మరీ ఇంత పిసినారితనమా.. స్వామి..!!

First Published Jun 21, 2018, 4:46 PM IST
Highlights

మరీ ఇంత పిసినారితనమా.. స్వామి..!!

కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి పిసినారిగా మారిపోయారు.. సరదాకి కాదండి బాబూ నిజంగానే.. ఆయనకు అంత అవసరం ఏమొచ్చిందనేగా మీ డౌట్.. అక్కడికే వస్తున్నాం. సీఎంగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి కుమారస్వామి పొదుపు చర్యలను కఠినంగా పాటిస్తున్నారు.. ప్రభుత్వ ధనాన్ని ఖర్చు చేసే విషయంలో ఒకటికి పదిసార్లు ఆలోచిస్తున్నారు. అధికార కార్యక్రమాల కోసం కొత్త కార్లు కొనొద్దని, కార్యాలయాలు, ఇళ్లలో ఎటువంటి ఆధునికీకరణ పనులు చేయించవద్దని అధికారులు, మంత్రులు, ఎమ్మెల్యేలకు చెబుతున్నారు..

ఇక ఆయన వంతుగా రాష్ట్ర ముఖ్యమంత్రిగా అధికారిక బంగ్లాలో నివసించే అవకాశం ఉన్నప్పటికీ దానిని వదులునుకున్నారు.. అత్యాధునిక రక్షణ సదుపాయాలుండే కారును కాదని.. తన సొంత కారులోనే ప్రతిరోజు సచివాలయానికి వస్తున్నారు. అసలు ఇంతలా పిసినారిగా మారడానికి కారణం ఏంటంటే.. జేడీఎస్ ఎన్నికల హామీల్లో అత్యంత ప్రధానమైన అంశం రైతు రుణమాఫీ..

రాష్ట్ర ఆర్థిక వనరుల దృష్ట్యా ప్రస్తుత పరిస్థితుల్లో ఆ హామీని నిలబెట్టుకోవాలంటే అది కత్తి మీద సామే.. దీనికి రూ. 50 వేల కోట్లు అవసరమవుతాయి. అందుకే ప్రజా ధనం విషయంలో సీఎం ప్రతి చిన్న ఖర్చు విషయంలోనూ ఆచితూచి అడుగులు వేస్తున్నారు. కుమారస్వామి వైఖరిని ప్రజలు, మీడియా ఆసక్తిగా గమనిస్తోంది. సో.. అదన్న మాట..
 

click me!