బీజేపీ టికెట్ ఇప్పిస్తామని రూ. 2 కోట్ల కుచ్చుటోపీ.. పోలీసులకు బాధితుడి ఫిర్యాదు

By Mahesh K  |  First Published Oct 22, 2023, 6:33 PM IST

బీజేపీ టికెట్ ఇప్పిస్తానని, కేంద్ర నాయకత్వాన్ని ప్రభావితం చేయగల శక్తి తమకు ఉన్నదని ఇద్దరు దుండగులు ఓ అమాయకుడి వద్ద నుంచి రూ. 2 కోట్లు కాజేశారు. బీజేపీ అభ్యర్థుల జాబితా విడుదలయ్యే వరకు ఎనిమిది దఫాల్లో ఈ డబ్బులు బాధితుడి నుంచి తీసుకున్నారు. 
 


బెంగళూరు: ఓ బహిరంగ సభలో కలిసిన వ్యక్తి.. బీజేపీ టికెట్ ఇప్పించగలనని హామీ ఇచ్చాడు. ఆ తర్వాత మరో వ్యక్తిని పరిచయం చేయించాడు. ఆ తర్వాత వారిద్దరూ కలిసి రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడికి నన్ను పరిచయం చేశారు. టికెట్ దక్కేలా తాము కేంద్ర నాయకత్వాన్ని ప్రభావితం చేయగలమని వంచించారు. ఎనిమిది ఇన్‌స్టాల్‌మెంట్లలో రూ. 2 కోట్లు దండుకున్నారు. బీజేపీ అభ్యర్థుల జాబితా విడుదల చేసింది. అందులో చూస్తే తన పేరు లేదు. దీంతో మోసపోయానని గ్రహించి తన డబ్బులు తిరిగి తనకు ఇచ్చేయాలని ఆ ఇద్దరిని డిమాండ్ చేశాడు. కొన్నాళ్ల నుంచి సర్దిచెప్పిన వారు.. ఇప్పుడు అసలు ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు. దీంతో సదరు బాధితుడు పోలీసులకు ఫిర్యాదు అయ్యాడు. ఈ ఘటన కర్ణాటకలో చోటుచేసుకుంది.

కర్ణాటకకు చెందిన సీ శివమూర్తి విజయనగర జిల్లా పోలీసులకు 55 ఏళ్ల రేవణ్ణసిద్దప్ప, 45 ఏళ్ల ఎన్‌పీ శేఖర్‌లపై ఫిర్యాదు చేశాడు. ఇటీవలే జరిగిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ టికెట్ ఇప్పిస్తానని వీరు మోసం చేసి తన వద్ద నుంచి రూ. 2 కోట్లు కాజేశారని ఆరోపించాడు. 

Latest Videos

‘రేవణ్ణ సిద్దప్ప బహిరంగ కార్యక్రమాల్లో కలుస్తుండేవాడు. బీజేపీ టికెట్ ఇప్పిస్తానని నన్ను నమ్మించాడు. అందుకు నేను ఒప్పుకునే వరకు వదిలిపెట్టలేదు. ఆయన నన్ను శేఖర్‌కు పరిచయం చేశాడు. వీరిద్దరూ కలిసి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నళిన్ కుమార్ కతీల్‌కు నన్ను పరిచయం చేశారు. ఆ తర్వాత నా దగ్గర నుంచి డబ్బులు తీసుకోవడం మొదలుపెట్టారు. 2022 ఆగస్టు నుంచి 2023లో బీజేపీ అభ్యర్థుల జాబితా విడుదల అయ్యే వరకు ఎనిమిది దఫాల్లో రూ. 2 కోట్లను తీసుకున్నారు’ అని సీ శివమూర్తి చెప్పాడు.

Also Read: తన భార్య ఆలయాలకు వెళ్లడంపై తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ ఏమన్నారంటే?

ఈయన ఫిర్యాదుతో పోలీసులు వారిద్దరిపై కేసు నమోదు చేశారు. ఆరు నెలల తర్వాత శివమూర్తి ఈ కేసు పెట్టాడు. తాను ఇచ్చిన డబ్బులు తిరిగి ఇస్తారని ఎదురుచూశానని శివమూర్తి తెలిపాడు. అయితే, వారు తన నుంచి కనీసం ఫోన్ కాల్స్ కూడా లిఫ్ట్ చేయకపోవడంతో కేసు పెట్టడం మినహా మరే అవకాశం లేకపోయిందని వివరించాడు.

click me!