హిజాబ్ పై విధించిన నిషేధాజ్ఞలను ఎత్తేస్తున్నామని కర్ణాటక సీఎం సిద్ధరామయ్య సంచలన ప్రకటన చేశారు. ఈ మేరకు తాను అధికారులను కూడా ఆదేశించినట్టు వివరించారు.
Hijab: కర్ణాటక సీఎం సిద్ధరామయ్య సంచలన నిర్ణయాన్ని వెల్లడించారు. గతేడాది కర్ణాటక రాష్ట్రమే కాదు.. దేశాన్ని కుదిపేసిన హిజాబ్ బ్యాన్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటున్నట్టు చెప్పారు. ఒకరి కట్టుబొట్టు, ఆహారపుటలవాట్లను నియంత్రించలేమని అన్నారు. ఇష్టమున్న దుస్తులను ధరించవచ్చని, ఇష్టమైన ఆహారాన్ని స్వీకరించవచ్చని శుక్రవారం తెలిపారు.
‘హిజాబ్ బ్యాన్ నిర్ణయాన్ని మేం వెనక్కి తీసుకుంటాం. మహిళలు వారికి ఇష్టమున్న దుస్తులను ధరించవచ్చు. ఇష్టమున్న చోటికి వెళ్లొచ్చు. హిజాబ్ బ్యాన్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని అధికారులకు ఆదేశించాను. ధరించే దుస్తులు, తినే ఆహారం వ్యక్తిగత విషయాలు. నేను ఎలా అడ్డుచెప్పగలను? మీకు ఇష్టమున్న వాటిని ధరించండి. ఇష్టమున్న ఆహారం తినవచ్చు. నేను ధోతి కట్టుకుంటాను. మీరు ప్యాంట్, అంగి వేసుకున్నారు. ఇందులో తప్పేమున్నది. వోట్ల కోసం రాజకీయం చేయడం తగదు.’ అని మైసూర్‌లో ఓ కార్యక్రమంలో సీఎం సిద్ధరామయ్య స్పష్టం చేశారు.
Also Read: AIMIM: కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎంఐఎం మద్దతు డౌటే!.. అసెంబ్లీలో రచ్చ.. రచ్చ
ఎక్స్ వేదికగా ప్రధాని మోడీపై సిద్ధరామయ్య ఫైర్ అయ్యారు. సబ్ కా సాత్, సబ్ కా వికాస్ అనే మాట బోగస్ అని ఆరోపించారు. ‘బీజేపీ ప్రజలను, సమాజాన్ని దుస్తులు, డ్రెస్సులు, కులం ఆధారంగా విభజిస్తుంది. అందుకే నేను హిజాబ్ బ్యాన్ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని అధికారులను ఆదేశించాను’ అని వివరించారు.
విద్యాసంస్థల్లో హిజాబ్ బ్యాన్ నిర్ణయాన్ని కర్ణాటకలో తొలిసారి బీజేపీ ప్రభుత్వం 2022లో అమల్లోకి తెచ్చింది. కర్ణాటక హైకోర్టు ఈ నిర్ణయాన్ని సమర్థించింది. హిజాబ్ అనేది ఇస్లాంలో అత్యావశ్యకంగా పాటించాల్సిన ఆచారం కాదని, విద్యా సంస్థల్లో ముందుగా నిర్దేశించిన యూనిఫామ్ డ్రెస్ కోడ్‌ను పాటించాలని తెలిపింది. ఈ అంశం ఇప్పుడు సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉన్నది.