులను అటాచ్ చేసింది. మనీ లాండరింగ్ చట్టం ప్రకారం ఈ మొత్తాన్ని ఈడీ జప్తు చేసింది. కాగా.. కార్వీ సంస్థ వందల కోట్ల రూపాయలను నిబంధనలను విరుద్దంగా దారి మళ్లించడంపై ఈడీ అధికారులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇందులో పార్థసారథికి చెందిన భూములు, భవనాలు, షేర్లు, విదేశీ నగదు ఉంది. ఇప్పటికే ఈ కేసులో ఈడీ రూ. 1,984 కోట్ల ఆస్తులు జప్తు చేసిన సంగతి తెలిసిందే. ఇక, ఇప్పటికే ఈ కేసులో పార్థసారథి, హరికృష్ణలను ఈడీ అరెస్ట్ చేసింది. అయితే ప్రస్తుతం వారిద్దరు బెయిల్‌పై ఉన్నారు. 

ఇక, ఇన్వెస్టర్ల అనుమతి లేకుండా వారి షేర్లను.. కార్వీ కంపెనీ డీమ్యాట్ ఖాతాలోకి బదిలీ చేయడమేకాకుండా.. వాటిని బ్యాంకుతో తాకట్టు పెట్టి రుణాలు పొందింది. అయితే ఆ రుణాలను అనుబంధ కంపెనీలకు మళ్లించినట్టుగా దర్యాప్తులో తేలింది. ఈ క్రమంలోనే దాదాపు 700 కోట్ల రూపాయల విలువైన నిందితుల షేర్లను ఈడీ కొద్ది నెలల కిందట స్తంభింపజేసింది.

కార్వీ సంస్థ తీసుకున్న మొత్తం రుణాలు దాదాపు 3,000 కోట్ల వరకు ఉంటాయని ఈడీ తెలిపింది. 2016-2019 మధ్యకాలంలో Karvy Stock Broking Limited తన గ్రూప్ కంపెనీ అయిన కార్వీ రియాల్టీ (ఇండియా) లిమిటెడ్‌కు 1,096 కోట్లను బదిలీ చేసిందని ప్రాథమిక విచారణలో నిర్దారణ అయింది. ఈ కేసులో ప్రధాన నిందితుడైన పార్థసారథి సూచనల మేరకు యాంటీ ఫోరెన్సిక్ సాధనాలను ఉపయోగించి సర్వర్‌ల నుంచి ఫైల్‌లు, ఈ మెయిల్స్‌ను తొలగించినట్లు ఈడీ తన విచారణలో కనుగొంది.

click me!