
చెన్నై: తమిళనాడు కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ ప్రివెన్షన్ యాక్ట్ ట్రయల్ కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కోర్టు శుక్రవారం దళితుల హత్య కేసులో 27 మందికి యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. 2018లో శివగంగాయ్ జిల్లాలో జరిగిన ఘటనలో ముగ్గురు దళితులను దారుణంగా నరికి చంపారు. ఉన్నత కులాలకు చెందిన కొందరు వ్యక్తులు ఈ దాడికి పాల్పడ్డారు.
ఈ కేసును జడ్జీ జీ ముత్తుకుమారన్ విచారించారు. ఈ నెల 1వ తేదీన కేసులో 27 మందిని దోషులుగా తేల్చారు. శుక్రవారం వారికి శిక్ష తీవ్రతను ప్రకటించారు. 27 మంది దోషులకు జీవిత ఖైదు విధించారు.
తమిళనాడులో శివగంగాయ్ జిల్లా కాచనాథమ్ గ్రామంలో 2018లో దారుణం జరిగింది. 2018 మే 28వ తేదీ రాత్రి ఓ ఆలయ వేడుక కేంద్రంగా ఈ దాడి జరిగింది. ఈ వేడుకలో ఉన్నత కులాలకు చెందిన కొందరికి దళితులు గౌరవం ఇవ్వకపోవడానికి ఈ దాడికి గల కారణంగా తేలింది. తమకు గౌరవం ఇవ్వని దళిత కులాలకు చెందిన కొందరిని వారు అదే రాత్రి కత్తులో నరికారు. ఇందులో ఆరుముగం (65), శణ్ముగనాథమ్ (31), చంద్రశేఖర్ (34)లు అక్కడికక్కడే మరణించారు. మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ గాయాలతో సుమారు ఏడాదిన్నర కాలం తర్వాత థనశేకరన్ (32) మరణించారు.
ఈ ఘటనకు సంబంధించి పోలీసులు 33 మంది నిందితులపై చార్జిషీటు దాఖలు చేశారు. అవరంగడు గ్రామానికి చెందిన సుమన్, అరుణ్ కుమార్, చంద్రకుమార్, అగ్నిరాజ్, రాజేశ్ సహా పలువురు ఇందులో ఉన్నారు. నలుగురు మైనర్లు కూడా ఉన్నారు. ట్రయల్ జరుగుతున్న కాలంలో ఇద్దరు మరణించారు. ఒకరు పరారీలో ఉన్నారు.