రైతుల తలలు పగులగొట్టండి.. పోలీసులకు అధికారి సూచనలు.. వీడియో వైరల్

By telugu teamFirst Published Aug 28, 2021, 8:14 PM IST
Highlights

హర్యానాలోని కర్నాల్ జిల్లా అధికారి పోలీసులకు చేసిన సూచనలు వివాదాస్పదమయ్యాయి. హద్దుమీరిన రైతుల తలలను పగులగొట్టండని సూచిస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీనిపై బీజేపీ సహా పార్టీల నుంచి తీవ్ర అభ్యంతరాలు వెల్లువెత్తాయి. కర్నాల్‌లో రైతు ఆందోళనపై పోలీసులు లాఠీ చార్జ్ చేయగా, కనీసం పది మందికి గాయాలయ్యాయి.
 

చండీగడ్: బీజేపీ నేతలకు వ్యతిరేకంగా ఆందోళనలు చేస్తున్న రైతులు ‘గీత’దాటితే వారి తలలు పగులగొట్టండని ఓ జిల్లా అధికారి పోలీసులకు సూచనలు చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నది. సదరు అధికారి తీరుపై బీజేపీ నేతలు సహా అన్ని వర్గాల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. హర్యానాలోని కర్నాల్ జిల్లా అధికారిగా ఆయనను చెబుతున్నారు. ఇదే రోజు కర్నాల్‌లో రైతులపై లాఠీ చార్జి జరిగింది. కనీసం పది మంది రైతులు గాయపడటం గమనార్హం.

కర్నాల్ సబ్ డివిజనల్ మెజిస్ట్రేట్(ఎస్‌డీఎం) ఆయుశ్ సిన్హా పోలీసుల గ్రూపు ముందు నిల్చుని ఆ వీడియో కనిపించారు. ఒక హద్దును పేర్కొంటూ అది దాటి నిరసనకారులు రావడానికి వీల్లేదని స్పష్టం చేస్తున్నారు. ‘సింపుల్.. వారెవరైనా, ఎక్కడివారైనా, ఎవ్వరూ అక్కడికి చేరడానికి వీల్లేదు. ఈ గీత దాటడానికి వీల్లేదు. ఎవరైనా ప్రయత్నిస్తే మీరు మీ లాఠీ తీయండి. గట్టిగా బాదండి. సరేనా? ఇందుకు ప్రత్యేకంగా మీకు సూచనలు ఇవ్వాల్సిన పనిలేదు. జస్ట్ వారిని చితక్కొట్టండి. ఒక్క నిరసనకారుడు అది దాటినట్టు కనిపించినా ఆయన తల గాయాలపాలై ఉండటాన్ని నేను చూడాలి. వారి తలలు పగులగొట్టండి’ అని సిన్హా పోలీసులకు సూచిస్తున్నట్టు వీడియో వివరిస్తున్నది. అంతేకాదు, చివరిక ‘ఎనీ డౌట్’ అని ప్రశ్నించగా, ‘నో సర్’ అని పోలీసుల గర్జింపు వినిపించింది.

కర్నాల్‌లో సీఎం మనోహర్ లాల్ ఖట్టార్, ఇతర బీజేపీ నేతలు ఓ కార్యక్రమానికి విచ్చేస్తున్నారు. వారిని అడ్డుకోవాలనే లక్ష్యంతో రైతు ఆందోళనకారులు రాస్తారోకో చేశారు. వారిని అదుపులోకి తెచ్చే క్రమంలో పోలీసులు లాఠీ చార్జీ చేశారు. ఇందులో కనీసం పది మందికి గాయాలయ్యాయి. ఈ విషయం తెలుసుకుని ఇతర జిల్లాల్లోని రైతులు భారీగా రహదారులను దిగ్బంధించారు. దీంతో ఢిల్లీ, చండీగడ్‌లకు వెళ్లే దారుల్లో భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. చాలా చోట్ల రాళ్లు విసిరేసే ఘటనలు జరిగినట్టు సిన్హా తెలిపారు. తగిన స్థాయిలోనే బలగాలను వినియోగించాలని తెలియజేసినట్టు ఆయన వివరించారు.

కాగా, ఈ వీడియోపై బీజేపీ సహా అన్ని పార్టీల నుంచి తీవ్ర అభ్యంతరాలు వచ్చాయి. ఇది ఎడిట్ చేసిన వీడియో అనే ఆశిస్తున్నానని బీజేపీ నేత వరుణ్ గాంధీ ట్వీట్ చేశారు. లేదంటే ప్రజాస్వామిక భారతంలో సొంత పౌరులపై ఇలాంటి చర్యలు ఎట్టిపరిస్థితుల్లో ఆమోదయోగ్యం కాదని వివరించారు. కాంగ్రెస్ నేత రణదీప్ సుర్జేవాలా స్పందిస్తూ ‘ఖట్టార్ సాబ్, ఈ రోజు మీరు హర్యానా ప్రజల ఆత్మపై లాఠీ చార్జ్ చేశారు. వచ్చే తరాలు రోడ్లపై రైతుల రక్తపు మరకలను తప్పక గుర్తుంచుకుంటారు’ అని ట్వీట్ చేశారు.

click me!