బీజేపీపై సంచలన వ్యాఖ్యలు చేసిన కర్ణాటక సీఎం

By Nagaraju TFirst Published Sep 20, 2018, 6:24 PM IST
Highlights

బీజేపీపై కర్ణాటక సీఎం హెచ్.డి. కుమారస్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ తమ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు కుట్ర పన్నుతుందని ఆరోపించారు. కాంగ్రెస్, జేడీఎస్ పార్టీలకు చెందిన పలువురు ఎమ్మెల్యేలకు ఐదు కోట్ల రూపాయలు ఎరవేసి ఎమ్మెల్యేలను తమవైపుకు తిప్పుకునే ప్రయత్నాలు చేస్తోందని మండిపడ్డారు. 

కర్ణాటక: బీజేపీపై కర్ణాటక సీఎం హెచ్.డి. కుమారస్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ తమ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు కుట్ర పన్నుతుందని ఆరోపించారు. కాంగ్రెస్, జేడీఎస్ పార్టీలకు చెందిన పలువురు ఎమ్మెల్యేలకు ఐదు కోట్ల రూపాయలు ఎరవేసి ఎమ్మెల్యేలను తమవైపుకు తిప్పుకునే ప్రయత్నాలు చేస్తోందని మండిపడ్డారు. 

జేడీఎస్, కాంగ్రెస్ పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలకు 5కోట్ల రూపాయలు ఎరవేసి ఆ తర్వాత వారిని ముంబై, పూణే రాష్ట్రాలకు తరలించాలని ప్రయత్నిస్తోందని తెలిపారు. ఆ తర్వాత గవర్నర్ ను కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు అవకాశం ఇవ్వాలని కోరడం, బలపరీక్ష రోజున ఎమ్మెల్యేలను తీసుకువచ్చేలా బీజేపీ ప్లాన్ వేసిందని ఆరోపించారు. 

కర్ణాటక రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చెయ్యాలని భావిస్తున్న యడ్యూరప్ప ఒకేసారి ఎమ్మెల్యేలందరికీ ఎరవేసేలా ప్లాన్ చేస్తున్నారని మండిపడ్డారు. ఎమ్మెల్యేలతో చర్చించి వారిని మిలటరీ విమానాలలో ముంబై, పూణేలకు తరలించి బలపరీక్ష రోజున తీసుకువచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారని ఆరోపించారు. 

ఇప్పటికే 18 మంది ఎమ్మెల్యేలతో చర్చలు జరిపిన యడ్యూరప్ప మరో ఇద్దరిని తమ వర్గంలోకి తీసుకుని మెుత్తం 20 మందితో క్యాంపు రాజకీయాలు చెయ్యలాని ప్రయత్నిస్తున్నారని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. బీజేపీ కుట్రపై పూర్తి స్థాయి సమాచారం రావడంతోనే తాను స్పందించానని తెలిపారు. 

సంకీర్ణ ప్రభుత్వంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన మంత్రి, మరో ఇద్దరు ఎమ్మెల్యేలు ఇప్పటికే బాహటంగా తెలియజేస్తున్నారని అనుమానం వ్యక్తం చేశారు. అవినీతిలో ఆరితేరిపోయిన యడ్యూరప్ప కుట్రరాజకీయాలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. కేంద్రంలో బీజేపీ ఉండటంతో ఆ పార్టీ అండతో తమ ప్రభుత్వాన్ని కూల్చేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు.

గతంలో కుమారస్వామి తమ ప్రభుత్వాన్ని కుప్పకూల్చే ప్రయత్నం చేస్తున్నారని గతంలో కూడా ఆరోపించారు. అయితే తాజాగా మళ్లీ కుమార స్వామి ఆరోపణలు చెయ్యడం చర్చనీయాంశంగా మారింది. 

మరోవైపు కర్ణాటకలో కాంగ్రెస్-జేడీఎస్ పార్టీల సంకీర్ణ ప్రభుత్వం కుప్పకూలిపోతే బీజేపీ చేతులు కట్టుకుని కుర్చోదని, కచ్చితంగా అధికారంలోకి వస్తామని బీజేపీ ఎమ్మెల్యే బళ్లారి శ్రీరాములు ధీమా వ్యక్తం చేశారు. మీ ప్రభుత్వాన్ని మీ ఎమ్మెల్యేలు కూల్చుతారని, మేము మాత్రం ఆ ప్రయత్నాలు చెయ్యమని స్పష్టం చేశారు. 

బీజేపీ నాయకులు సంకీర్ణ ప్రభుత్వాన్ని కూల్చడానికి ప్రయత్నిస్తున్నారని కాంగ్రెస్, జేడీఎస్ పార్టీలు చేస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదన్నారు. సంకీర్ణ ప్రభుత్వంలోనే కుమ్ములాట మొదలైయ్యిందని అందుకే సీఎం కుమారస్వామి అభద్రత భావంతో ఉన్నారని దుయ్యబుట్టారు. 

సంకీర్ణ ప్రభుత్వంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఒక వర్గం, జేడీఎస్ నాయకులు ఒక వర్గంగా విడిపోయి పోట్లాడుకుంటున్నారని, మధ్యలో బీజేపీని ఎందుకు లాగుతున్నారని మండిపడ్డారు. అధికారుల బదిలీలతో కాంగ్రెస్ పార్టీలో కుమ్ములాట మొదలైయ్యిందన్నారు. కాంగ్రెస్ పార్టీ అసమ్మతి ఎమ్మెల్యేలు ఢిల్లీకి వెలుతున్నారని, దానికి బీజేపీకి ఎలాంటి సంబంధం లేదన్నారు. 

సంకీర్ణ ప్రభుత్వంలోని అసమ్మతిని తాము దూరం నుంచి చూస్తున్నామని, మీ ప్రభుత్వాన్ని పడగొట్టాలనే ఉద్దేశం మాకు లేదని శ్రీరాములు స్పష్టం చేశారు. సంకీర్ణ ప్రభుత్వం మీద ప్రజలకు నమ్మకం లేదని, మీ ఎమ్మెల్యేలు మిమ్మల్ని నమ్మడం లేదని శ్రీరాములు ఆరోపించారు. మీ ప్రభుత్వాన్ని మీరే కుల్చుకుంటారని, ఆ సమయంలో బీజేపీ చేతులు కట్టుకుని కుర్చోదని, ప్రభుత్వ ఏర్పాటుకు సిద్దం అవుతోందని శ్రీరాములు అన్నారు.

2018లో కర్ణాటకలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అత్యధిక స్థానాల్లో విజయం సాధించింది. అయితే ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన 112 స్థానాలను కైవసం చేసుకోలేకపోయింది. బీజేపీ తర్వాత కాంగ్రెస్ పార్టీ 80 స్థానాల్లోనూ, జేడీఎస్ 37 స్థానాల్లో విజయం సాధించి మూడో స్థానంతో సరిపెట్టుకుంది. 

అయితే బీజేపీ అత్యధిక స్థానాల్లో గెలిచి అతిపెద్ద పార్టీగా అవతరించడంతో తామే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని బీఎస్. యడ్యూరప్ప స్పష్టం చేశారు. అనుకున్నదే తడవుగా సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. అంతే వేగంతో మూడురోజుల్లో బీజేపీ ప్రభుత్వం కుప్పకూలిపోయింది. 

దీంతో రంగంలోకి దిగిన కాంగ్రెస్ పార్టీ అధిష్టానం జేడీఎస్ పార్టీతో చర్చలకు శ్రీకారం చుట్టింది. ఇరు పార్టీలు కలిసి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. 80 స్థానాలు గెలిచిన కాంగ్రెస్ పార్టీ కాకుండా కేవలం 37 స్థానాల్లో విజయం సాధించిన జేడీఎస్ కు సీఎం పీఠం కట్టబెట్టింది. దీంతో హెచ్.డి.కుమార స్వామి ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు. 

click me!