
CM Bommai Corona Positive: దేశంలో కరోనా మహమ్మారి మరోసారి తన పంజా విసురుతోంది. కరోనా ఇన్ఫెక్షన్ విషయంలో హెచ్చు తగ్గులు కొనసాగుతున్నాయి. అయితే.. కొంతకాలంగా రోజువారీ కరోనా కేసులు 20 వేల వరకు చేరుకుంటున్నాయి. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ శనివారం విడుదల చేసిన గణాంకాల ప్రకారం, గత 24 గంటల్లో దేశంలో 19,406 కొత్త కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో, 19,928 మంది కోలుకున్నారు.
పెరుగుతున్న సంక్రమణ రేటు
ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన నివేదిక ప్రకారం.. దేశంలో రోజువారీ కరోనా సంక్రమణ రేటు 4.96 శాతానికి చేరుకుంది. అదే సమయంలో.. కరోనా పాజివిట్ కేసుల సంఖ్య 1,34,793కి చేరుకుంది. ఇది కాకుండా.. దేశంలో ఇప్పటివరకు కరోనా కారణంగా మరణించిన వారి సంఖ్య 5,26,649 కు చేరుకోగా.. కరోనా నుండి కోలుకుంటున్న వారి సంఖ్య 4,34,65,552 కు చేరుకుంది.
కర్ణాటక సీఎంకు కరోనా పాజివిట్
కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మైకి కరోనా సోకింది. ఈ విషయాన్ని ఆయన ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. గత రెండు రోజులుగా ఆయనకు తేలికపాటి లక్షణాలను లక్షణాలు ఉండటంతో.. కరోనా పరీక్ష చేసుకోగా.. కరోనా ఉన్నట్టు నిర్ధారణ అయ్యింది. ఇటీవల తనను కలిసిన వారంతా కరోనా టెస్టులు చేయించుకొని, జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ప్రస్తుతం ఐసోలేషన్ లో ఉన్నట్టు తెలిపారు.
కరోనా బారిన పడటంతో ఢిల్లీ టూర్‌ను వాయిదా వేసుకుంటున్నట్లు సీఎం బసవరాజ్ బొమ్మై పేర్కొన్నారు. గత నెలలో (జులై 25, 26 తేదీల్లో) బొమ్మై ఢిల్లీలో పర్యటించిన సంగతి తెలిసిందే. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రమాణస్వీకార కార్యక్రమంలో కర్ణాటక సీఎం పాల్గొన్నారు.
ఇటీవల తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌కు కరోనా సోకింది. జూలై 12న సీఎం ఎంకే స్టాలిన్‌కు కరోనా సోకడంతో కావేరీ ఆస్పత్రిలో చేరారు. అలాగే.. కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీకి కూడా జూన్‌లోనే కరోనా పాజిటివ్ వచ్చింది. బీహార్ సీఎం నితీష్ కుమార్ కూడా జూలైలో కరోనా బారిన పడ్డారు.