
Karnataka Elections: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ రాజకీయ సమీకరణాలు శరవేగంగా మారుతున్నాయి. టిక్కెట్ల పంపిణీ విషయంలో రాజకీయ పార్టీల్లో ఉత్కంఠ నెలకొంది. టిక్కెట్లు రాని నేతలు .. కొత్త దారి వెతుక్కుంటున్నారు. పార్టీని వీడి.. మరో పార్టీలో చేరడానికి కూడా సిద్దమవుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో బీజేపీకి వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఇప్పటికే మాజీ ముఖ్యమంత్రి జగదీశ్ శెట్టర్, లింగాయత్ సామాజిక నేత, ప్రముఖ నాయకుడు లక్ష్మణ్ సవదితోపాటు తదితర నాయకులు పార్టీని వీడారు. తాజాగా మరో నాయకుడు పార్టీని వీడనున్నారు. బీజేపీ సీనియర్ నేత ఎమ్మెల్సీ అయనూర్ మంజునాథ్ (Ayanur Manjunath) తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. అదే సమయంలో బీజేపీ పార్టీ సభ్వత్వానికి కూడా రాజీనామా చేసినట్టు మంజునాథ్ ప్రకటించారు.
ఈ క్రమంలో ఎమ్మెల్సీ అయనూర్ మంజునాథ్ విలేకరులతో మాట్లాడుతూ శాసనమండలి సభ్యత్వానికి, బీజేపీ సభ్యత్వానికి రాజీనామా చేస్తానని తెలిపారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో శివమొగ్గ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తానని కూడా చెప్పారు. శాసనమండలిలో తాను ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రజల అంగీకారంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. మధ్యాహ్నం అభ్యర్థిత్వానికి సంబంధించి ఓ రాజకీయ పార్టీ నేతలతో చివరి దఫా చర్చలు కూడా జరగనున్నాయి. అదే సమయంలో నేడు నామినేషన్ దాఖలు చేసే అవకాశం ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది.
విశేషమేమిటంటే.. గతంలో తాను తన పదవికి రాజీనామా చేసి.. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో శివమొగ్గ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తానని బీజేపీ నేత, ఎమ్మెల్సీ ఏనూరు మంజునాథ్ ప్రకటించారు. అయితే మరేదైనా పార్టీ నుంచి పోటీ చేస్తారా లేక స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తారా అనే విషయంపై ఆయన ఇంకా స్పష్టత ఇవ్వలేదు. కాగా, కర్ణాటక అసెంబ్లీలోని 224 స్థానాలకు గాను బీజేపీ ఇప్పటికే 222 స్థానాలకు తన అభ్యర్థులను ప్రకటించింది. ఇక శివమొగ్గ, మాన్వి స్థానాలను ఎవరు బరిలో దిగనున్నారనే విషయంపై ఇంకా స్పష్టత నివ్వకపోవడం గమనార్హం.