
Kanwar Yatra in India: శివ భక్తుల కన్వర్ యాత్ర ప్రారంభం అయింది. కన్వర్ యాత్రికులు ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్, గోముఖ్, గంగోత్రి, బీహార్‌లోని సుల్తాన్‌గంజ్ తదితర ప్రాంతాలను దర్శించి అక్కడి పవిత్ర గంగాజలాలను సేకరిస్తారు. ప్రతియేటా శ్రామణమాసంలో కొనసాగే ఈ కన్వర్ యాత్ర గురువారం నాడు ప్రారంభమైంది. అయితే, కన్వర్ యాత్ర నేపథ్యంలో కేంద్ర హోం శాఖ రాష్ట్ర ప్రభుత్వాలను హెచ్చరిస్తూ.. కీలక సూచనలు చేసింది. కన్వర్ యాత్రకు రాడికల్ ఎలిమెంట్స్ నుంచి ముప్పు పొంచి ఉన్నదని పేర్కొంటూ.. కన్వారియాలకు (శివ భక్తులు) భద్రతను పెంచాలని హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ (MHA) రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. కన్వర్ యాత్రపై దాడులు జరిగే అవకాశలున్నాయనే నిఘా సంస్థలకు అందిన నివేదికల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఆయా రాష్ట్రాలను హెచ్చరించింది. ఈ క్రమంలోనే కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య కన్వర్ యాత్ర కొనసాగుతున్నదని రిపోర్టులు అందుతున్నాయి.
ఇంటెలిజెన్స్ బ్యూరో నివేదిక నుండి వచ్చిన ఇన్‌పుట్‌ల ఆధారంగా.. ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, మధ్యప్రదేశ్‌తో సహా అనేక రాష్ట్రాలకు హోం మంత్రిత్వ శాఖ కన్వర్ యాత్ర (Kanwar Yatra 2022) కు భద్రతా ఏర్పాట్లను పెంచడానికి ఒక సలహాను జారీ చేసింది. కన్వార్ యాత్రపై దాడి ముప్పును దృష్టిలో ఉంచుకుని రైళ్లలో భద్రతను కట్టుదిట్టం చేయాలని రైల్వే బోర్డును కూడా ఆదేశించింది. కేంద్ర హోం శాఖ సలహాల ప్రకారం.. కన్వర్ యాత్రలో ఎటువంటి ముప్పు వచ్చినా ఎదుర్కోవడానికి పెద్ద సంఖ్యలో పోలీసు సిబ్బందిని మోహరించాలని పేర్కొన్నారు. హిందూ మాసం శ్రావణమాసం మొదటి రోజు గురువారం గట్టి భద్రతా ఏర్పాట్ల మధ్య కన్వర్ యాత్ర ప్రారంభమైంది. గంగా జలాలను తీసుకురావడానికి శివుని భక్తులు పెద్ద సంఖ్యలో ఇప్పటికే హరిద్వార్‌కు చేరుకున్నారు. కోవిడ్-19 మహమ్మారి కారణంగా రెండేళ్ల విరామం తర్వాత కన్వర్ యాత్ర జరుగుతోంది. దీంతో దాదాపు పక్షం రోజుల పాటు జరిగే ఈ జాతరలో పవిత్ర నదీ జలాలను సేకరించేందుకు హరిద్వార్, పొరుగున ఉన్న రిషికేశ్‌లకు కనీసం నాలుగు కోట్ల కన్వారియాలు (శివ భక్తులు, పర్యాటకలు) వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు.
ఉత్తరప్రదేశ్, హర్యానా, ఢిల్లీ, హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, రాజస్థాన్‌తో సహా అనేక రాష్ట్రాల నుండి కన్వారియాలు హరిద్వార్, రిషికేష్‌లను సందర్శించి గంగా జలాలను సేకరించి, ఇంటిలోని దేవాలయాలలో శివునికి నైవేద్యంగా సమర్పిస్తారు. రెండు తీర్థయాత్ర పట్టణాల్లో భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చే అవకాశం ఉన్నందున, CCTV కెమెరాలు, డ్రోన్లు, సోషల్ మీడియా పర్యవేక్షణ ద్వారా కట్టుదిట్టమైన నిఘా నిర్వహించబడుతుంది. బాంబ్ డిస్పోజల్, యాంటీ టెర్రర్ స్క్వాడ్‌లను కూడా మేళా క్షేత్రంలో మోహరించారు. హరిద్వార్, పరిసర ప్రాంతాలను 12 సూపర్ జోన్‌లు, 31 జోన్‌లు, 133 సెక్టార్‌లుగా విభజించి దాదాపు 10,000 మంది పోలీసులను మోహరించారు. కన్వర్ యాత్ర మార్గాలపై డ్రోన్ నిఘా కూడా 24 గంటలు నిఘా కొనసాగుతుందనీ, ఈటెలు, ఇతర ఆయుధాలతో శివభక్తులు ఎవరూ పట్టణంలోకి ప్రవేశించడానికి అనుమతిలేదని పోలీసులు తెలిపారు.