కరోనా ఎఫెక్ట్: పోలీసులను తప్పించుకొనేందుకు ఈదుకొంటూ మృత్యు ఒడిలోకి

By narsimha lodeFirst Published Apr 10, 2020, 11:10 AM IST
Highlights

:కరోనా లాక్‌డౌన్ నేపథ్యంలో పోలీసులను, డ్రోన్‌లను తప్పించుకొనేందుకు కృష్ణా నదిలో ఈదుకొంటూ తన గ్రామానికి వెళ్లేందుకు ప్రయత్నించిన వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన కర్ణాటక రాష్ట్రంలో చోటు చేసుకొంది

బెంగుళూరు:కరోనా లాక్‌డౌన్ నేపథ్యంలో పోలీసులను, డ్రోన్‌లను తప్పించుకొనేందుకు కృష్ణా నదిలో ఈదుకొంటూ తన గ్రామానికి వెళ్లేందుకు ప్రయత్నించిన వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన కర్ణాటక రాష్ట్రంలో చోటు చేసుకొంది.

కర్ణాటక రాష్ట్రంలోని బొమ్మనగి మల్లప్ప కర్ణాటక రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలో బస్ కండక్టర్ గా పనిచేస్తున్నాడు. అతని వయస్సు 45 ఏళ్లు.బళ్లారి బస్ డిపోలో ఆయన కండక్టర్ గా  12 ఏళ్లుగా పనిచేస్తున్నాడు. 

ముద్దెబిహల్(విజయపుర)కు సమీపంలోని తంగడగి చెక్‌పోస్టు వద్ద భార్యతో పాటు ఐదు నెలల కూతురుతో కలిసి వస్తుండగా మల్లప్పను పోలీసులు ఆపారు. తన భార్య పుట్టిన మద్దెబిహల్ కుసమీపంలోని సారూర్ నుండి తిరిగివస్తున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకొంది.తన పుట్టింట్లోనే మల్లప్ప భార్య ఐదు మాసాల క్రితం ఆడపిల్లకు జన్మనిచ్చింది.

బాల్‌కోట్ జిల్లాలోని హులాల్లి గ్రామం మల్లప్పది. ఆయన భార్య గ్రామం విజయపుర ఇక్కడికి 22 కి.మీ దూరంలో ఉంటుంది. అయితే హులాల్లి నుండి విజయపురకు వెళ్లేందుకు స్థానికులు షార్ట్ కట్ మార్గాన్ని ఎంచుకొంటారు. ఈ మార్గంలో విజయపురకు వెళ్తే కేవలం 10 నుండి 12 కి.మీ మాత్రమే ఉంటుంది.

విజయపురకు వెళ్లే షార్ట్ కట్ మార్గాలను పోలీసులు మూసివేశారు.వాహనాలను తనిఖీ చేస్తున్నారు. అత్తింట్లో ఉన్న తన భార్యను తన ఇంటికి తీసుకొచ్చేందుకు మల్లప్ప వెళ్లాలని భావించాడు.

సోమవారం నాడు ఉదయం ఆయన సారూర్ గ్రామానికి సరుకులను తరలించే వాహనంలో చేరుకొన్నాడు. అయితే మంగళవారం నాడు ఉదయం తన భార్య ఐదు మాసాల కూతురిని తీసుకొని మరో సరుకులను తరలించే వాహనంలో  ఆయన బయలుదేరాడు.  తంగడగి చెక్ పోస్టు వద్ద పోలీసులు ఈ వాహనాన్ని నిలిపివేశారు.

లాక్ డౌన్ ఉన్న సమయంలో బయట తిరగడంపై మల్లప్పను పోలీసులు నిలదీశారు. మల్లప్పతో పాటు ఆయన భార్య కూతురిని కూడ ఈ వాహనం నుండి దింపివేశారు. ఈ ప్రాంతం మల్లప్ప స్వగ్రామానికి సుమారు రెండు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది.

తన భార్య, కూతురును ఇంటికి తీసుకొచ్చేందుకు తాను వెళ్లినట్టుగా మల్లప్ప చెప్పారు. పోలీసులతో ఆయన వాగ్వావాదానికి దిగారు.ఈ క్రమంలోనే మల్లప్ప భార్యను ఐదుమాసాల కూతురిని ఇంటికి వెళ్లేందుకు అంగీకరించారు పోలీసులు.

గొడవకు దిగినందుకు గాను మల్లప్పను కొట్టారు పోలీసులు. అంతేకాదు అతడిని  ఇంటికి వెళ్లకుండా అడ్డుకొన్నారని మల్లప్ప సోదరుడు పరసప్ప చెప్పారు.మరోసారి పోలీసులను తప్పించుకోవడం కష్టమని ఆయన భావించాడు. దీంతో తన గ్రామానికి కృష్ణా నదిలో ఈదుకొంటూ వెళ్లడమే మార్గమని భావించాడు.

also read:ఢిల్లీలో కరోనా వ్యాప్తి చేస్తారా అంటూ ఇద్దరు మహిళా డాక్టర్లపై దాడి:ఒకరి అరెస్ట్

అతను కృష్ణా నదిలో దూకి ఈదుకొంటూ స్వగ్రామానికి వెళ్లే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో ఆయన మృతి చెందాడు. బుధవారం నాడు అమరగోల్ గ్రామ సమీపంలో మల్లప్ప మృతదేహం లభ్యమైంది.


 

click me!