
బెంగళూరు: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతుంది. అయితే పోలింగ్ సందర్బంగా కొన్నిచోట్ల పార్టీల నాయకుల మధ్య ఘర్షణలు చోటుచేసుకుంటున్నాయి. బళ్లారి రూరల్ నియోజకవర్గంలో పోలింగ్ సందర్భంగా బీజేపీ, కాంగ్రెస్ కార్యకర్తల మధ్య జరిగిన ఘర్షణలో కాంగ్రెస్ నేత ఉమేష్ యాదవ్ గాయపడ్డాడు. ఉమేష్ యాదవ్ తలకు గాయమైంది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకున్న గుంపును చెదరగొట్టారు. ఉమేష్ యాదవ్ గతంలో బీజేపీలో కొనసాగగా.. ఇటీవలే కాంగ్రెస్‌లో చేరారు.
ఇదిలా ఉంటే.. గంగావతి సెంట్రల్ నియోజకవర్గంలో బీజేపీ, ర్ణాటక రాజ్య ప్రగతి పక్ష పార్టీ (కేఆర్‌పీపీ) కార్యకర్తల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. 159, 160 పోలింగ్ బూత్‌ల వద్ద కేఆర్‌పీపీ కార్యకర్తలతో బీజేపీ కార్యకర్తలు ఘర్షణకు దిగారు. కేఆర్‌పీపీ పార్టీని బళ్లారి మైనింగ్ వ్యాపారి గాలి జనార్దన్ రెడ్డి స్థాపించిన సంగతి తెలిసిందే. ఆయన గంగావతి నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. బళ్లారి ప్రాంతంలో గాలి జనార్దన్ రెడ్డి పార్టీ ప్రభావం.. కాంగ్రెస్, బీజేపీలపై ఉండనుందనే అంచనాలు ఉన్నాయి. ఈ క్రమంలోనే గత కొన్ని రోజులుగా ఆ ప్రాంతంలో చిన్నపాటి గొడవలు జరుగుతున్నాయి.
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ సాయంత్రం 6 గంటల వరకు సాగనుంది. రాష్ట్రంలో ఉదయం 11 గంటల వరకు 20.99 శాతం ఓటింగ్ నమోదైంది. ఇక, మే 13న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు జరగనుంది.