
Karnataka Elections: అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ కర్ణాటక రాజకీయం హీటెక్కుతోంది. రోజురోజుకు సమీకరణాలు మారుతున్నాయి. ఈ ఎన్నికలను కాంగ్రెస్, బీజేపీ ఛాలెంజ్‌గా తీసుకున్నాయి. ముఖ్యంగా బీజేపీ
మరోసారి అధికారంలోకి రావాలని క్షేత్ర స్థాయిలో ప్రణాళికలు రచిస్తోంది. మరోసారి ఎన్నికల్లో గెలుపు బావుటను ఎగరవేసి.. బీజేపీకి కర్నాటకను దక్షిణ భారతదేశ గేట్‌వే మార్చుకోవాలని ప్రయత్నిస్తోంది. బీజేపీ కంచుకోటగా మార్చుకోవాలని ప్రయత్నిస్తోంది. అదే సమయంలో ఎలాగైనా.. బీజేపీని అధికారం నుంచి దించి.. తమ పార్టీని అధికారంలోకి తీసుకరావాలని కాంగ్రెస్ శ్రేణులు ప్రయత్నిస్తున్నారు.
ఈ తరుణంలో కన్నడ సినీ నటుడు కిచ్చా సుదీప్ భారతీయ జనతా పార్టీకి మద్దతు ప్రకటించడంతో కాంగ్రెస్ కు ఎదురుదెబ్బ తగిలినట్టు అయ్యింది. ఈ పరిణామంపై కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు, కాంగ్రెస్ నుండి ముఖ్యమంత్రి పదవికి ప్రధాన పోటీదారులలో ఒకరైన డీకే శివకుమార్ స్పందించారు. ఆయన మాట్లాడుతూ.. సినిమాలు, రాజకీయాలు రెండూ వేర్వేరు . ఎన్నికలపై సినిమాల ప్రభావం ఉండదని, చాలా మంది సినీ నటులు వస్తుంటారు, వెళ్తుంటారు.. రాజకీయాలు సినిమాలకు భిన్నంగా ఉంటాయి. రాజకీయాలు వేరు, సినిమాలు వేరని అన్నారు. గతంలో సిని నటుడు కిచ్చా సుదీప్ కాంగ్రెస్‌లో చేరతారనే ఊహాగానాలు సాగాయి. ఎవరూ ఊహించని విధంగా కిచ్చా సుదీప్ బీజేపీకి మద్దతు ప్రకటించడం సినీ, రాజకీయ వర్గాలను ఆశ్చర్యానికి గురి చేసింది.
బీజేపీకి సుదీప్ మద్దతు
తాను బీజేపీలో చేరడం గానీ, ఎన్నికల్లో పోటీ చేయడం గానీ చేయనని, ఎన్నికల్లో ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మైకి మద్దతిస్తానని కిచ్చా సుదీప్ బుధవారం ప్రకటించారు. బొమ్మైతో తనకు వ్యక్తిగత బంధం ఉందని కూడా సుదీప్ చెప్పాడు. ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. ‘‘నేను ఇక్కడికి రావాల్సిన అవసరం ఏదీ లేదు, ఏ వేదిక కోసమో, డబ్బు కోసమో ఇక్కడికి రాలేదు. ఓ వ్యక్తి కోసమే ఇక్కడికి వచ్చాను. సీఎం బొమ్మై అంటే నాకు ఎంతో గౌరవం.. అందుకే.. బొమ్మై సార్‌కు నేను పూర్తిగా మద్దతుగా నిలుస్తున్నాను. కానీ, నేను ఎన్నికల్లో పోటీ చేయను, రాజకీయాల్లోకి రాను. నా దగ్గర సినిమాలున్నాయి, నా అభిమానులు సంతోషిస్తారు" అన్నారాయన.
దీనిపై ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై స్పందిస్తూ.. కన్నడ సూపర్‌స్టార్ కిచ్చా సుదీప్ చేస్తున్న ప్రచారం కాషాయ పార్టీకి ఎంతో బలం చేకూరుస్తుందని అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. “కిచ్చా సుదీప్ ఫేమస్ సూపర్ స్టార్, మా కోసం ప్రచారం చేస్తారు, ఆయన ప్రచారానికి సంబంధించి త్వరలో బ్లూప్రింట్ సిద్ధం చేస్తాం, ఆయన చాలా పెద్ద స్టార్, ఆయన పాపులారిటీ చాలా ఎక్కువ, ఆయన ప్రచారం చాలా బలాన్ని ఇస్తుందని నేను బలంగా నమ్ముతున్నాను. బీజేపీ' అని సీఎం బొమ్మై అన్నారు. మే 10న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా, మే 13న ఓట్ల లెక్కింపు జరగనుంది.2018 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 104 సీట్లు గెలుచుకుని అధికారాన్ని కైవసం చేసుకోగా.. కాంగ్రెస్, జేడీ(ఎస్) వరుసగా 78, 37 సీట్లు గెలుచుకుంది.