లైంగికదాడిని బాధితురాలు తొలిసారి ప్రతిఘటించకుంటే కలవడానికి సమ్మతించినట్టుగానే చూడాలి: జడ్జీ

By telugu teamFirst Published Aug 28, 2021, 4:28 PM IST
Highlights

మద్రాస్ హైకోర్టు ఓ లైంగికదాడి గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. లైంగికదాడిని బాధితురాలు తొలిసారి ప్రతిఘటించకుంటే శారీరకంగా కలవడానికి ఆమె సమ్మతించినట్టుగానే చూడాలని న్యాయమూర్తి పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలు చేస్తూ దోషికి విధించిన శిక్షను తోసిపుచ్చారు.

చెన్నై: మద్రాస్ హైకోర్టు మదురై బెంచ్ సంచలన తీర్పు వెలువరించింది. లైంగికదాడిని బాధితురాలు తొలిసారి ప్రతిఘటించకుంటే దాన్ని ఆమె సమ్మతించినట్టుగానే చూడాలని జడ్జీ ఆర్ పొంగియప్పన్ వివరించారు. ఈ వ్యాఖ్యలు చేస్తూ 2009లో రేప్ కేసులో దోషిగా తేల్చిన ఖైదీ దాఖలు చేసిన అప్పీల్‌ను విచారించడానికి స్వీకరించారు. అంతేకాదు, విధించిన శిక్షనూ తోసిపుచ్చడానికి నిర్ణయించారు.

నిందితుడికి 21ఏళ్లు, బాధితురాలికి 19ఏళ్లు. వీరిద్దరూ ఒకేగ్రామానికి చెందినవారు. కనీసం ఒక ఏడాదిపాటు ప్రేమించుకున్నారు. ఆమెను పెళ్లి చేసుకుంటానని నిందితుడు వాగ్దానం చేశాడు. ఇదే క్రమంలో ఆమెతో శారీరకంగా కలిశాడు. ఆమె గర్భవతి అయిన తర్వాత తన వాగ్దానాన్ని విస్మరించాడు. పెళ్లి చేసుకోనని తెగేసి చెప్పాడు. దీని తర్వాతే బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనను పెళ్లి చేసుకుంటానని చెప్పి నమ్మించి తనపై లైంగికదాడికి పాల్పడ్డాడని ఆమె ఆరోపించింది. ఈ ఆరోపణలపై విచారించిన తర్వాత నిందితుడిని దోషిగా తేల్చి 2016లో పదేళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది. 

ఇటీవలే జస్టిస్ పొంగియప్పన్ ఈ శిక్షను తోసిపుచ్చారు. ఈ సందర్భంగా ఆయన పలు కీలక వ్యాఖ్యలు చేశారు. బాధితురాలు, నిందితుడు కొన్నాళ్లు ప్రేమలో ఉన్నారని గుర్తుచేశారు. పెళ్లి చేసుకుంటానని హామీనివ్వడంతో ఇరువురూ శారీరకంగానూ కలిశారని తెలిపారు. శారీరకంగా కలిసిన రెండున్నర నెలల తర్వాత గానీ ఆమె కేసు పెట్టలేదని పాయింట్ అవుట్ చేశారు. అంటే, నిందితుడితో బాధితురాలు ఇష్టపూర్వకంగా సహజీవనం చేశారని తెలిపారు. పెళ్లి చేసుకుంటానన్న మాటను నిందితుడు తప్పినందుకే ఆమె కేసు పెట్టారని వివరించారు. 

కాబట్టి, తొలిసారిగా ఆయన లైంగికదాడికి పాల్పడ్డప్పుడు ఆమె అడ్డుకోవాల్సిందని న్యాయమూర్తి పొంగియప్పన్ పేర్కొన్నారు. కానీ, ఆమె ప్రతిఘటించకపోవడాన్ని సంగమించడానికి ముందస్తు సమ్మతిగానే పరిగణించాల్సి వస్తుందని తెలిపారు. ఫిర్యాదు కాపీలోని పలుఅంశాలను, డాక్టర్ రిపోర్టులోని విషయాలను ప్రస్తావిస్తూ సందేహాలను లేవనెత్తారు.

click me!