Siddaramaiah: ముఖ్యమంత్రికి భారీ ఊరట.. క్లీన్ చిట్‌ ఇచ్చిన లోకాయుక్త

Published : Feb 19, 2025, 04:55 PM ISTUpdated : Feb 19, 2025, 04:59 PM IST
 Siddaramaiah:  ముఖ్యమంత్రికి భారీ ఊరట.. క్లీన్ చిట్‌ ఇచ్చిన లోకాయుక్త

సారాంశం

కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఆయన భార్యకు భారీ ఊరట లభించింది. 'ముడా' భూ కుంభకోణం కేసులో అవినీతి నిరోధక సంస్థ లోకాయుక్త బుధవారం క్లీన్ చిట్ ఇచ్చింది.. 

ముడా కేసులో కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, ఆయన భార్యతో పాటు ఇతరులకు సంబంధించి  ఎలాంటి ఆధారాలు లేవని లోకాయుక్త పోలీసులు తెలిపారు. బెంగళూరులోని ప్రధాన కార్యాలయానికి తుది నివేదికను సమర్పించిన దాదాపు వారం తర్వాత లోకాయుక్త పోలీసులు ఈ ప్రకటన చేశారు. సీఎం సిద్ధరామయ్య, ఆయన కుటుంబ సభ్యులు ప్రమేయం ఉన్న మైసూర్ పట్టణాభివృద్ధి సంస్థ (ముడా) సైట్ కేటాయింపు కేసుపై 138 రోజుల విస్తృత దర్యాప్తు తర్వాత ఈ నివేదిక సమర్పించారు.  ముడా కుంభకోణంలో  సీఎం సిద్ధరామయ్యకు వ్యతిరేకంగా ఎటువంటి ఆధారాలు లేవని స్పష్టం చేసింది.

విచారణలో భాగంగా బ్యూరోక్రాట్‌లు, రాజకీయ నాయకులు, పదవీ విరమణ చేసిన అధికారులు, ముడా అధికారులతో పాటు సిద్ధరామయ్య, ఆయన భార్య బిఎం పార్వతి, బావమరిది బిఎం మల్లికార్జున స్వామి వంటి కీలక వ్యక్తులతో సహా 100 మందికి పైగా వ్యక్తులను పోలీసులు ప్రశ్నించారు. 

వారి వాంగ్మూలాలను వీడియో రికార్డ్ చేసి తుది నివేదికలో నమోదు చేశారు. "వివాదాస్పద ఆస్తి, సైట్ కేటాయింపులు, నోటిఫికేషన్ ప్రక్రియలకు సంబంధించిన 3,000 పేజీలకు పైగా పత్రాలను పరిశీలించారు" అని అధికారులు తెలిపారు. 

సామాజిక కార్యకర్త స్నేహమయి కృష్ణ దాఖలు చేసిన పిటిషన్ ఆధారంగా గతేడాది సెప్టెంబర్ 27వ తేదీన ప్రత్యేక కోర్టు సిద్ధరామయ్యతో పాటు మరో ముగ్గురిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని ఆదేశించింది. అనంతరం గవర్నర్ థావర్ చంద్ గెహ్లాట్ సిద్ధరామయ్యపై దర్యాప్తునకు అనుమతి ఇవ్వడం అప్పట్లో సంచలన సృష్టించింది. ఇక గవర్నర్ నిర్ణయాన్ని కర్ణాటక హైకోర్టు సైతం సమర్థించింది. ఐపీసీ, అవినీతి నిరోధక చట్టం, బినామీ ఆస్తి లావాదేవీల నిషేధ చట్టం, కర్ణాటక భూ ఆక్రమణల నిషేధ చట్టం కింద దర్యాప్తు చేపట్టారు. 

అసలేంటీ కేసు.. 

సిద్ధరామయ్య భార్య పార్వతికి మైసూరులోని కేసరే గ్రామంలో 3 ఎకరాల భూమి ఉంది. దాన్ని ఆమె సోదరుడు మల్లికార్జున్ ఆమెకు బహుమతిగా ఇచ్చారు. అయితే, ఈ భూమిని అభివృద్ధి కోసం ముడా స్వాధీనం చేసుకుంది. పరిహారం కింద 2021లో పార్వతికి దక్షిణ మైసూరులోని ప్రధాన ప్రాంతమైన విజయనగర్‌లో 38,283 చదరపు అడుగుల ప్లాట్‌ను ప్రభుత్వం కేటాయించింది. పరిహారం కింది ఇచ్చిన ప్లాట్‌ మార్కెట్‌ విలువ కేసరేలో ఆమె నుంచి స్వాధీనం చేసుకున్న భూమికంటే ఎక్కువ అని బీజేపీ ఆరోపించింది. దీంతో ముడా కుంభకోణం తెరపైకి వచ్చింది.

PREV
click me!

Recommended Stories

అందుకే దీక్ష విరమిస్తున్నా: Sonam Wangchuck after breaking hunger strike | Asianet News Telugu
Sonam Wangchuk: సోనమ్ వాంగ్‌చుక్ దీక్ష విరమణ వెనుక ఏం జరిగింది? కేంద్రం ఇచ్చిన బిగ్ ఆఫర్ ఇదేనా?