
బెంగళూరు: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతున్నది. 224 అసెంబ్లీ స్థానాలున్న కర్ణాటకలో కాంగ్రెస్ 129 స్థానాల్లో ముందంజలో ఉన్నది. కాగా, బీజేపీ 68 స్థానాల్లో లీడింగ్‌లో ఉండగా.. జేడీఎస్ 22 సీట్లలో మాత్రమే ముందంజలో ఉన్నది. మెజార్టీ మార్క్‌ను కాంగ్రెస్ కచ్చితంగా దాటే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే కర్ణాటక సీఎం, బీజేపీ నేత బసవరాజ్ బొమ్మై కీలక వ్యాఖ్యలు చేశారు.
‘మేం మెజార్టీ మార్క్‌ను సాధించలేకపోయాం. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సహా మేమంతా.. పార్టీలోని ప్రతి ఒక్కరు ఎంతో ప్రయత్నించినా మ్యాజిక్ ఫిగర్‌ను అందుకోలేకపోయాం’ అని బొమ్మై అన్నారు.
‘ఫలితాలు పూర్తిగా వెలువడిన తర్వాత సమగ్రమైన విశ్లేషణ చేస్తాం. ఈ ఫలితాలను మేం తీసుకునే నిర్ణయాల్లో పరిగణనలోకి తీసుకుంటాం. వచ్చే ఏడాది జరగనున్న లోక్ సభ ఎన్నికల కోసం పార్టీని మళ్లీ రీఆర్గనైజ్ చేసుకుంటాం’ అని చెప్పారు.
కర్ణాటకలో అధికార బీజేపీకి షాక్ తగిలింది. నేటి ఉదయం మొదలైన కౌంటింగ్ లో మొదటి నుంచి కాంగ్రెస్ ఆధికత్య కనబరుస్తోంది. బీజేపీ మెజారిటీ సాధించడానికి చాలా దూరంలోనే ఉంది. అయితే ఫలితాల్లో బీజేపీ ముఖ్య నాయకులైన ఐదుగురు మంత్రులు కూడా వెనకంజలో ఉన్నారు.
వెనుకంజలో ఉన్న కర్ణాటక బీజేపీ అగ్రనేతలు వీరే..
వి సోమన్న,
డాక్టర్ కె.సి.నారాయణగౌడ్,
సి.సి.పాటిల్,
బి.సి. పాటిల్,
డాక్టర్ కె.సుధాకర్.
ఇదే సమయంలో కాంగ్రెస్ అగ్రనేతలైన సిద్ధరామయ్యతో పాటు మరి కొందరు ఆధిక్యత కనబరుస్తున్నారు. మూడో రౌండ్ ముగిసే సరికి కర్ణాటక కాంగ్రెస్ అధ్యక్షుడు డీకే శివకుమార్ రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి ఆర్ అశోకపై 15,098 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. అలాగే వరుణ నియోజకవర్గంలో రెండో రౌండ్ కౌంటింగ్ ముగిసే సమయానికి ప్రతిపక్ష నేత సిద్ధరామయ్య గృహనిర్మాణ శాఖ మంత్రి వి.సోమన్నపై 1,224 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు.