
బెంగళూరులో మౌలిక సదుపాయాలు అధ్వానంగా ఉన్నాయని ఖాతాబుక్ సీఈఓ రవీష్ నరేశ్ చేసిన ట్వీట్‌పై తెలంగాణ మంత్రి కేటీఆర్ స్పందించారు. ‘బ్యాగ్‌లు సర్దుకొని హైదరాబాద్‌కు రండి.. మా దగ్గర భౌతికంగా, సామాజికంగా మెరుగైన మౌలిక సదుపాయాలు ఉన్నాయి’ అని ట్వీట్ చేశారు. అయితే కేటీఆర్ ట్వీట్‌పై తాజాగా కర్ణాటక సీఎం బసవరాజ్ బొమ్మై స్పందించారు. కేటీఆర్ వ్యాఖ్యలు హాస్యాస్పదమన్నారు. భారతదేశం మాత్రమే కాదు.. ప్రపంచం నలుమూలల నుంచి ఎంతోమంది బెంగళూరు వస్తున్నారని.. నగరంలో అత్యధిక సంఖ్యలో స్టార్టప్‌లు ఉన్నాయని చెప్పారు. బిలియన్ల డాలర్ల విలువైన యునికార్న్‌లు అత్యధికంగా బెంగళూరులో ఉన్నాయని తెలిపారు. బెంగళూరును హైదరాబాద్‌తో పోల్చడం చాలా పెద్ద జోక్ అని వ్యాఖ్యానించారు.
విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను అత్యధికంగా ఆకర్షిస్తున్న నగరం బెంగళూరని చెప్పారు. గత మూడు త్రైమాసికాల్లో దేశం యొక్క విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులలో అత్యధికంగా 40 శాతం ఆకర్షించడం ద్వారా భారతదేశంలో కర్ణాటక మొదటి స్థానంలో ఉందని చెప్పారు.
మరోవైపు, కర్ణాటక బీజేపీ కూడా కేటీఆర్ ట్వీట్‌పై స్పందించింది. తెలంగాణలో ఏం జరుగుతోందో ప్రపంచానికి తెలుసని, ఆకాశాన్ని కొలిచే ముందు అంగుళాన్ని కొలవడం నేర్చుకోవాలంటూ ఘాటుగా ట్వీట్ చేసింది. ఉనికి కోల్పోతున్న కేసీఆర్ సర్కారు అభివృద్ధి విషయంలో బెంగళూరుతో సవాలు చేయడం హాస్యాస్పదమని పేర్కొంది.
అసలేం జరిగిందంటే..
రవీశ్ నరేశ్ ఇటీవల బెంగళూరులో మౌలిక సదుపాయాల గురించి ట్విట్టర్‌లో ఫిర్యాదు చేశారు. బెంగళూరులో రోడ్లు అధ్వాన్నంగా ఉన్నాయని, ప్రతి రోజూ విద్యుత్ కోతలు ఉంటున్నాయని ఆయన పేర్కొన్నారు. ఈ సంభాషణలో తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ కూడా జాయిన్ అయ్యారు. బ్యాగులు సర్దుకుని హైదరాబాద్ వచ్చేయండి అని వారికి సూచించారు. ఇక్కడ మెరుగైన వసతులు ఉన్నాయని, తాము ముఖ్యంగా ఇన్నోవేషన్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, ఇంక్లూసివ్ గ్రోత్‌పైన ఫోకస్ పెడుతున్నామని వివరించారు. మా విమానాశ్రయం అత్యుత్తమమైనదని చెప్పారు.
తాజాగా, ఈ ట్వీట్‌పై కర్ణాటక కాంగ్రెస్ చీఫ్ డీకే శివకుమార్ రియాక్ట్ అయ్యారు. మై ఫ్రెండ్ కేటీఆర్.. మీ సవాలును స్వీకరిస్తున్నా అని పేర్కొన్నారు. వచ్చే ఏడాది చివరికల్లా కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుందని తెలిపారు. ఆ తర్వాత దేశంలో బెస్ట్ సిటీగా బెంగళూరు ఘనతను పునరుద్ధరిస్తామని పేర్కొన్నారు.
ఈ ట్వీట్‌కు మంత్రి కేటీఆర్ కూడా మళ్లీ జవాబు ఇచ్చారు. ప్రియమైన డీకే శివకుమార్ అన్నా.. కర్ణాటక రాజకీయాల గురించి తనకు పెద్దగా తెలియదని, ఎవరు గెలుస్తారో కూడా తనకు తెలియదని పేర్కొన్నారు. కానీ, సవాల్‌ను మాత్రం స్వీకరిస్తున్నట్టు వివరించారు. యువతకు ఉపాధిని కల్పించడంలో ఆరోగ్యకరమైన వాతావరణంలో హైదరాబాద్, బెంగళూరు నగరాలు పోటీ పడనిద్దాం అని తెలిపారు. కాబట్టి, హలాల్, హిజాబ్‌లపై కాదు.. ఐటీ అండ్ బీటీ, మౌలిక సదుపాయాల కల్పనపై ఫోకస్ పెడదామని వివరించారు.