హుబ్లీ ఈద్గా మైదానంలో గణేష్ ఉత్సవాలకు అనుమతి.. అర్దరాత్రి ఉత్తర్వులు ఇచ్చిన కర్ణాటక హైకోర్టు

By Sumanth KanukulaFirst Published Aug 31, 2022, 10:01 AM IST
Highlights

కర్ణాటక హుబ్లీలోని ఈద్గా మైదానంలో వినాయక చవితి వేడుకలకు హైకోర్టు అనుమతించింది. మంగళవారం అర్ధరాత్రి జరిగిన విచారణలో హైకోర్టు ఈ మేరకు ఉత్తర్వులు వెలువరించింది. 

కర్ణాటక హుబ్లీలోని ఈద్గా మైదానంలో వినాయక చవితి వేడుకలకు హైకోర్టు అనుమతించింది. మంగళవారం అర్ధరాత్రి జరిగిన విచారణలో హైకోర్టు ఈ మేరకు ఉత్తర్వులు వెలువరించింది. ఈద్గా మైదాన్‌లో వినాయక చవితి ఉత్సవాలు జరుపుకునేందుకు అనుమతిస్తూ హుబ్బళ్లి-ధార్వాడ్ మున్సిపల్ కార్పొరేషన్ (హెచ్‌డీఎంసీ) తీసుకున్న నిర్ణయంపై జోక్యం చేసుకోవడానికి కర్ణాటక హైకోర్టు నిరాకరించింది. వివరాలు.. బెంగళూరు ఈద్గా మైదాన్‌లో వినాయక చవితి వేడుకలను నిర్వహించేందుకు సుప్రీం కోర్టు అనుమతి తిరస్కరించిన తర్వాత.. అంజుమన్-ఇ-ఇస్లాం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. మైదానంలో వినాయక విగ్రహాన్ని ప్రతిష్టించడానికి అనుమతించకుండా హెచ్‌డీఎంసీని నిరోధించాలని పిటిషనర్ విజ్ఞప్తి చేశారు. ఆగస్టు 31 నుంచి మూడు రోజుల పాటు గణేష్ ఉత్సవాలకు అనుమతిస్తూ హెచ్‌డీఎంసీ హౌస్ ప్యానెల్ తీసుకున్న నిర్ణయాన్ని పిటిషనర్ ప్రశ్నించారు.

అయితే పిటిషనర్ చేసిన విజ్ఞప్తిని అంగీకరించడానికి జస్టిస్ అశోక్ ఎస్ కినాగి నిరాకరించారు. రాత్రి 11.30 గంటల సమయంలో మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. బెంగళూరులోని చామరాజ్‌పేట ఈద్గా మైదాన్‌ సమస్యకు హుబ్లీ ఈద్గా మైదాన్‌ సమస్య భిన్నంగా ఉందని కోర్టు ప్రాథమికంగా గుర్తించింది. బెంగళూరు ఈద్గా భూమి విషయంలో యాజమాన్యంపై ‘‘తీవ్రమైన వివాదం’’ హుబ్లీ కేసులో లేదని హైకోర్టు పేర్కొంది. కాబట్టి సుప్రీంకోర్టు ఆదేశం వర్తించదని జస్టిస్ అశోక్ ఎస్ కినాగి అన్నారు.

Also Read: బెంగ‌ళూరు ఈద్గా మైదానంలో గణేష్ చతుర్థి వేడుకలపై సుప్రీంకోర్టు కీల‌క ఆదేశాలు

1972-1992 మధ్యకాలంలో హుబ్లీలోని సివిల్ కోర్టులు, హైకోర్టు ద్వారా టైటిల్‌ను ధృవీకరించినందున హుబ్లీ ఈద్గా మైదాన్‌కు హెచ్‌డీఎంసీ సంపూర్ణ యజమాని అని..ఈ ఉత్తర్వులను 2010లో సుప్రీం కోర్టు చివరకు ధృవీకరించిందని కోర్టు గుర్తించింది. 

ఇక, బెంగళూరులోని ఈద్గా మైదానంలో యథాతథ స్థితిని కొనసాగించాలని సుప్రీంకోర్టు మంగళవారం ఆదేశించింది. ఇక్క‌డ గణేష్ చతుర్థి వేడుకలు నిర్వహించరాదని పేర్కొంది. ఆగస్టు 30, 31 తేదీల్లో రాష్ట్ర ప్రభుత్వం మతపరమైన వేడుకలను నిర్వహించుకునేందుకు వీలు కల్పిస్తూ కర్ణాటక హైకోర్టు ఆగస్టు 26న జారీ చేసిన ఉత్తర్వులను సవాలు చేస్తూ కర్ణాటక వక్ఫ్ బోర్డు, సెంట్రల్ ముస్లిం అసోసియేషన్ ఆఫ్ కర్ణాటక దాఖలు చేసిన పిటిషన్‌పై ముగ్గురు న్యాయమూర్తులతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. క‌ర్నాట‌క హైకోర్టు జారీ చేసిన ఉత్త‌ర్వుల‌ను సైతం నిలిపివేసింది. 

200 ఏళ్లుగా ఇలాంటి కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించ‌లేద‌ని, ప్ర‌శ్న‌లో ఉన్న భూమి వ‌క్ఫ్ బోర్డుకు చెందుతుంద‌ని, య‌థాత‌థ స్థితిని కొనసాగించాల‌ని ఆదేశించింది. పిటిషన్‌లో లేవనెత్తిన ఇతర అంశాల‌ను హైకోర్టు నిర్ణయిస్తుందని, అప్పీల్‌ను పరిష్కరిస్తామని కోర్టు తెలిపింది. 

click me!