ఉత్తరప్రదేశ్ సహా నాలుగు రాష్ట్రాల్లో ఉప ఎన్నికలు.. కొనసాగుతున్న ఓటింగ్.. పూర్తి వివరాలు ఇవే

By Mahesh KFirst Published May 10, 2023, 1:40 PM IST
Highlights

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుండగా అదే సమయంలో దేశంలోని నాలుగు రాష్ట్రాల్లో నాలుగు అసెంబ్లీ స్థానాలకు, ఒక లోక్‌సభ స్థానానికి ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. మే 13వ తేదీనే ఫలితాల వెలువడనున్నాయి. ఈ సీట్లు ఎలా ఖాళీ అయ్యాయనే విషయాలు తెలుసుకుందాం.
 

న్యూఢిల్లీ: ఒక వైపు దేశమంతా కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలను చూస్తుండగా.. ఉత్తరప్రదేశ్, ఒడిశా, మేఘాలయాల్లో అసెంబ్లీ స్థానాలకు, పంజాబ్‌లోని ఒక లోక్‌సభ స్థానానికి ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. పంజాబ్‌లోని జలంధర్ లోక్‌సభ స్థానానికి, ఉత్తరప్రదేశ్‌లోని ఛాంబే, సువార్, ఒడిశాలోని ఝార్సుగూడ, మేఘాలయాలోని సొహియాంగ్ అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. మే 13వ తేదీన ఫలితాలు వెలువడుతాయి. ఉదయం 11 గంటలకల్లా ఝార్సుగూడలో 20.38 శాతం, ఛాంబేలో 19.16 శాతం, సువార్‌లో 18.4 శాతం, జలంధర్‌లో 17.43 శాతం పోలింగ్ నమోదైంది.అయితే, ఆ స్థానాలు ఎలా ఖాళీ అయ్యాయనే వివరాలు తెలుసుకుందాం.

జలంధర్ లోక్‌సభ నియోజకవర్గం:

పంజాబ్‌లోని జలంధర్ లోక్‌సభ నియోజకవర్గానికి ఈ రోజు ఎన్నిక జరుగుతున్నది. అధికార ఆప్, కాంగ్రెస్, బీజేపీ, శిరోమణి అకాలీ దళ్ పార్టీలు ఇక్కడ పోటీ పడుతున్నాయి. ఇక్కడ కాంగ్రెస్ ఎంపీ సంతోఖ్ సింగ్ చౌదరి మరణించడంతో సీటు ఖాళీ అయింది. భారత్ జోడో యాత్రలో పాల్గొన్నప్పుడు ఈ ఏడాది జనవరిలో ఆయన మరణించాడు. ఆప్ నుంచి మాజీ ఎమ్మెల్యే సుశీల్ రింకు, బీజేపీ నుంచి ఇక్బాల్ సింగ్ అత్వాల్, శిరోమణి నుంచి మాజీ ఎమ్మెల్యే సుఖ్విందర్ కుమార్ సుఖి పోటీ చేస్తున్నారు.

యూపీలోని సువార్ అసెంబ్లీ నియోజకవర్గం:

ఉత్తరప్రదేశ్‌లోని సువార్ అసెంబ్లీ నియోజకవర్గానికి జరుగుతన్న ఉప ఎన్నికలో అధికార బీజేపీ, ప్రధాన ప్రతిపక్ష పార్టీ సమాజ్‌వాదీ పార్టీ మధ్య గట్టి పోటీ ఏర్పడింది. ఎస్పీ కోసం ఆజాం ఖాన్,ఆయన కొడుకు అబ్దుల్లా ఖాన్‌లు విస్తృత ప్రచారం చేశారు. కాగా, బీజేపీ మిత్రపక్షం అప్నాదల్ (ఎస్) ఇక్కడ అభ్యర్థిని నిలబెట్టింది. అయినా.. బీజేపీ క్రియాశీలకంగా ప్రచారం చేస్తున్నది.

15 ఏళ్ల కిందటి కేసులో అబ్దుల్లా ఆజాం ఖాన్‌ను దోషిగా తేల్చి మొరదాబాద్ కోర్టు రెండేళ్ల జైలు శిక్ష విధించింది. దీంతో ఆయన చట్టసభ్యత్వం రద్దయింది. ఇప్పుడు ఈ నియోజకవర్గానికి ఎన్నిక జరుగుతున్నది.

Also Read: Karnataka Elections Live Updates : మధ్యాహ్నం ఒంటిగంట వరకు 40% పోలింగ్

యూపీలోని ఛాంబే నియోజకవర్గం:

యూపీలోని ఛాంబే నియోజకవర్గంలో ఉప ఎన్నికను కోడలు, బిడ్డ మధ్య పోటీగా అభివర్ణిస్తున్నారు. అప్నా దళ్ (ఎస్) ఎంపీ రాహుల్ కోల్ మరణంతో ఈ స్థానానికి ఎన్నిక అనివార్యమైంది. ఈ పార్టీ రాహుల్ కోల్ భార్య రింకి కోల్‌ను బరిలోకి దింపింది. కాగా, మరో మాజీ చట్టసభ్యుడు భాయి లాల్ కోల్ తన కూతురును ఎస్పీ టికెట్ పై ఎన్నికలో నిలిపాడు. మొత్తం 8 మంది పోటీ పడుతున్నారు.

ఒడిశాలోని ఝార్సుగూడ అసెంబ్లీ నియోజకవర్గం:

ఒడిశాలో ఝార్సుగూడ అసెంబ్లీ నియోజకవర్గ ఉపఎన్నిక కోసం అధికార బీజేడీ, కాంగ్రెస్, బీజేపీలు పోటాపోటీగా బరిలో నిలబడ్డాయి. నబా కిశోర్ దాస్ జనవరి 29వ తేదీన మరణించడంతో ఈ సీటు ఖాళీ అయింది. ఆయన అప్పుడు రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రిగా చేశారు. ఇక్కడ మొత్తం 9 మంది అభ్యర్థులు ఉన్నప్పటికీ బీజేడీ, బీజేపీ, కాంగ్రెస్ మధ్యే ప్రధాన పోరు ఉన్నది.

మేఘాలయాలోని సొహియాంగ్ అసెంబ్లీ స్థానం:

మేఘాలయాలోని సొహియాంగ్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక జరుగుతున్నది. యునైటెడ్ డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి హెచ్‌డీఆర్ లింగ్‌డో రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుండగా మరణించారు. ఫిబ్రవరి 27వ తేదీన మరణించారు. దీంతో సొహియాంగ్ స్థానానికి ఎన్నిక వాయిదా వేశారు. ఇప్పుడు యూడీపీ నుంచి సింషార్ లింగ్‌డో తబా, ఎన్‌పీపీ నుంచి సమ్లిన్ మాల్నగియాంగ్, కాంగ్రెస్ నుంచి ఎస్ ఒస్బర్నే ఖర్జానాలు పోటీ చేస్తున్నారు.

click me!