
ఏషియానెట్ న్యూస్ నెట్‌వర్క్ చేపట్టిన వజ్ర జయంతి యాత్రను కర్ణాటక గవర్నర్ థావర్ చంద్ గెహ్లాట్ ఈ రోజు జెండా ఊపి ప్రారంభించారు. కర్ణాటకలోని రాజ్‌భవన్‌లో ఈ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ఏషియానెట్ గ్రూప్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ రాజేష్ కల్రా, కన్నడ ప్రభ, సువర్ణ న్యూస్ చీఫ్ మెంటర్ రవి హెగ్డే తదితరులు పాల్గొన్నారు. భారతదేశం 75వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని ఏషియానెట్ నెట్ నెట్‌వర్క్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ India@75యాత్ర కేరళ నుంచి ప్రారంభమైంది. రాబోయే రోజుల్లో దేశవ్యాప్తంగా పర్యటించి ఆగస్టు 15న దేశ రాజధాని ఢిల్లీలో ఈ యాత్ర ముగుస్తుంది.
ఈ యాత్రంలో ఎన్‌సీసీ క్యాడెట్‌లు భాగంగా ఉంటారు. క్యాడెట్లు బెంగళూరులోని ప్రముఖ ప్రదేశాలను సందర్శిస్తారు. బెంగళూరులో ఫ్లాగ్ ఆఫ్ వేడుక అనంతరం ఎస్‌సీసీ క్యాడెట్లు జాతీయ సైనికుల స్మారకాన్ని సందర్శించారు.
ఈ యాత్రను ప్రారంభించిన అనంతరం గవర్నర్ థావర్‌చంద్ గెహ్లాట్ సభను ఉద్దేశించి ప్రసంగించారు. ఏషియానెట్ న్యూస్ నెట్‌వర్క్ అర్థవంతమైన చొరవ తీసుకున్నందుకు శుభాకాంక్షలు తెలిపారు. ‘‘బలమైన, ఐక్యమైన దేశానికి ఈ యాత్ర నిజంగా ముఖ్యమైనది. స్వాతంత్ర్యం తర్వాత ఏమి జరిగిందో, మన దేశానికి భవిష్యత్తులో ఏమి చేయాలో మనం తెలుసుకోవాలి. మన దేశం మనకు ప్రతిదీ ఇచ్చింది. ఇప్పుడు మనం తిరిగి ఎంతో కొంత చేయాల్సిన సమయం ఆసన్నమైంది. దేశం కోసం ఎవరైనా ఎలాంటి సహకారం అందించాలో ఈ యాత్ర ప్రజలకు అర్థమయ్యేలా చేస్తుంది’’ అని చెప్పారు.
కర్ణాటకలో ఈ యాత్ర జరగడం తనకు గర్వకారణమని ఏషియానెట్ గ్రూప్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ రాజేష్ కల్రా అన్నారు. ‘‘కర్ణాటక ఒక అందమైన రాష్ట్రం. ప్రపంచంలోని ఏడు వింతలను చూశాం. కానీ మేము (ఏషియానెట్) కర్ణాటకలోని ఏడు అద్భుతాలను కనుగొంటున్నాము. చాలా మందికి కర్ణాటకలోని ప్రతి ప్రదేశం ప్రపంచంలోని ఏడు వింతల మాదిరిగా అందంగా ఉంది’’ అని అన్నారు. యాత్రలో పాల్గొంటున్న ఎన్‌సీసీ క్యాడెట్‌లకు రాజేష్ కల్రా కూడా శుభాకాంక్షలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో గవర్నర్ థావర్‌చంద్ గెహ్లాట్, గోవా, కర్ణాటక ఎన్‌సీసీ వింగ్ కమాండర్, ఎయిర్ కమోడోర్ బిఎస్ కన్వర్, ఏషియానెట్ న్యూస్ నెట్‌వర్క్ చైర్మన్ రాజేష్ కల్రా, కన్నడ ప్రభ, సువర్ణ న్యూస్ చీఫ్ మెంటర్ రవి హెగ్డే, సువర్ణ న్యూస్ ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ అజిత్ హనుమక్కనవర్ పాల్గొన్నారు.