
న్యూఢిల్లీ: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ప్రధాని మోడీ పేరు చెప్పి ఓట్లు రాబట్టుకునే ప్రయత్నంలో ఉండగా.. తాము ప్రధాని ఇచ్చిన వోకల్ ఫర్ లోక్ అనే నినాదాన్ని సీరియస్‌గా తీసుకుని రాష్ట్ర ప్రజల సమస్యలను ఎత్తిచూపుతూ క్యాంపెయిన్ చేస్తున్నామని కాంగ్రెస్ సీనియర్ లీడర్ జైరాం రమేశ్ అన్నారు. నాలుగేళ్లు బీజేపీ పాలనతో మగ్గిపోయిన కర్ణాటకకు ఇప్పుడు విటమిన్ పీ అవసరం ఉన్నదని, ఇక్కడ పీ అంటే కాంగ్రెస్ అందించే ప్రగతి అని, బీజేపీ చేసే విభజన కాదని తెలిపారు. ఆయన పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో కీలక వ్యాఖ్యలు చేశారు.
పార్టీలో తీవ్ర అసంతృప్తిని కాంగ్రెస్ ఎదుర్కోవడం లేదని, బీజేపీనే ఎదుర్కొంటున్నదని ఆయన తెలిపారు. కాంగ్రెస్‌లో అసంతృప్తి చాలా తక్కువగా ఉన్నదని, చాలా తక్కువ మంది మాత్రమే స్వతంత్రంగా పోటీ చేస్తున్నారని వివరించారు. అదే బీజేపీ మాజీ సీఎం, డిప్యూటీ సీఎం, నేషనల్ ఎగ్జిక్యూటివ్‌లు, అనేక ఇతర జాతీయ, రాష్ట్ర నాయకులను కోల్పోయిందని చెప్పారు.
కర్ణాటక ఓటర్లు చాలా తెలివికలవారని, ఎవరికి ఎప్పుడు ఓటు వేయాలో తెలిసినవారని జైరాం రమేశ్ తెలిపారు. ఇది జాతీయ ఎన్నికలు కావని, రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు అని అన్నారు. అందుకే ఇక్కడ ప్రధాని మోడీ పేరు చెబితే ఏం ప్రయోజనం అని వివరించారు. కానీ, వారు ఎన్నుకునేది ఎమ్మెల్యేలు.. వారి ద్వారా సీఎంను.. అందుకే ఓటర్లు ప్రధాని మోడీని చూడటం లేదని చెప్పారు. ఇది బెంగళూరు ఇంజిన్ అని, ఢిల్లీ ఇంజిన్ కాదని తెలిపారు.
Also Read: కర్ణాటకలో ఈసారి బీజేపీ ‘ఆపరేషన్ లోటస్’ పని చేయదు.. కాంగ్రెస్ దే అధికారం - మాజీ మంత్రి ఎంబీ పాటిల్
బీజేపీ చెప్పే డబుల్ ఇంజిన్ మొత్తం బోగస్ అని అన్నారు. ఒక వైపు ఆర్థిక వృద్ధి జరుగుతున్నట్టు చెప్పే కట్టు కథ ఒక ఇంజిన్ అయితే.. విభజన రాజకీయాలు, పోలరైజేషన్ మరో ఇంజిన్ అని ఆరోపించారు. కాంగ్రెస్ డబుల్ ఇంజిన్ సరైందని వివరించారు. సుస్థిర అభివృద్ధి ఒక ఇంజిన్ అయితే.. సామరస్యత మరో ఇంజిన్ అని తెలిపారు.
రాష్ట్రంలో మార్పు కావాలని, కాంగ్రెస్‌ను అధికారంలోకి తేవాలనే బలమైన సెంటిమెంట్ ఉన్నదని జైరాం రమేశ్ వివరించారు. అందుకే తాను హంగ్ వస్తుందనే అంచనాలను విశ్వసించబోనని చెప్పారు. కాంగ్రెస్‌కే మెజార్టీ వస్తుందని, అందుకే ఆపరేషన్ లోటస్ ఇక్కడ ప్రాసంగికతలేని చర్య అని తెలిపారు.